చంద్రబాబువి చిల్లరమాటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » చంద్రబాబువి చిల్లరమాటలు

చంద్రబాబువి చిల్లరమాటలు

Written By news on Thursday, August 30, 2012 | 8/30/2012

కొణతాల, సోమయాజులు ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే, ఎన్డీటీవీ చేసిన సర్వేలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి డబ్బులిచ్చి సర్వేలు చేయించారని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం సర్వేల ద్వారా బయటపడేసరికి టీడీపీ అధినేత డిప్రెషన్‌కు లోనై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన వెంటనే జాతికి, మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడి కావడంపట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయన్నారు. 2009 తర్వాత ఇప్పటివరకు జరిగిన 75 ఉప ఎన్నికల్లో ఏ ఒక్క చోట టీడీపీ గెలవలేదని, పైగా కొన్ని స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుందని గుర్తుచేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ డిపాజిట్ కోల్పోయిందన్నారు. 

చంద్రబాబు వాస్తవాలను దాచి ఇతరులపై గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. ‘‘1989 నుంచి దేశంలో పలు మీడియా సంస్థలు ఒక్కొక్క సమయంలో ఓపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క విషయంపై సర్వేలు చేస్తుంటారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ప్రజల అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. 2011లో కూడా పలు సర్వేలు మనం గమనించాం. 2011 ఆగస్టులో హిందు, సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ సర్వేలు చేశాయి. దాదాపు అవే ఫలితాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇండియా టుడే, ఎన్డీటీవీ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సర్వే చేశారు. వీటిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించాయి. దీనిపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటు. పైగా నాలుగు రాష్ట్రాల్లోనే ఎన్డీటీవీ సర్వేలు ఎందుకు చేసిందంటూ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైందికాదు’’ అని వారు విమర్శించారు. 

బాబుది దివాలాకోరుతనం
మీడియా సంస్థలు జగన్ నుంచి రూ.30 కోట్లు తీసుకుని అనుకూలంగా సర్వేలు ఇచ్చారని చెప్పడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శమని సోమయాజులు దుయ్యబట్టారు. అలాగైతే తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని ఆ సర్వేలు చెబుతున్నందున కేసీఆర్ కూడా ఎన్ని కోట్లు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. అలా చేస్తే ప్రజల్లో ఆ మీడియాకు ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందే తప్ప పార్టీలకు ఎలాంటి లాభం ఉండదని చెప్పారు. ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు గోబెల్స్ ప్రచారంతో తనిని తానే నాశనం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన నెత్తిన భస్మాసుర హస్తం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: