జెన్‌కోలో వందల కోట్ల బొగ్గు కుంభకోణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జెన్‌కోలో వందల కోట్ల బొగ్గు కుంభకోణం

జెన్‌కోలో వందల కోట్ల బొగ్గు కుంభకోణం

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు
ప్లాంట్లకు వచ్చే దారిలోనూ యథేచ్ఛగా దోపిడీ.. వేబ్రిడ్జిల్లోనూ దొంగలెక్కలు
బయట అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్న అధికారులు
ఒక్క కేటీపీపీ నుంచే రూ.40 కోట్ల 
విలువైన నల్లబంగారం మాయం!
అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి!

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకపక్క కేంద్రంలో ‘కోల్‌గేట్’ యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క రాష్ర్టంలో భారీ బొగ్గు కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా జెన్‌కో విద్యుత్ ప్లాంట్లకు చెందిన బొగ్గే మాయమైపోతోంది. విద్యుత్ ప్లాంట్లకు రైల్వేవ్యాగన్లలో వచ్చిన బొగ్గు.. లారీలకొద్దీ అక్రమంగా బయటకు తరలిపోతోంది. కొన్నిచోట్ల ఎక్కువ బొగ్గు వచ్చినట్లు లెక్కలు చూపిస్తూ.. ఆ అదనపు బొగ్గుకు సరిపడా మొత్తాన్ని అధికారులు దిగమింగుతున్నారు. మరికొన్ని చోట్ల సిసలైన బొగ్గును కొంతమేరకు మార్గమధ్యంలోనే నొక్కేసి ఆ మేరకు రాళ్లు, రప్పలు లారీల్లో నింపి ప్లాంట్లకు పంపుతున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు ఆడుతున్న నాటకం రోజుకు రెండు వ్యాగన్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. జెన్‌కో ప్లాంట్ల బొగ్గును కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు బయట అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘నల్ల బంగారానికి’ సంబంధించి వెలుగుచూస్తున్న కోట్ల విలువైన అవకతవకలు చూసి జెన్‌కో సిబ్బందే ‘తెల్ల’బోతున్నారు. సింగరేణికి అధిక ధర చెల్లించి మరీ జెన్‌కో కొనుగోలు చేస్తున్న బొగ్గు ఈ విధంగా అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఇటీవల వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో గత మూడు నెలల లెక్కలు తీస్తే... ఏకంగా 50 వేల టన్నుల బొగ్గు లెక్క తేలలేదు. సింగరేణి నుంచి కొంటున్న టన్ను బొగ్గు ధర (రవాణాతో కలుపుకుని) సుమారు రూ.2 వేల మేరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఒక్క కేటీపీపీలోనే రూ.10 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం జరిగింది. అదీ కేవలం మూడు నెలల కాలానికి మాత్రమే. అంటే ఏటా రూ.40 కోట్ల విలువైన బొగ్గు కేటీపీపీ నుంచి బయటకు తరలిపోతోందన్నమాట. జెన్‌కోకు చెందిన ఇతర విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో అవకతవకలు వందల కోట్లలో ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇలా దిగమింగుతున్నారు..!

విద్యుత్ ప్లాంటులోకి బొగ్గుతో వచ్చిన ప్రతి వ్యాగను, లారీ బరువు కొలిచేందుకు ప్లాంటులో వే బ్రిడ్జ్ ఉంటుంది. బొగ్గుతో ఉన్నప్పుడు వ్యాగన్/లారీ ఎంత బరువు ఉంది? బొగ్గును అన్‌లోడ్ చేసిన తర్వాత ఎంత లోడ్ ఉందనే విషయాన్ని ఆటోమేటిక్‌గా ఈ వే బ్రిడ్జ్ నమోదు చేస్తుంది. అయితే ఈ వే బ్రిడ్జ్‌లోని లెక్కలనే అధికారులు తారుమారు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నట్టు నమోదు చేస్తున్నారు. వాస్తవంగా తక్కువ బొగ్గు సరఫరా అయినప్పటికీ అధిక బొగ్గు వచ్చినట్టుగా లెక్కల్లో చూపుతున్నారు. అదనంగా చూపించిన మొత్తానికి బయట డబ్బులు వసూలు చేసుకుంటూ.. ప్లాంట్లలో బొగ్గు అధికంగా వినియోగమవుతుందని లెక్కలు చూపడం ద్వారా లెక్కలను సరిసమానం చేసేస్తున్నారు. వర్షాల వల్ల బొగ్గు తడిచి వస్తోందని... అందువల్ల విద్యుత్ ప్లాంట్లలో బాయిలర్‌ను మండించేందుకు ఎక్కువ బొగ్గును వినియోగించాల్సి వస్తోందని సాకులు చెబుతున్నారు. జెన్‌కోలో ఈ తతంగం చాలా కాలం నుంచే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బొగ్గు స్థానంలో రాళ్లు, మట్టి!

కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు వ్యాగన్ల ద్వారా సింగరేణి రామగుండం మైన్స్ నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 65 కిలోమీటర్ల మేరకు రోడ్డు మార్గం ద్వారా భూపాలపల్లి కేటీపీపీకి లారీల్లో బొగ్గును రవాణా చేస్తున్నారు.ప్రతిరోజూ 200 లారీల బొగ్గు సరఫరా అవుతోంది. లారీల ద్వారా బొగ్గును సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై దారి మధ్యలో లారీలను పక్కదారి పట్టిస్తున్నారు. లారీకింత చొప్పున సిసలైన బొగ్గును తీసివేసి... ఆ స్థానంలో రాళ్లు, మట్టి, ఇసుక, సున్నపురాళ్లతో నింపుతున్నారు. బయటకు తీసిన బొగ్గును అధిక ధరకు సిమెంటు ఫ్యాక్టరీలకు, ఇతర పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. లారీలకు సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో అక్రమ దందా యధేచ్చగా సాగిపోతోందనే ఆరోపణలున్నాయి. విద్యుత్ ప్లాంటులోని పై స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున బొగ్గును అక్రమంగా తరలించడం సాధ్యం కాదనీ చెబుతున్నారు. కేవలం కేటీపీపీలోనే కాకుండా జెన్‌కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ బొగ్గు అక్రమంగా బయటకు తరలిపోతోందని తెలుస్తోంది. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లోకి రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన బొగ్గును లారీల ద్వారా బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారులకు అందినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జెన్‌కోలో భారీయెత్తున జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై తక్షణమే దర్యాప్తు జరిపించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 

అంతిమంగా ప్రజలపైనే భారం..!

రాష్ట్రంలో జెన్‌కోకు వివిధ ప్రాంతాల్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు (థర్మల్) ఉన్నాయి. విజయవాడలో 1760 మెగావాట్ల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్), ఖమ్మం జిల్లాలో 1440 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్), వైఎస్సార్ జిల్లాలో 1050 మెగావాట్ల రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఆర్‌టీపీపీ), వరంగల్ జిల్లాలో 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ), కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 60 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఉన్నాయి. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 4,410 మెగావాట్లు. ఈ విద్యుత్ ప్లాంట్లకు సుమారు 80 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ బొగ్గును మహానది కోల్‌ఫీల్డ్స్, సింగరేణి నుంచి జెన్‌కో సేకరిస్తుంది. అయితే మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సక్రమంగా సరఫరా కావడం లేదు. అందువల్ల సింగరేణి నుంచి ఒప్పందం కంటే ఎక్కువ బొగ్గును అధిక ధర చెల్లించి మరీ జెన్‌కో తీసుకుంటోంది. అయినప్పటికీ అవసరాలు తీరకపోవడంతో విదేశాల నుంచి టన్నుకు ఏకంగా సుమారు రూ.5,600 చెల్లించి బొగ్గును కొనుగోలు చేస్తోంది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు మాయమవుతుండటంతో... బొగ్గు ఎక్కువ అవసరమై విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే మోపుతారు. అంటే అంతిమ భారం ప్రజలపైనే పడుతుందన్నమాట. 
Share this article :

0 comments: