కాంగ్రెస్ కు బాసటగా సిబిఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కు బాసటగా సిబిఐ

కాంగ్రెస్ కు బాసటగా సిబిఐ

Written By news on Friday, September 14, 2012 | 9/14/2012


సిబిఐ పేరు చెబితే చిన్న పిల్లలు కూడా ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యదేశంలో రాజ్యంగబద్ధంగా ఏర్పడిన సంస్థ బ్రష్టుపట్టిపోయిందని అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ చిత్తశుద్ధిని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సీబీఐ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని ఎంతో కాలంగా విమర్శలు వినవస్తున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేవిధంగా ఆ సంస్థ అధికారులు వ్యవహరిస్తున్నారు. అందువల్లే సీబీఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ‘బిరుదు’ని కూడా ప్రసాదించారు.

ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేని సందర్భంలో సీబీఐ ద్వారా కాగల కార్యం నెరవేర్చుకోవడమనేది కాంగ్రెస్‌కు అలవాటయిన విద్య. అందులో భాగంగానే గతంలో బిజెపి, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తదితర ప్రత్యర్థి పక్షాలపై సీబీఐ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది. అప్పట్లోనే సీబీఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న పేరు స్థిరపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసు విషయంలో కూడా ఇది రుజువైంది. ఇటీవల కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కూడా అదే జరుగుతోంది.

ప్రాంతీయ పార్టీల నేతలే కాకుండా, జాతీయస్థాయి నేతలు కూడా సిబిఐపై నిప్పులు చెరుగుతున్నారు. రాజ్యంగబద్ధంగా ఏర్పడిన సంస్థ ఆ కోణంలో పనిచేయడంలేదని మాటలతూటాలు పేలుస్తున్నారు. కష్టకాలంలో యుపిఏకు అండగా ఉండే ములాయం సింగ్ యాదవ్ కూడా సిబిఐ వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎటుతీసుకుపోతున్నారంటూ సిబిఐ విషయంలో యుపిఏను ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఇలా ప్రత్యర్ధి పార్టీలు, యుపిఏకు మద్దతిచ్చే పార్టీలే కాకుండా, కాంగ్రెస్‌ నేతలు కూడా సిబిఐ వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతున్నారు. సిబిఐ సొంత అభిప్రాయాలను రుద్దుతుందంటూ విమర్శలకు దిగుతున్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి సిబిఐపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఓడించడానికి కాంగ్రెసే కాకుండా సీబీఐ కూడా కంకణం కట్టుకుందని ఆయన నిప్పులు చెరిగారు. తనను లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, సీబీఐని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడం లేదని, ఆ పార్టీకి బాసటగా సీబీఐ కూడా ఉందని మోడీ వ్యాఖ్యానించారు.

మన రాష్ట్రంలో అయితే సిబిఐ పరిస్థితి మరీ దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో సీబీఐ నడుస్తోందనేది జగమెరిగిన సత్యం. మన రాష్ట్రానికి వచ్చేసరికి సీబీఐ ఉన్నతాధికారులు సొంత ఎజెండాలతో, విచ్చలవిడిగా వ్యవహరించడంతో ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని సంస్థకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో 850 ఎకరాల భూమిని నగరం నడిబొడ్డున కేటాయించారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని అప్పట్లో మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐని కోరారు. అయితే, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తమ వద్ద ‘తగినన్ని వనరులు లే’వని సాకు చెప్పి అందుకు సిద్ధపడలేదు. జగన్ కేసు విషయానికి వచ్చేసరికి కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాలమీద ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించి రంగంలోకి దిగిపోయారు. ఈ కేసు విషయంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. కాంగ్రెస్‌, టిడిపి, ఎల్లో మీడియా కుట్రలో సీబీఐ కూడా చేతులు కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. సిబిఐ ఎల్లో మీడియాకు లీకులు - ఎఫ్ఐఆర్ లోని అంశాలతో ఆ పత్రికలు ప్రత్యేక కథనాలు వండి వార్చడం - ఆ తరువాత ఆ అంశాలతోనే సిబిఐ ఛార్జిషీట్ దాఖలు - ఇలా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. సీబీఐ దర్యాప్తు సకలం తమకు తెలిసే జరుగుతోందన్నట్లుగా ఒక వర్గం మీడియా రాతలు రాసింది. దాంతో సిబిఐ విస్వసనీయత పూర్తిగా కోల్పోయింది.

వచ్చే ఎన్నికల్లో మెరుగయిన ఫలితాలు రాబట్టుకునేందుకు తమ వద్ద ఏవో అస్త్రాలూ, ఆయుధాలూ ఉన్నట్లు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ‘ఏమిటా అస్త్రం, ఆయుధం? సీబీఐయేనా?’ అని వైఎస్ జగన్ సతీమణి భారతి సూటిగా ప్రశ్నించారు, నిష్పక్షపాతంగా, పూర్తీ పారదర్శకంగా వ్యవహరించవలసిన రాజ్యంగబద్ధం సంస్థ సిబిఐ ఇలా చెడ్డపేరు మూటగట్టుకోవడం విచారకరం. పాలకుల చెప్పుచేతల్లో కాకుండా సిబిఐ స్వేచ్ఛగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. 
Share this article :

0 comments: