విశ్వసనీయత లేని సర్కార్ ఇది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయత లేని సర్కార్ ఇది!

విశ్వసనీయత లేని సర్కార్ ఇది!

Written By news on Tuesday, September 11, 2012 | 9/11/2012

ప్రధాని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... ఈ మూడు పదవులను, వాటి విధులను, బాధ్యతలను రాజ్యాం గం స్పష్టంగా నిర్వచించింది. ఒకరి పనులలో మరొకరు జోక్యం చేసుకోకూడదని వేరే చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు బొగ్గు గనుల విషయంలో కాగ్ ఇచ్చిన నివేదికను అదే రాజ్యాంగం సృష్టించిన ప్రధాని పబ్లిక్‌గా విమర్శించడం అసభ్యకరం. అది రాజ్యాంగ పరిధులను అతిక్రమించడం కూడా! అలా అతిక్రమించిన ప్రధానిని ఎవరు శిక్షించాలి? ఏ పౌరుడైనా ఈ విషయంలో ఒక పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే? పాపం, స్కాముల వర్షంతో తడిసి ముద్దయి పోయి, ప్రధాని మనస్సు కాస్త చలించినట్లు అనిపించటం లేదూ?

రాజ్యాంగ నిర్ణయ సభలో చర్చల సందర్భంగా ‘కాగ్’ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి గురించి రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాట్లా డుతూ... ‘కాగ్ బాధ్యతలు న్యాయవ్యవస్థ బాధ్యతలకన్నా ఎక్కువ ప్రాముఖ్యం గలవి’ అని పేర్కొన్నారు. ‘‘పరిపాలనా వ్యవస్థ తాలూకు ఆర్థిక సంబంధమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయం చట్టబద్ధమైనదా, ఆర్థిక నియమావళి, విధివిధానాలను అనుసరించి తీసుకున్న నిర్ణయమేనా, ఆ నిర్ణయం అనవసర వ్యయానికి దారితీస్తుందా, అతిగా ఖర్చు జరిగిందా, నష్టం వచ్చిందా అనే విషయాలను ఆడిట్ చేయటం కాగ్ విధి’’ అని మూడవ లోక్‌సభ నాల్గవ నివేదిక పేర్కొన్నది. ప్రతీ ఖర్చుకూ విశ్వాసపాత్రత, ఔచిత్యం ఉన్నా యా లేదా, పొదుపుని పాటించారా లేదా అని చూడాల్సిన బాధ్యత ‘ఆడిట్’దే అని స్పష్టం చేసింది. ఎవరో ఎందుకు, అప్పట్లో స్వయానా ఆర్థికమంత్రి సి.డి.దేశ్‌ముఖ్ 1956లో ఎల్‌ఐసీ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో కాగ్ మీద విమర్శచేస్తే లోక్‌సభ స్పీకర్ ఆ విమర్శలను రికార్డు నుంచి తొలగించారు. బోఫోర్స్ కుంభకోణంపై కాగ్ వెలువరించిన నివేదిక మీద ఎన్.కె.పి.సాల్వే విరుచుకుపడ్డారు. ఆయన తమ ఉపన్యాసంలో ఎంత అసభ్యకరమైన పదజా లం ఉపయోగించారో చూడండి.

‘కాగ్ ఇలాంటి నివేదిక సమర్పించటమంత దగుల్బాజీ పని మరొకటి ఉండదు’.
‘నేనైతే ఆ నివేదికను చెత్తబుట్టలో పారేసేవాణ్ణి’.
‘ప్రతిపక్షం చేతికి ఓ ఆయుధం అందించడానికి ఈ నివేదిక రచించాడా?’‘అతనేం మాట్లాడుతున్నాడో అతనికేమైనా తెలుసా అనిపిస్తుంది’’.
‘ప్రజల మనస్సుల్లో అనుమానాలను రెచ్చగొట్టడానికి ఆడిటర్ ప్రయత్నిం చటం దురదృష్టకరం’.
‘ఈ ఆడిటర్ కాగితం, కలం పార్లమెంటు సమయాన్ని వృథా చేయకుండా ఉంటే మంచిది’.

ఇదీ కాంగ్రెస్ సంస్కృతి. సాల్వే ప్రకారం కాగ్ ఎటువంటి విమర్శలు చేయ కూడదు. ప్రభుత్వానికి వంతపాడాలి. అప్పుడు సాల్వే సామాన్య పార్లమెంటు సభ్యుడు కనుక మంచిచెడులు తెలియని వాడని అనుకుందాం. కానీ అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానికేమి వచ్చింది? బ్రిటన్, అమెరికా దేశాల్లో ఆడిట్ రిపోర్టులను నేరుగా పార్లమెంటుకే సమర్పిస్తారని ప్రధానికి తెలియదా? మన పార్లమెంటు నిబంధనల ప్రకారం కాగ్ నివేదికను ప్రజాపద్దుల కమిటీకి పంపాలి. ఆ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలి. ఆ నివేదిక వచ్చే వరకూ ఆగాల్సిందేనని ప్రధాని అని ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ప్రధాని నోరుజారారు. అడుసులో కాలుపెడితే బురద అంటుకోకుండా ఉంటుందా? బోఫోర్స్ కుంభకోణాన్ని నాన్చి నాన్చి ఫైలు మూసేశామని సంవత్సరాల తర్వాత ప్రకటించారు. బొగ్గు కుంభకోణం కూడా అదే దారి పట్టకుండా పార్లమెంటు సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేం అన్న సూక్తి ప్రధానికి అక్షరాలా వర్తిస్తుంది. 

మొదట కాగ్ తప్పు చేసిందని ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాగ్ అంటే తనకెంతో గౌరవముంది అని తప్పు దిద్దుకున్నట్లు ప్రకటించారు. కానీ వేటకుక్కలను వదలిపెట్టినట్లు తన మంత్రు లందరినీ ప్రజల మీదకు సంధించారు. మాట వరసకు బొగ్గు మంత్రిగా బాధ్యత తనదేనని అంగీకరించారు. కానీ మంత్రుల బృందగానంలో ప్రధాని ఒప్పుకోలు గాలిలో కలిసిపోయింది. మరో సందర్భంలో ప్రధాని మాట్లాడుతూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ నివేదికను సవాలు చేస్తుందని తన అక్కసు వెళ్లబోసుకున్నాడు గాని ప్రధానికి ఉండాల్సిన హుందాతనం అది కాదు. జీవితాన్ని ఉన్నతాధికారిగా ప్రారంభించి తంతే బూరెలబుట్టలో పడ్డట్లు ప్రధానిగా నియమితుడై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరువాత హుందాతనం ఎలావస్తుంది? హుందాతనం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే జవహర్‌లాల్ నెహ్రూ ఇదే కాగ్ గురించి వెలిబుచ్చిన అభిప్రాయం ఒకసారి మననం చేసుకోవాలి. ‘‘పార్లమెంట్ వేదిక నుంచి కాగ్‌ను తప్పు పట్టడం రాజ్యాంగంలో అతనికిచ్చిన ప్రత్యేక స్థానాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. అతను తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహించడం కష్టతరమవుతుంది’’. 

కాగ్ కార్యాలయ భవనానికి పునాదిరాయి వేసిన సందర్భంగా ‘‘అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న సమయంలో ఎంతో సొమ్ము ఖర్చు చేయటం జరుగుతుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సవ్యంగా ఖర్చు అవుతుం దా, లెక్కలు సరిగ్గా ఉన్నాయా అని చూడాల్సి ఉంటుంది. ఇంత ముఖ్యమైన బాధ్యతను కాగ్ సంస్థ అధిపతి, అతని కింద ఉద్యోగులు నిర్వహించాల్సి ఉంది. ఈ బాధ్యతను కాగ్ నిర్భయంగా, పక్షపాతం లేకుండా దేశాభివృద్ధి లక్ష్యంగా అమలుపరచాల్సి ఉంది’’ అని తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రస్తుత కాగ్ అధిపతి సరిగ్గా ఆ పనినే చేస్తే విమర్శించడం, తప్పుపట్టడం ఎలా సబబు అవుతుంది? ఈ నివేదికను, నియమ నిబంధనల ప్రకారం ప్రజాపద్దుల కమిటీకి పంపించి, ఆ సంస్థ అభిప్రాయాన్ని తెలియజేసే వరకైనా ప్రధాని ఆగలేకపోయారా? ఉన్నతాధికారంలో ఉన్న వారిని తప్పుపట్టడంలో జంకకుండా నిర్భీతిగా మీ అభిప్రాయాన్ని చెప్పండని ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. అలా చెప్పడం తప్పంటున్నారు మన ప్రధాని!

మన్మోహన్‌సింగ్‌జీ! మీ కార్యాలయం మీద, న్యాయశాఖ మీద ఆధార పడకుండా, మీరే స్వయంగా కాగ్ (విధులు, అధికారులు, సర్వీసు నిబం ధనలు) చట్టం 1971లో 16వ సెక్షన్ ఒకసారి చదవండి. దాని ప్రకారం ‘‘రెవెన్యూ కేటాయింపులు, వసూళ్లు, అంచనాలను సమర్థంగా పర్యవేక్షించేం దుకు అనువుగా నిబంధనలు, విధానాలు ఉన్నాయో లేదో చూసే అధికారం కాగ్‌కు ఉంది’’ అంటే వేలం పద్ధతే సరైనదని, తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని చెప్పే హక్కు కాగ్‌కు ఉన్నట్లేకదా!
అటు కాగ్, ఇటు ప్రభుత్వం కూడా ఒకే ఒక గనిలో తవ్వకం ప్రారం భమైందని అంగీకరిస్తున్నాయి. సంవత్సరాలుగా లెసైన్సులు తీసుకుని తవ్వకం ప్రారంభించలేదంటే, కారణం ఏమిటో తెలుసుకోకుండా ప్రభుత్వ యంత్రాం గం నిద్రపోతుందా? టాటాలతోసహా కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రధానిని ఇటీవలే కలుసుకుని సంప్రదింపులు జరిపారనే వార్త పత్రికల్లో వచ్చింది. వారేమి అభ్యర్థనలు చేశారో మనకు తెలియదు. కానీ నిర్ణయాలు వారికి అనుకూలంగా తీసుకున్నారన్నది సుస్పష్టమే. ఏ టాటాలకైతే గనుల తవ్వకం కేటాయించారో, ఆ టాటాలు ఈ ప్రతినిధి వర్గంతో ఉండటం గమనించాలి. తనకు కేటాయించిన బొగ్గు గని తవ్వకుండా ప్రభుత్వ సంస్థల నుంచి బొగ్గు సరఫరా కేటాయింపును సాధించుకున్నారు. ఈ కార్పొరేట్ల లక్ష్యం ఒక్కటే. ప్రభుత్వ సంస్థల వైఫల్యం. అప్పుడు తమకు కేటాయించిన గనుల తవ్వకం ప్రారంభించి తమ అవసరాలకు పోను మిగతా బొగ్గును మార్కెట్‌లో తమ చిత్తం వచ్చిన ధరకు అమ్ముకుని మరిన్ని లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రధాని వారి కోర్కె మేరకు కోల్ ఇండియాకు ఆజ్ఞలు జారీ చేశారు. వడ్డించే వాడు మన వాడైతే కడపంక్తిలో కూర్చంటేనేమి అనే సామెతను ఇది గుర్తు చేస్తోంది. దేశానికి కావాల్సిన బొగ్గును అందించడానికి కోలిండియా కొత్తగా 102 గనుల తవ్వకానికి అనుమతిని కోరుతూ కేంద్రానికి పంపిన లేఖలు ఆయా మంత్రిత్వశాఖల కార్యాలయాల్లో పడి ఉన్నాయి. ఇదికాక కొన్ని లక్షల టన్నుల బొగ్గు మేటలు వేసుకుపోయాయి. కావాల్సినవారు వచ్చి తీసుకుని వెళ్లవచ్చు నని ప్రకటిస్తే, తీసుకుని వెళ్లేవారు లేరు. కారణం వ్యాగన్ల కొరత. సంబంధిత మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ లోపం. ప్రధానిగారూ, మీ ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం పనిచేస్తున్న తీరు ఇది!

దేశంలో విద్యుత్ కొరత సంగతి అందరికీ తెలిసిందే. ఈ కొరత తీరాలంటే విద్యుదుత్పాదన కేంద్రాలకు బొగ్గు కావాలి. కావాల్సినంత బొగ్గు కోలిండియా సరఫరా చేయలేకపోతోంది కాబట్టే, ప్రయివేట్ వ్యక్తులకు, కార్పొరేట్లకు గనులు కేటాయించామని ప్రభుత్వం సమర్థించుకుంటున్నది. వాదన బాగానే ఉంది. అలాంటప్పుడు అనుమతులు సంపాదించున్నవారు తవ్వకాలు ప్రారంభించ కుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొంటే బొగ్గు ఎలావస్తుంది? విద్యుదుత్పత్తి ఎలా జరుగుతుంది? ప్రభుత్వ యంత్రాంగం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతోం దా? 1970, 1980 దశకాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. 1990వ దశకంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఏలినాటి శని దేశాన్ని వెంటాడుతూనే ఉంది. విముక్తి ఎప్పుడు అని ప్రశ్నించుకునే బదులు 2014 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి సాధించుకుంటే మంచిది!
Share this article :

0 comments: