హెల్త్‌కార్డుల ప్రక్రియ ఘరూ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెల్త్‌కార్డుల ప్రక్రియ ఘరూ!

హెల్త్‌కార్డుల ప్రక్రియ ఘరూ!

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012

*తొలి రెండేళ్లు సర్వీస్ ప్రొవైడర్‌గా ఆరోగ్యశ్రీ ట్రస్టు
*పథకం అమలుకు ఏటా రూ. 350 కోట్లు
*ప్రభుత్వ వాటా రూ.210 కోట్లు.. ఉద్యోగుల వాటా రూ.140 కోట్లు
*ఒక్కో కుటుంబానికి చికిత్స గరిష్ట పరిమితి రూ.3 లక్షలు
*రెండు రకాల ప్రీమియం.. రూ.120, రూ.150 
*నవంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం
*పథకం అమలు పర్యవేక్షణకు సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. నవంబర్ 1 నుంచి హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన వివరాల (డేటా) సేకరణ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం జీవో జారీ చేయనుంది. శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో శ్రీకాంత్, ట్రెజరీ శాఖ డెరైక్టర్ నాగార్జునరెడ్డి, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, టీజీవో, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, పీఆర్టీయూ, తెలంగాణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, యూటీఎఫ్, ఏపీజీవో, గ్రూప్-4 ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యాంశాలు ఇవీ..
డేటా సేకరణ ఇలా..

ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక శాఖ నిర్వహించే హెచ్‌ఆర్‌ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం)లో ట్రెజరీ శాఖ వెబ్‌సైట్ ద్వారా హెల్త్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ట్రెజరీ శాఖ వెబ్‌సైట్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ఉంది.

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలి. ఐసీఏవో (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) సూచించిన ప్రమాణాల మేరకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనే వినియోగించాలి. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లోని తొలి రెండు పేజీలను స్కాన్ చేసి అటాచ్ చేయాలి. పూర్తి చేసిన ఫారాన్ని అప్‌లోడ్ చేస్తే.. ఈ-ఫామ్, దరఖాస్తు నంబర్ లభిస్తాయి. ‘ఈ-ఫామ్’ను ఉద్యోగులు సంబంధిత డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్)కు, పెన్షనర్లు అయితే ఎస్టీవో (సబ్ ట్రెజరీ ఆఫీసర్) లేదా ఏపీపీవో (అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్)కు సమర్పించాలి.

దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా లోపాలుంటే సవరించి ‘వ్యాలిడేట్’ చేయాలి. ఎక్కువ లోపాలుంటే వాటిని సవరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగికి తిప్పి పంపించాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంలేని ఉద్యోగులు, పెన్షనర్లు.. డీడీవో, ఎస్టీవోల సహకారంతో దరఖాస్తును అప్‌లోడ్ చేయాలి.

వివరాల సమర్పణకు అక్టోబర్ 20 వరకు గడువు ఇచ్చారు.
ఆధార్ నంబర్లు లేని వారి కోసం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ వద్ద ఉన్న ఉద్యోగుల డేటాను హెల్త్‌కార్డుల వినియోగానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డేటా సెంటర్‌కు బదిలీ చేయనున్నారు.

పథకంలో ముఖ్యాంశాలివీ..

8 లక్షల మంది ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలను ఈ పథకం కిందికి తీసుకురానున్నారు. అంటే దాదాపు 48 లక్షల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉద్యోగుల వేతన శ్రేణిని బట్టి మూడు గ్రేడ్లుగా విభజించి ప్రీమియం నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది. అయితే రెండు గ్రేడ్లుగా విభజించాలన్న ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం అంగీకరించింది. గ్రేడును బట్టి రూ.120, రూ.150గా రెండు రకాల ప్రీమియం నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ప్రీమియం వసూలు నవంబర్ నెల జీతం నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు, ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు విలువైన చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. గరిష్ట పరిమితి మించితే.. ప్రత్యేకంగా రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న బఫర్ ఫండ్ నుంచి మంజూరు చేస్తారు.

పథకం అమలుకు ఏటా రూ.350 కోట్లు అవసరమని అంచనా. అందులో 60 శాతం (రూ.210 కోట్లు) ప్రభుత్వం, మిగతా 40 శాతం(రూ.140 కోట్లు) ఉద్యోగులు భరించనున్నారు. మొత్తం నిర్వహణ వ్యయం 5.7 శాతానికి మించకుండా పరిమితి విధించారు.

సర్వీసు ప్రొవైడర్‌గా తొలి రెండేళ్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహరిస్తుంది. ట్రస్టు సేవల పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే రెండేళ్ల తర్వాత కూడా కొనసాగిస్తారు. లేదంటే మరో ట్రస్టుకు అప్పగిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే స్టీరింగ్ కమిటీ.. పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఎయిడెడ్ సిబ్బందికి నో..

ఎయిడెడ్ ఉపాధ్యాయులు, యూనివర్సిటీ అధ్యాపకులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేసినప్పుడు అవి పీఆర్సీ సిఫార్సుల్లో లేవని తప్పించుకొనే ప్రభుత్వం.. తొమ్మిదో పీఆర్సీ సిఫార్సుల మేరకు ‘ఎయిడెడ్’ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు చేయడానికి వెనకాడుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థ (పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత వైద్య సేవలు అందించాలని తొమ్మిదో పీఆర్సీ సిఫార్సు (259వ పేజీ 13వ పాయింట్) చేసింది. ఈ సిఫార్సును అమలు చేస్తామని 2008 నవంబర్ 3న జాక్టోతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం హెల్త్‌కార్డుల పథకంలో వారికి అవకాశం కల్పించడం లేదు. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ఈ పథకంలోకి తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద వచ్చే వారం జరగనున్న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులనూ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Share this article :

0 comments: