ఆ ఆప్తులంతా ఏం చేస్తున్నారు? జగన్ కోసం - 7 sakshi - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ఆప్తులంతా ఏం చేస్తున్నారు? జగన్ కోసం - 7 sakshi

ఆ ఆప్తులంతా ఏం చేస్తున్నారు? జగన్ కోసం - 7 sakshi

Written By news on Monday, September 24, 2012 | 9/24/2012

అలాంటి మననేతకి, ఇప్పుడు కనిపిస్తున్న నాయకులకి పోలిక ఉందా? తమ సహచరుని కొడుకుని జైలులో పెడితే ఆ సహచరుని భార్య కంట కన్నీరు తుడవలేని పదవి ఏం పదవి? రోజూ ఇంత దగ్గరగా వున్న మనిషి కుటుంబం పట్లే మానవత్వం చూపలేకపోతే ఇక ఐదు సంవత్సరాలకుఒకసారి కనబడే ప్రజలకు ఏం చేయగలరు?

కొన్నిమాటలు వినకూడదనుకున్నా చెవిన పడుతుంటాయి. కొన్నిమాటలు ఎవరి నుంచి వినకూడదనుకుంటామో వారి నుంచే వినాల్సి వస్తోంది. ఎన్నిమాటలు... ఎన్ని అపనిందలు. ఇవన్నీ ఎవరి మీద? మామగారి మీద. జగన్ మీద. ఒకరు - చనిపోయి, తనకు తాను సమాధానం చెప్పలేని వ్యక్తి. ఒకరు - అప్పుడు అధికారంలో లేని వ్యక్తి. అధికారం కాదు కదా, కనీసం అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేని వ్యక్తి. ఏరోజూ ఒక మంత్రికి కాని, ఒక అధికారికి కాని కనీసం ఫోన్ కూడా చేయని వ్యక్తి... అంతెందుకు ఏనాడూ కనీసం సెక్రటేరియట్‌లో అడుగు కూడా పెట్టని వ్యక్తి. అయినా సరే అడ్డే లేకుండా మాట్లాడారు.

మామను ‘అన్న’ అని పిలిచినవారు, మామను దేవునితో పోల్చినవాళ్లు, మామతో కలిసి భోంచేసినవాళ్లు, కలిసి పనిచేసిన వాళ్ళు, రాఖీలు కట్టినవాళ్లు... నిజంగా తప్పు జరిగి ఉంటే ఆరోజు ఎందుకు ఆయనకు చెప్పలేదు? తప్పు లేనప్పుడు ఎందుకు ఒక్కరు కూడా నోరు తెరిచి నిజం చెప్పలేకపోతున్నారు? నిజం చెబితే జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి ఏ ఆయుధాలూ ఉండవనా? మామ లేని మా కుటుంబాన్ని ఏకాకిని చేసి, ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే కూడా, చూస్తూ మాకెందుకులే అనుకుంటున్నారే... లేదా మనమూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనమూ ఒక దెబ్బ వేద్దామనుకుంటున్నారే... దానివలన అధిష్టానం దగ్గర ఇంకా కొన్ని మార్కులు తెచ్చుకుందామని ఆరాటమా? ఇవా రాజకీయాలు! ఎప్పుడు మారతాయి?

మా మామగారి జీవితంలో కూడా ఎన్నో సందర్భాలలో ఆయనకు తెలిసినవారికి ఇబ్బందులు వచ్చాయి. వారితో ఉంటే తనను అపార్థం చేసుకుంటారనిపించే సందర్భాలు ఎదురయ్యాయి. అయినా ఆయన ఏ రోజూ తనవాళ్ల పక్షాన నిలబడడానికి సంకోచించలేదు. ఒక సికె బాబు, ఒక రాజీవ్‌రెడ్డి, ఒక బాల్‌రెడ్డి, ఒక సురేఖమ్మ, ఒక చరితమ్మ, ఒక సబితమ్మ వీరందరూ అందుకు నిదర్శనం కాదా? ఒకవేళ వాళ్లు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును సమర్థించకుండానే వారి పక్షాన నిలబడగలిగిన ప్రేమ, ఆత్మస్థైర్యం, గుండెబలం గల మనిషి ఆయన. అందుకే ఆయన మహానేత అయ్యారు. ప్రజల మనసులను జయించగలిగారు. బతికింది 60 సంవత్సరాలే అయినా 6000 సంవత్సరాలంత జీవితం ఆయనది. అందుకే కాబోలు జగన్ అంటూ ఉంటాడు- ఎంతకాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నది ముఖ్యం అని. వేలెత్తి చూపడం, వక్రీకరించడం, ఒకరిని తప్పుబట్టి మన చేతులు తుడిచేసుకోవడం, మనలను మనం సమర్థించుకోవడం చాలా సులభం. చాలామంది నడిచే మార్గం అది. కాని మనలోని మంచిని పెంచి పోషించి మన మనస్సాక్షి మొద్దుబారిపోనీకుండా దాని ప్రకారం జీవిస్తే మన జన్మ ఎలా సార్థకం అవుతుందో చూపించారు వైఎస్‌ఆర్‌గారు. అలా చూపించి తాను మనసున్న మారాజునని నిరూపించుకున్నారు.

అలాంటి మననేతకి, ఇప్పుడు కనిపిస్తున్న నాయకులకి పోలిక ఉందా? తమ సహచరుని కొడుకుని జైలులో పెడితే, ఆ సహచరుని భార్య కంట కన్నీరు తుడవలేని పదవి ఏం పదవి? రోజూ ఇంత దగ్గరగా వున్న మనిషి కుటుంబం పట్లే మానవత్వం చూపలేకపోతే, ఇక ఐదు సంవత్సరాలకు ఒకసారి కనబడే ప్రజలకు ఏం చేయగలరు? వారి బాధను ఏం అర్థం చేసుకోగలరు? ఇదేనా 21వ శబాబ్దం అంటే? ఇతరులకు జరిగే అన్యాయాన్ని చూస్తూ మనకెందుకు అనుకోవడమేనా నాగరకత అంటే?

నాయకులూ... మీరు ప్రజలకు దశ, దిశ నిర్దేశించేవాళ్లు. న్యాయం కాపాడేవాళ్లు, చట్టసభలలో మా హక్కులను కాపాడవలసినవాళ్లు. ఇదేనా మీ నాయకత్వం? ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబం... ఒక ఎంిపీ, ఒక ఎమ్మెల్యే కొడుకు -వారికే న్యాయం జరగనప్పుడు, మనకు స్వాతంత్య్రం వచ్చిన 64 సంవత్సరాలలో, మనం పొందిన స్వాతంత్య్రం ఇదేనా? ఈ ప్రజాస్వామ్యం గురించేనా మనం గర్వించేది? ఇంత జరుగుతూన్నా ప్రజా ప్రతినిధులుగా... ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మీరు ఏం సాధించినట్టు?

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: