రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిన రాష్ట్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిన రాష్ట్రం

రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిన రాష్ట్రం

Written By news on Friday, September 21, 2012 | 9/21/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: విపక్షాల నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, నేతల అరెస్టులతో రాష్ట్రం హోరెత్తిపోయింది. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రంలో జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ నేతలు సహా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టయ్యారు. బంద్ ప్రభావంతో విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రవాణాసేవలపై పాక్షిక ప్రభావం కనిపించింది. ఆర్టీసీ దూరప్రాంత బస్సులను నిలిపివేసింది. రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లో సిటీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

థియేటర్లలో ఉదయం ఆటలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉదయం పూట షిఫ్ట్‌లను సాయంత్రానికి మార్చుకున్నాయి. కరెంటు కోతలతో కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మూతపడగా.. మరికొన్నింటిని బంద్‌కు మద్దతుగా మూసేశారు. అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయించడంతో ఆందోళనకారులు వాటికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. అటు కాంగ్రెసేతర పక్షాల ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట రాస్తారోకో చేసి, అరెస్టయ్యారు. బంద్ విజయవంతమైందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. 

రాఘవులుకు స్పల్ప గాయాలు..

ఉదయం ఆరింటికే రోడ్ల మీదకు వచ్చిన లెఫ్ట్, టీడీపీ కార్యకర్తలు డిపోల ఎదుట బస్సులను అటకాయించారు. హైదరాబాద్‌లోని ఇమ్లిబన్ బస్‌స్టేషన్ వద్ద సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకుడు పి.మధు ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి బస్ స్టేషన్‌కు టీడీపీ నేతలు తాళాలు వేసి నిరసన తెలిపారు. నారాయణగూడ చౌరస్తాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ నేత అజీజ్‌పాషా, టీడీపీ నేతల నేతృత్వంలో కార్యకర్తలు రోడ్లను దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో రాఘవులు సహా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. 

డీఎస్పీ తరుణ్‌జోషి రాఘవులు పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు తదితరుల నాయకత్వంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టుల సందర్భంగా వివిధ పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం సాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. 

అసెంబ్లీకి ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన..

బంద్‌కు మద్దతుగా టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసన ప్రదర్శనగా వెళ్లారు. కట్టెల పొయ్యిలతో వంటచేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే.. మున్ముందు కట్టెలపొయ్యిలు, సైకిళ్లు, ఒంటెద్దు బండ్లే దిక్కంటూ నిరసించారు. సీపీఐ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, చంద్రావతి, యు.యాదగిరిరావు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర చేశారు. సీపీఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, పయ్యావుల కేశవ్, నన్నపనేని రాజకుమారి నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, హరీష్‌రావు నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని ఊరేగింపుగా అసెంబ్లీకి వెళ్లారు. సభ వాయిదా పడిన అనంతరం విపక్షాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెయిన్‌గేట్ ఎదుట రాస్తారోకో జరిపారు. 

మూడు నిమిషాల్లో ముగిసిన నిరసన

టీడీపీ, సీపీఎం, సీపీఐ చేపట్టిన రాస్తారోకో కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. సభ వాయిదా పడిన వెంటనే టీడీపీ, సీపీఐ, సీపీఎం సభ్యులు ప్రదర్శనగా అసెంబ్లీ నుంచి రవీంద్రభారతి చౌరస్తాకు చేరుకున్నారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు రోడ్డుకు అడ్డంగా అలా నిలబడ్డారో లేదో పోలీసులు ఇలా రంగంలోకి దిగి అరెస్టు చేయటం ప్రారంభించారు. 12.40 గంటలకు రాస్తారోకో ప్రారంభించగా పోలీసులు 12.43 గంటలకు అరెస్టు చేశారు. ఆ తరువాత వారినందరిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించి, అక్కడ విడిచిపెట్టారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బైఠాయింపు..

అసెంబ్లీ గేటు బయట ఉన్న రహదారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. శాసనసభ అర్ధంతరంగా శుక్రవారానికి వాయిదా పడిన తరువాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వీరు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, భూమన కరుణాకర్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వై.బాలనాగిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరిని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లగా.. మరికొందరిని నాంపల్లి స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత వదిలిపెట్టారు.

source: sakshi


Share this article :

0 comments: