విద్యార్థుల అర్ధాకలి చదువులు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థుల అర్ధాకలి చదువులు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు

విద్యార్థుల అర్ధాకలి చదువులు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు

Written By news on Sunday, August 19, 2012 | 8/19/2012

నిత్యావసరాల ధరలు మూడింతలు 
పెరగని హాస్టళ్ల మెస్ చార్జీలు
మూడు పూటలకు.. రూ.17
చాలీచాలని అన్నం, నీళ్ల చారు..
విద్యార్థుల అర్ధాకలి చదువులు..
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పస్తులు 
ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచి నాలుగేళ్లు 
ఇప్పటికి మూడింతలు పెరిగిన నిత్యావసరాల ధరలు 
అయినా పాత చార్జీలతోనే సరిపెడుతున్న సర్కారు 
అర్ధాకలితో అలమటిస్తున్న 8 లక్షల మంది విద్యార్థులు 
విద్యార్థులు ఉద్యమించినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
చార్జీలు చాలక మూతపడుతున్న కళాశాలల హాస్టళ్లు 
రివ్యూ కమిటీ వేసి ఏడాది దాటి నా ఫలితం శూన్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాధారణంగా హోటల్‌లో ప్లేట్ ఇడ్లీ ధర 15 రూపాయలపైనే ఉంటుంది. కానీ కేవలం 17 రూపాయలు ఇచ్చి మూడు పూటల భోజనం పెట్టాలంటోంది మన రాష్ట్ర సర్కారు. ఇలా దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 17తో ముప్పూటలా భోజనం పెట్టటమే కాదు.. ప్రతి రోజూ స్నాక్స్ అందించాలి. అప్పుడప్పుడూ కోడిగుడ్లు కూడా పెట్టాలి. ఇది సాధ్యమయ్యేదేనా?! నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.. ఈ ధరతో ఒక్క పూట భోజనం పెట్టటమూ గగనమే! ఫలితం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు అర్థాకలితో వెళ్లదీస్తున్నారు. వీరికోసం ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు ఏ మూలకూ చాలటంలేదు. జైల్లో ఖైదీలకు ఇస్తున్న మెస్ చార్జీల్లో సగమైనా ఈ విద్యార్థులకు ఇవ్వటం లేదు. మెస్‌చార్జీలను చివరిసారిగా నాలుగేళ్ల కిందట పెంచారు. ఈ నాలుగేళ్లలోనిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి. కానీ మెస్‌చార్జీల పెంపు గురించి పాలకులు పట్టించుకోవటం లేదు. ఫలితంగా చాలీచాలని అన్నం, పప్పు, నీళ్లచారే బడుగు విద్యార్థులకు దిక్కవుతోంది. మెస్‌చార్జీలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా.. విద్యార్థులు నిరసనలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసినా.. ఆఖరుకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు అడ్డం పడుకున్నా.. ప్రభుత్వం కరుణించటం లేదు. ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు సంక్షేమ హాస్టళ్లలో రాత్రిళ్లు బస చేస్తున్నారు కానీ.. పిల్లలు ఏం తింటున్నారు? ఎలాంటి అన్నం వారికి పెడుతున్నారు? అనే అంశాలపై దృష్టి సారించటం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ఒక్కో చోట ఒక్కో తీరు... 

జైళ్లలో ఖైదీలకు నెలకు రూ. 1,500, ఆసుపత్రుల్లో రోగులకు నెలకు రూ. 1,200 చొప్పున మెస్‌చార్జీలు ఇస్తున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అధికంగా ఉండే సంక్షేమ హాస్టళ్లు, కళాశాల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు మాత్రం నెలకు సగటున రూ. 505 మాత్రమే చెల్లిస్తున్నాయి. మూడు నుంచి ఏడో తరగతి చదువుతున్న వారికి నెలకు రూ. 475, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 535 ఇస్తున్నారు. దివంగత వైఎస్‌అధికారంలో ఉండగా మెస్‌చార్జీలను రెండుసార్లు పెంచారు. ఒకసారి 25%, మరోసారి 45% పెంచారు. ఆయనే ఉంటే ఇప్పటికి మరో రెండుసార్లు మెస్‌చార్జీలు పెరిగేవని ఆయా సంఘాల నేతలు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడున్న ధరల వల్ల.. చాలీచాలని నిధులతో విద్యార్థులకు అన్నం వండి పెట్టటం కష్టంగా మారుతోందని హాస్టల్ వార్డెన్లు వాపోతున్నారు. మెనూ ప్రకారం అన్ని పదార్థాలూ వండిపెట్టలేకపోతున్నారు. కొన్ని చోట్ల అదనంగా విద్యార్థుల సంఖ్య చూపించి, మరికొన్ని చోట్ల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పి వార్డెన్లు నెట్టుకొస్తున్నారు. కొన్ని చోట్ల నాసిరకం బియ్యం.. అదీ పురుగులు పట్టిన బియ్యం వండిపెడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది నుంచి ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హాస్టళ్లలో కాకుండా వారు చదువుకుంటున్న పాఠశాలల్లోనే పెట్టిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే వండిపెడుతున్నారు. తద్వారా ఒక్కపూటకు మిగిలే నిధులతో మజ్జిగ, పండ్లు లాంటివి అందజేయాల్సి వస్తోంది. ఇక విద్యార్థులయితే హాస్టల్ భోజనం తినలేకపోతున్నామని చెప్తున్నారు. నీళ్లచారు, ఉడకని పప్పు, దొడ్డుబియ్యం తింటున్నామని.. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నామని వాపోతున్నారు. హాస్టల్ విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని సర్వేలు చెప్తున్నాయి. 

మూతపడుతున్న కళాశాల హాస్టళ్లు... 

సంక్షేమ శాఖల పరిధిలో నడిచే కళాశాల హాస్టళ్ల పరిస్థితి మరీ దయనీయం. ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండగా.. వారికి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల ద్వారా వార్డెన్లు అన్నం వండి పెట్టాలి. ప్రతి మూడు నెలలకోసారి స్కాలర్‌షిప్ ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం ఏడాది దాటినా ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడో ఏడాది చివర్లోనో, ఈ ఏడాది స్కాలర్‌షిప్ వచ్చే ఏడాదో ఇవ్వటం మూడేళ్లుగా ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు అన్నం పెట్టటం హాస్టల్ వార్డెన్లకు తలకు మించిన భారంగా మారింది. ఒక్కో వార్డెన్ నె త్తిమీద లక్షల రూపాయల అప్పులు పేరుకుపోయాయి. డబ్బుల కోసం కిరాణా దుకాణాల వ్యాపారులు ఒత్తిడి తేవటం, ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇవ్వకపోవటంతో ఏకంగా హాస్టళ్లు మూతపడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని సీతాఫల్‌మండి, ఎల్‌బీనగర్, కోఠి, హిమాయత్‌నగర్, బోయగూడ, ఉప్పుగూడ బీసీ హాస్టళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని హాస్టళ్లలో కూడా మెస్ బంద్ చేశారు. విద్యార్థులు ఇంటికెళ్లిపోతున్నారు.

ఆ కమిటీ ఏం చేస్తోంది?

కళాశాల హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్‌చార్జీల పెంపు, సకాలంలో చెల్లింపు అంశాలపై అధ్యయనం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులతో ఏడాది కిందట కమిటీని నియమించారు. ఆయా శాఖల కమిషనర్లు తీవ్ర కసరత్తు చేసి మూడు రకాల మెస్‌చార్జీలు, మెనూను ప్రతిపాదిస్తూ ముఖ్య కార్యదర్శుల కమిటీకి నివేదిక అందజేశారు. నెలకు రూ. 1,090 చొప్పున కళాశాల విద్యార్థులకు ఇవ్వాలని, ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థుల తరహాలోనే కళాశాల విద్యార్థులకు కూడా నెలనెలా మెస్‌చార్జీల రూపంలో చెల్లించాలని అందులో ప్రతిపాదించారు. అయితే, ఈ నివేదికపై చర్చించేందుకు కూడా అధికారులకు సమయం లేకుండా పోయింది. ముఖ్యకార్యదర్శుల ఆమోదం పొందిన తర్వాత ఆర్థికశాఖకు, ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు ఫైలు వెళ్లి రావాలంటే మరో ఏడాది పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని సంక్షేమ శాఖల అధికారులే అంటున్నారు. 

పెద్దలు వెళుతున్నా ప్రయోజనం సున్నా..!

సీఎం కిరణ్ ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న ప్పుడు హాస్టళ్లు, గురుకులాలను సందర్శిస్తున్నారు. అక్కడే రాత్రిళ్లు బస చేస్తున్నారు. సీఎంతో పాటు పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేశారు. కానీ ఏ ఒక్కరూ విద్యార్థుల మెస్‌చార్జీల గురించి మాట్లాడకపోవటం విశేషం. పెద్దలు వెళ్లినప్పుడు పుష్టికరమైన భోజనాన్ని వండిపెడుతున్నారని.. దోమలు కుట్టకుండా ఫ్యాన్లు, ఏసీలు బిగించి, మరుగుదొడ్లను శుభ్రపరిచి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నందునే సంక్షేమ హాస్టళ్ల సమస్యలు వారికి అర్థం కావటం లేదని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. రోజువారీగా హాస్టళ్లలో వండిపెట్టే నీళ్లచారు, దొడ్డుబియ్యం తింటేనే విద్యార్థుల కష్టాలు అవగతమవుతాయని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మీకు జీతాలు పెంచుకున్నారు.. పేద విద్యార్థుల మెస్ చార్జీలు ఎందుకు పెంచరు?

హాస్టళ్లలో మెస్ చార్జీలు సరిపోక విద్యార్థులు అన్నమో కిరణ్ అంటున్నారు. భావి భారత పౌరులు, ఐఏఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లకు నాసిరకం ఆహారం పెడితే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? మెస్ చార్జీల విషయంలో సీఎంకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దుర్మార్గం. నిత్యావసరాలు ఎన్నో రెట్లు పెరిగినా మెస్ చార్జీలు పెంచకపోవటం దారుణం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులకు జీతాలు పెంచిన వారు పేద కులాల విద్యార్థులకు అన్నం పెట్టే మెస్ ఛార్జీలు ఎందుకు పెంచరు? మెస్ చార్జీలు వెంటనే పెంచకపోతే ఉద్యమిస్తాం. 
- ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

శాశ్వత వార్షిక సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలి

గతంలో మెస్‌చార్జీలు పెంచినదానికన్నా నిత్యావసర వస్తువుల ధరలు 200 శాతం పెరిగాయి. కానీ మెస్‌చార్జీలు పెంచనేలేదు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఉన్నట్టు మెస్‌చార్జీల సమీక్షకు కూడా శాశ్వత వార్షిక కమిటీని ఏర్పాటు చేయాలి. కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు నెలకు రూ. 1,500, ప్రీమెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకూ పెంచాలి. అడక్కుండానే రేషన్ బియ్యం ధరను రూ. 2 నుంచి రూ. 1కి తగ్గించిన ముఖ్యమంత్రి సంక్షేమ హాస్టళ్లకు మాత్రం కిలో రూ. 4 ధరకు బియ్యం సరఫరా చేస్తుండటం దారుణం - కె.చంద్ర మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అన్నం బాగోలేదంటే.. పస్తులే! 

అన్నం బాగోలేదని వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తే నానా దుర్భాషలాడారు. ఒక పూట భోజనం పెట్టకుండా పస్తులు ఉంచారు. - జి.సురేష్, విద్యార్థి (శ్రీకాకుళం)

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు! 
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గ్రామస్తులు వచ్చి అడిగితే ఏం చేస్తారో చేసుకోండని వార్డెన్ అన్నారు. - బి.శేఖర్, విద్యార్థి, ఎర్రముక్కాం
Share this article :

0 comments: