బాబు సీమ ద్రోహి... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు సీమ ద్రోహి...

బాబు సీమ ద్రోహి...

Written By news on Thursday, September 27, 2012 | 9/27/2012

Written by Parvathi On 9/27/2012 3:51:00 PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సొంత జిల్లా నుంచి తిరుగుబాటు బావుట ఎదురైంది. ప్రధానమంత్రికి చంద్రబాబు తెలంగాణపై లేఖ రాయడంపై చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదించకుండా బాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి గళమెత్తారు. చంద్రబాబు సొంత గడ్డకు ద్రోహం చేశారని బాహాటంగానే మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రధానికి లేఖ రాసి ఇరవై నాలుగు గంటలు ముగియక ముందే బాబు వైఖరిపై పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు రాసిన తెలంగాణ లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రవీణ్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. తెలుగుదేశంపార్టీ ఇప్పటికే అస్తవ్యస్తమైందని.. పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారా అని ఆయన మండిపడ్డారు. లేఖను ఉప సంహరించుకోకుండా సమైంక్యాంధ్రే టీడీపీ విధానమని చెప్పకపోతే టీడీపీని వీడడం ఖాయమని ప్రవీణ్‌ కుండబద్ధలు కొట్టారు.

పార్టీ కన్నా, సొంత ప్రయోజనాల కన్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. బాబు పాదయాత్రకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. పైగా పాదయాత్రకు చిత్తూరు జిల్లా వస్తే నిరసన తెలుపుతామని కూడా ప్రవీణ్ హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని, ఆ ప్రాంతం వ్యక్తి అయి ఉండి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు రెండువేల తొమ్మిది నుంచి తప్పులే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ పేరుతో సీమాంద్రులపై దాడికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తుంటే, దానికి తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలే కాదని, రాయలసీమ ప్రాంతం కూడా ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీలో తెలుగు అనే పదం పెట్టుకునే అర్హత టీడీపీకి లేదని, తెలంగాణ దేశం అని పెట్టుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు.

బాబు తెలంగాణ లేఖ ఇవ్వడాన్ని ప్రవీణ్ కుమార్ రెడ్డి గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ లేఖ ఇస్తే పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ తో ఈ విషయాన్ని చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ లేఖ ఇస్తే పార్టీకి రాయలసీమలో ఎదురయ్యే పరిణామాలను ఎమ్మెల్యే వివరించినట్లు తెలిసింది. అయితే పార్టీ వీడే యోచనలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలంగాణ లేఖను రాద్ధాంతం చేస్తున్నారని ఆపార్టీకి చెందిన తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరి మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజాగా తెలంగాణ లేఖతో ఇప్పుడు సీమాంధ్ర నుంచి కూడా బాబుకు నిరసనలు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రత్యేక రాయలసీమ అంటూ టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన ప్రయత్నాలు తాను చేస్తున్న విషయం తెలిసిందే.

పార్టీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు ఒంటికన్ను విధానంపై నిలబడతారా...లేక రెండుకళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. కాగా తెలంగాణపై చంద్రబాబు లేఖ చాలా స్పష్టంగా ఉందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెప్పటం విశేషం.

source: sakshi
Share this article :

0 comments: