ఆగర్భ శ్రీమంతుడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆగర్భ శ్రీమంతుడు!

ఆగర్భ శ్రీమంతుడు!

Written By news on Friday, September 14, 2012 | 9/14/2012


నారా చంద్రబాబు నాయుడు మరోసారి జనానికి షాకిచ్చారు. తాను ఆగర్భ శ్రీమంతుడట. తను రెండెకరాల ‘భూస్వామి’గా జీవితం మొదలుపెట్టి 2000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాననే మాట అబద్ధమట. తన ‘అవిభక్త హిందూ కుటుంబానికి’ 70 ఎకరాల పొలం ఉందట. నారావారి పల్లె గ్రామం ఉమ్మడి ప్రయోజనాల కోసం తన తండ్రి ఒకప్పుడెప్పుడో మూడెకరాల భూమిని ‘దానం’గా ఇచ్చారట. అయితే, తనకు బినామీ ఆస్తులు మాత్రం లేవట. సింగపూర్‌లో హోటల్ ఉందన్న కథనం పచ్చి అబద్ధమట. తమ సొంత కంపెనీ హెరిటేజ్ నష్టాల్లోంచి తేరుకుని లాభాల బాట పట్టిందట.

ఇంతకీ, చంద్రబాబు చీలికలూ పేలికల నుంచి సిల్కు గుడ్డల స్థాయికి ఎదిగినట్లు మొట్టమొదటిసారి బయటపెట్టింది ‘తెహెల్కా’ పత్రిక. పదేళ్ల కిందట తెహెల్కా చంద్రబాబు నాయుడిని దేశంలోకెల్లా అత్యంత ధనికుడయిన రాజకీయ నాయకుడిగా లెక్కగట్టింది. బాబుకు సింగపూర్‌లో హోటల్ ఉందనే ఆరోపణ -మొదటిసారిగా- చేసింది కూడా తెహెల్కాయే. ఆ హోటల్ ఎడ్రెస్ కూడా ఇస్తూ, దాని యాజమాన్యం వివరాలు సైతం వెల్లడించింది తెహెల్కా. ఈ వివరాల ఆధారంగా వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక వేదికలపై చంద్రబాబును కడిగేశారు. ఆయన బతికున్న రోజుల్లో ఎప్పుడూ బాబు తను ‘ఆగర్భ శ్రీమంతుడి’ననే రహస్యం బయటపెట్టకపోవడం విశేషం. అలాగే, తెహెల్కా పత్రికపై కూడా ఆయన ‘పరువు నష్టం వ్యాజ్యం’లాంటిదేమీ వేసినట్లు లేరు.

గత సంవత్సరం వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చంద్రబాబు ఆస్తులను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టును కోరారు. చంద్రబాబు ఆ పిటిషన్‌పై విచారణ చెయ్యడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం, సుప్రీం కోర్టు విజయమ్మ అభ్యర్థనను కొట్టివేయడం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా కూడా చంద్రబాబు తన ‘ఆగర్భ సిరిసంపదల’ గురించి ఏమీ మాట్లాడకపోవడం వింతగా ఉంది.

ఓదార్పు యాత్రల సందర్భంగానూ, ఎన్నికలూ ఉప ఎన్నికల సందర్భంగానూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి -తెహెల్కా పేరెత్తుతూ- కొన్ని వందలసార్లు చంద్రబాబు ‘అక్రమార్జన’పై ఆరోపణలు సంధించారు. పదిమందిలో పెట్టి నిలదీశారు. చంద్రబాబు నాయుడు సదరు ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోలేదు. కానీ, తను చిన్నప్పటి నుంచే శ్రీమంతుడిననే విషయం మాత్రం ఏ ఒక్క సందర్భంలోనూ వెల్లడించకపోవడం విడ్డూరంగానే ఉంది.

రాజకీయాల్లోకి ప్రవేశించకముందు గర్భ దరిద్రుడిగా ఉన్న చంద్రబాబు, అకస్మాత్తుగా దేశం మొత్తం మీద అత్యంత ధనికుడయిన రాజకీయుడిగా ఎలా తలెత్తగలిగారని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ పత్రిక, టీవీ చానెల్ ఎన్నో సార్లు నిలదీశాయి. ‘ఏది నిజ’మో చెప్పాలని చంద్రబాబునూ, ఆయన కొమ్ముకాసే ఎల్లో మీడియానూ సవాలు చేశాయి. కానీ, వారుగానీ- వీరు గానీ ‘ఇదీ నిజం!’ అంటూ చంద్రబాబు భూస్వామ్య నేపథ్యం గురించి బయటపెట్టనేలేదు. ఇంతకు మించిన ఆశ్చర్యకరమయిన విషయం మరొకటి ఉంటుందా?

ఇప్పుడు ఏం చూసుకుని చంద్రబాబు తన నేపథ్యం గురించి వెల్లడించారో, అందుకు సందర్భమేమిటో ఊహాతీతం. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నుమూసిన పూర్వ రంగంలో, తనను నడివీథిలో నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుపాలయి ఉన్న నేపథ్యంలోనూ చంద్రబాబు ధైర్యం పుంజుకుని ఈ ప్రకటన చేసినట్లుందని విమర్శకులు అంటున్నారు. ఒకవేళ అది నిజమయి ఉండకపోతే, వాస్తవాలేమిటో వెల్లడించడం చంద్రబాబు నైతిక ధర్మం. తన భూస్వామ్య నేపథ్యం విషయంలో గుట్టు పాటించినట్టుగా, ఈ విషయంలో కూడా బాబుగారు దాపరికం పాటించకుండా బయటకు రావడం అవసరం!
Share this article :

0 comments: