ధరల పెంపు ఉపసంహరించుకోవాల్సిందే: సోమయాజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధరల పెంపు ఉపసంహరించుకోవాల్సిందే: సోమయాజులు

ధరల పెంపు ఉపసంహరించుకోవాల్సిందే: సోమయాజులు

Written By news on Saturday, September 15, 2012 | 9/15/2012


 కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ.5 పెంచడం, గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు విధించడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యూపీఏ ప్రభుత్వ పాలకుల వైఫల్యం ప్రజలకు శాపంగా మారిందని, వారి చేతకానితనం వల్లే దేశంలో దుర్భర ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజిల్ ధర పెంపుతో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందని, గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీపై ఆంక్షలు విధించడంతో మధ్య తరగతి కుటుంబాలు కుదేలవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

యూపీఏ ప్రభుత్వ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ‘‘దేశ వాణిజ్యలోటు 2005లో 20 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో దేశీయ రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. దీని కారణంగా ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఆ భారం ప్రజలపై మోపుతున్నారు’’ అని మండిపడ్డారు. 2008 జూలై 4న ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లుగా ఉంటే ఇప్పుడది కేవలం 97 డాలర్లుగా ఉందని, 43 డాలర్లు తగ్గినప్పటికీ యూపీఏ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. దీనికంతటికీ కారణం యూపీఏ పాలకుల విధానాల వైఫల్యమేనన్నారు. వారి తప్పుడు విధానాల వల్ల జీడీపీ వృద్ధిరేటు 5 శాతం పడిపోయిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంలో పడుతుందన్నారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని సోమయాజులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లు ప్రజలకు పంచాలి

డీజిల్ ధరల పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పనంగా వచ్చి చేకూరుతున్న రూ.500 కోట్లను ప్రజలకు తిరిగివ్వాలని సోమయాజులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కష్టం లేకుండా డీజిల్‌పై 23 శాతం వ్యాట్ రూపంలో రూ.500 కోట్లు వచ్చి చేరుతున్నాయని వివరించారు.

నేటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలని, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డీజిల్ ధర పెంపు సామాన్యులపై పెను ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తంచేసింది.
Share this article :

0 comments: