జనంపై ఆర్టీసీ రూ. 363 కోట్ల వడ్డన.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనంపై ఆర్టీసీ రూ. 363 కోట్ల వడ్డన..

జనంపై ఆర్టీసీ రూ. 363 కోట్ల వడ్డన..

Written By news on Monday, September 24, 2012 | 9/24/2012


*పెంచిన చార్జీలు నేటి నుంచే అమలులోకి..
*పల్లెవెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సు చార్జీల పెంపు
*5 పైసల నుంచి 12 పైసల మేర చార్జీల పెరుగుదల
*ఏసీ బస్సులకు మాత్రం పెంపు నుంచి మినహాయింపు
*బస్‌పాస్‌లు ప్రియం.. రూ. 100 చొప్పున భారం


వారాంతాల్లో బాదుడే బాదుడు!

డిమాండ్‌నుబట్టి చార్జీలు పిండుకునేందుకు ఆర్టీసీ కొత్తగా ‘ఫ్లెక్సి ఫేర్’ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే పండుగ , జాతర సమయాల్లో అడ్డంగా చార్జీలు బాదేస్తున్న ఆర్టీసీ.. ఇకపై వారాంతపు రోజులు, ముఖ్య దినాల్లో ఇష్టానుసారంగా చార్జీల వాత పెట్టనుంది. డిమాండ్‌కు అనుగుణంగా తక్కువ/ఎక్కువ రేట్లు వసూలు చేస్తామని అధికారులు చెప్తున్నా.. లోగుట్టు మాత్రం ప్రయాణికుల నుంచి వీలైనంతమేరకు దండుకోవటమే!

హైదరాబాద్, న్యూస్‌లైన్: పేదోడి బస్సులపై ప్రభుత్వం అడ్డంగా చార్జీలు వడ్డించింది. బస్సు ప్రయాణాన్ని మరింత భారం చేసింది. సంపన్నవర్గాలు ప్రయాణించే బస్సులను వదిలేసి.. గ్రామీణులు, మధ్యతరగతి ప్రజలు రాకపోకలు సాగించే పల్లెవెలుగు, డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల టికెట్ల ధరలు పెంచేసింది. పల్లె వెలుగు కనీస చార్జీని రూ. 5కు పెంచింది. ప్రయాణ చార్జీలను పల్లె వెలుగులో కిలోమీటరుకు 5 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు, సూపర్‌లగ్జరీ బస్సులో కిలోమీటరుకు 12 పైసలు పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను పెంచటంతో.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై పెరిగిన ఆర్థిక భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. చార్జీల పెంపుతో ప్రయాణికులపై రూ. 362.90 కోట్ల భారం పడనుంది. శనివారం రాత్రి గుట్టుగా చార్జీల చిట్టా విప్పిన ఆర్‌టీసీ యాజమాన్యం.. ఆదివారం అధికారికంగా పెంపుపై ప్రకటన చేసింది. కొత్త చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. పద్నాలుగు నెలల్లో బస్సు చార్జీలు పెంచటం ఇది రెండోసారి.

గ్రామీణులు, సిటిజనులపై వడ్డన!

ప్రతి రోజూ ఆర్‌టీసీ బస్సుల్లో 1.40 కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. వీరిలో గ్రామీణ సర్వీసుల్లో ప్రయాణించేవారే అధిక సంఖ్యాకులు. ఈ పల్లెవెలుగు (ఆర్డినరీ) బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు ఒక రూపాయి, 45 కిలోమీటర్ల దూరం వరకు రెండు రూపాయల మేర చార్జీని పెంచింది. సిటీ బస్సుల చార్జీలను కూడా అమాంతం పెంచేసింది. సిటీ ఆర్డినరీ సర్వీసులలో ప్రతి రెండు కి.మీ.కు ఒక స్టేజీ ఉంటుంది. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి ప్రస్తుత చార్జీలపై రూ. 1 నుంచి 2 వరకు పెంచింది. కొన్ని స్టేజీలకు మాత్రం రూ. 3 వరకు పెంపు వర్తింపజేసింది. తిరుపతి - తిరుమల మధ్య ఘాట్‌రోడ్డులో రాకపోకలు సాగించే బస్సు చార్జీలు కూడా ఆర్‌టీసీ పెంచింది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సు చార్జీ రూ. 27 ఉండగా.. దానిని రూ. 30 కి పెంచింది. ఎక్స్‌ప్రెస్ చార్జీని రూ. 34 నుంచి రూ. 40కు పెంచింది.

బరువెక్కిన బస్‌పాస్‌లు!

బస్‌పాస్‌ల చార్జీలు కూడా పెరిగాయి. రోజువారీ ఉపాధితో జీవనం సాగించే కూలీలు వినియోగించే ఆర్డినరీ జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాస్ ధరలపై అదనంగా రూ. 100 మోపింది. అలాగే ‘సిటీ’ జనులు ఎక్కువగా ఉపయోగించే మెట్రో (రూ. 650) మెట్రో డీలక్స్ (రూ. 750) పాస్‌లపై కూడా వంద రూపాయలు వ డ్డించింది. విద్యార్థులు, ఉద్యోగుల బస్‌పాస్‌ల ధరల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.


మనుగడకోసం చార్జీల పెంపు అనివార్యం: ఆర్‌టీసీ ఎండీ

‘లీటరు డీజిల్‌కు రూ. 6.11 పైసలు పెరగటంతో ఆర్‌టీసీపై సాలీనా రూ. 357.75 కోట్ల అదనపు భారం పడింది. సామాన్యులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో అంతర్గత పొదుపు, వ్యయనియంత్రణ పాటిస్తున్నప్పటికీ.. తాజా భారాన్ని మోయలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో సంస్థ మనుగడ సాధించాలంటే చార్జీల పెంపు అనివార్యంగా మారింది.

డీజిల్ పోటు, ఇతర ఖర్చుల పెరుగుదల కారణంగా సంస్థపై ఏడాదికి రూ. 734.90 కోట్ల భారం పడింది. ఈ లోటును అధిగమించేందుకు స్వల్ప మొత్తంలో చార్జీలు పెంచాం. తద్వారా రూ. 362.90 కోట్లు సమకూర్చుకుంటాం. మిగతా లోటును అంతర్గత సామర్థ్యం ద్వారా పెంపొందించుకుంటాం’ అని ఆర్‌టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=456191&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: