28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా

28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా

Written By news on Saturday, September 15, 2012 | 9/15/2012

జగన్‌ మళ్ళీ ప్రజాజీవితంలోకి రానున్నారు. త్వరలోనే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌. బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ తీరును ప్రశ్నించడం జగన్‌కు కలిసొచ్చే అంశమే. అన్నీ అనుకూలిస్తే ఈనెల 28న బెయిలొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్‌.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వైసీపీలో ఆనందాన్ని రేకెత్తిస్తున్నాయ్‌. తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై త్వరలోనే బయటకు రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నారు. జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ విచారణ సమయంలో ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలు సీబీఐ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేశాయ్‌. ఛార్జిషీట్లు, విచారణ, అరెస్ట్‌...ఇలా అన్ని విషయాల్లో సీబీఐ తీరుపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.

జగన్‌ బెయిల్‌ పిటీషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో అరగంటపాటు ఆసక్తికర వాదనలు జరిగాయ్‌. జగన్ అరెస్ట్‌ రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన తరపున న్యాయవాదులు గోపాల్‌ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్‌లు ధర్మాసనానికి విన్నవించారు. జగన్‌ కోర్టులో హాజరు కావాల్సి ఉండగా అరెస్ట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. లక్షకోట్ల అవినీతంటూ చెప్పుకొచ్చిన సీబీఐ ఛార్జిషీట్లకొచ్చేసరికి నిరూపించలేకపోయిందని వాదనలు వినిపించారు. జగన్‌ అరెస్టై వంద రోజులు పైనే గడిచాయని, బయట ఉన్నా, జైల్లో ఉన్నా సీబీఐ విచారణకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్‌ అరెస్ట్‌కు ముందు మూడు చార్జిషీట్లు వేసిన సీబీఐ, అరెస్ట్‌ తర్వాత సప్లిమెంటరీ వేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సప్లమెంటరీకి ఎన్ని రోజులు సమయం తీసుకుంటారని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

అటు సీబీఐ తరపున అదనపు సోలిసీటర్‌ జనరల్‌ మోహన్‌జైన్‌ ధీటుగా వాదనలు వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతీ విషయంలోనూ సీబీఐ తీరును కోర్టు తప్పుబడుతూ ప్రశ్నలు సంధించింది. మొదటి ఛార్జిషీటుకు ముందే జగన్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల విచారణ అనంతరం ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా నోటీసులు జారీ చేయడంపై వివరణ కోరింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే జగన్‌ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 28కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.కోర్టులో అన్ని విషయాల్లోనూ జగన్‌కు అనుకూలంగా వాదనలు జరగడంతో బెయిల్‌ ఖాయమని వైసీపీ కేడర్‌ ఖుషీ అవుతోంది. జననేత త్వరలోనే జైలు నుంచి బయటపడ్తారని ధీమాగా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానుల కూడా జగన్‌ విడుదల కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెలాఖరున బెయిల్‌ రావడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.
http://www.tv5news.in/districtwide/hyderabad/item/6060-jagan-mohan-reddys-bail-petition-updates

Share this article :

0 comments: