ఎందుకీ క్షోభ?:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎందుకీ క్షోభ?:విజయమ్మ

ఎందుకీ క్షోభ?:విజయమ్మ

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

*‘ఫీజు దీక్ష’లో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ విజయమ్మ 
*విద్యార్థులను, తల్లిదండ్రులను ఎందుకు క్షోభ పెడుతున్నారు?
*‘ఫీజు దీక్ష’లో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ విజయమ్మ
*ఫీజుల పథకానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?
*లక్షా 45 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా.. ఫీజులపై పిసినారితనమెందుకు?
*మేమేం తక్కువ చేశామని మంత్రులు అంటున్నారు.. అర్హులైన అందరికీ ఫీజులిస్తున్నామని మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరా?
*ఫీజుల పథకం నీరుగారుతూంటే బాబు మౌనంగా ఎందుకున్నారు?
*మేం ఫీజులపై ఆందోళనలకు పిలుపునిచ్చామని తెలియగానే.. 
*ఆయన 2 గంటలు ధర్నా చేసి అరెస్టయి వెళ్లిపోయారు
*నేడు కూడా కొనసాగనున్న విజయమ్మ ఫీజు దీక్ష

వైఎస్ ఈ పథకాన్ని ఒక సామాజిక పెట్టుబడిగా భావించే వారు. అందుకే పేదరికం కారణంగా పిల్లలు పెద్ద చదువులకు దూరం కారాదని భావించారు. పెద్ద చదువులు పేదల హక్కు అని ఆలోచించారు కనుక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారు. ఈ సర్కారు పది వేల లోపు ర్యాంకు వారికే మొత్తం ఫీజు ఇస్తామంటోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికే ఇస్తామంటోంది. ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఫీజుల పథకాన్ని నీరుగార్చడానికే కదా! 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘అర్హులైన పేద, బడుగు వర్గాల విద్యార్థులందరికీ ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటి? ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? విద్యార్థులనూ, వారి తల్లిదండ్రులనూ ఈ ప్రభుత్వం ఎందుకు మానసిక క్షోభకు గురిచేస్తోంది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిలదీశారు. నిరుపేద విద్యార్థులకు ఎలాంటి పరిమితులూ విధించకుండా ఫీజుల పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ధర్నాచౌక్(ఇందిరాపార్కు) వద్ద గురువారం ఆమె ‘ఫీజు దీక్ష’ ప్రారంభించారు. ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి చేపట్టిన ఈ దీక్షకు పెద్దఎత్తున హాజరైన విద్యార్థినీ విద్యార్థులు, యువకులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వైఎస్ అయితే వెనక్కు తగ్గేవారుకాదు: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తొలి ఏడాదిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 40 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్లలో అది 1.04 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఫీజుల పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో 28 లక్షల మంది విద్యార్థులకు ఫీజుల అందాయి. వాళ్ల కుటుంబాలతో కలుపుకొని మొత్తం కోటి మంది దాకా లబ్ధి పొందారు. వైఎస్ ఉన్నపుడు ఈ పథకానికి అయిన ఖర్చు తక్కువని, ఇపుడు ఎక్కువ అవుతోందని ప్రస్తుత పాలకులు చెబుతున్నారు. వైఎస్ ఉన్నా దీనిని కొనసాగించలేకపోయేవారని అంటున్నారు. అదెంత మాత్రం నిజం కాదు.. వైఎస్ దేన్నైనా ఒక్కసారి ప్రారంభిస్తే వెనక్కు తగ్గే వారుకాదు. ఎంత భారమైనా ఏదో విధంగా దానిని పరిష్కరించేందుకు కృషి చేసే వారు. ఉచిత విద్యుత్, ఫీజుల పథకాలను ఆయన అమలు చేసిన తీరే అందుకు నిదర్శనం.

ఎందుకీ పిసినారితనం?: వైఎస్‌ఉన్నప్పటికన్నా ఇపుడు బడ్జెట్ ఎక్కువగా ఉంది. అదిపుడు లక్షా 45 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. అయినా పిల్లల చదువులకు ఫీజులు ఇవ్వకుండా పాలకులు పిసినారితనాన్ని ప్రదర్శించడమేంటి? ఫీజుల పథకం విషయంలో ఏం తక్కువ చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ దీక్ష చేస్తోందంటూ కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. వారిని నేనొక్కటే అడుగుతున్నాను. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. శాచ్యురేషన్(సంతృప్త స్థాయి) ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఈ పథకం మీరు అమలు చేస్తున్నారా? అసలు ఈ ప్రభుత్వం తొలి నుంచీ ఫీజుల పథకాన్ని భారంగానే భావిస్తోంది. మంచి ఆలోచనతో చూడటం లేదు. కేంద్రం ఈ రోజు విద్యాహక్కు చట్టం చేసి ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలని భావిస్తోంది. అయితే వైఎస్ అంతకు ముందే ఉన్నత విద్య పేదలకు అందించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి ఫీజుల పథకం ప్రవేశపెట్టి విద్యార్థులకు ఒక భరోసాగా నిలిచారు. వైఎస్ మాదిరిగా పథకాలన్నీ అమలు చేస్తే సామాజిక విప్లవం వస్తుంది.

దీక్ష చేయమని జగన్‌బాబు చెప్పాడు: ‘అమ్మా... ఈ ప్రభుత్వం ఫీజుల పథకాన్ని యథాతథంగా అమలు చేయడం లేదు. కాలేజీల ఫీజులు 52 వేల నుంచి ఒక లక్షా ఐదు వేల రూపాయల వరకూ పెంచింది. ప్రభుత్వం 35 వేల రూపాయలు మాత్రమే ఇస్తుందట. ఇలాగైతే పేద విద్యార్థులు ఒక్కొక్కరూ 15 వేల నుంచి 75 వేల రూపాయల వరకూ సొంతంగా కట్టుకోవాల్సి ఉంటుంది. అంత డబ్బు వారు కట్టుకోలేరమ్మా... అందుకే వారి కోసం నువ్వు దీక్ష చేయాలి’ అని జగన్‌బాబును నేను జైలులో కలిసినప్పుడు చెప్పాడు. ఖజానాకు డబ్బు రాక పోతే మన మీద అన్ని రకాల భారం వేసి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుకొంటున్న ప్రభుత్వానికి ప్రజల కష్టాలు ఎందుకు పట్టవు? వైఎస్ పిల్లల చదువుల గురించి ఆలోచించినట్లుగా ఈ ప్రభుత్వం భాధ్యతాయుతంగా ఎందుకు ముందుకు రావడం లేదు? ప్రతి ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజుల గురించి టెన్షన్ పడాల్సి వస్తోంది. ఫీజులు ఇచ్చే ఉద్దేశం లేకుంటే.. ఫీజులపై ఆంక్షలు విధిస్తామని ప్రభుత్వం ఎంసెట్ రాసేటపుడే విద్యార్థులకు ఎందుకు చెప్పలేదు?

టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయి: విద్యార్థులకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏమీ మాట్లాడరు. ఈ సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ పెట్టమని అడగరు.. అవిశ్వాసం పెట్టరు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆందోళనకు పిలుపునిస్తే రెండ్రోజుల ముందుగా తానూ ఒకట్రెండు గంటలు ధర్నా చేసి అరెస్టయి వెళ్లిపోతారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక ్కయ్యాయి. ఆ పార్టీలు ఎంతగా కలిసిపోయాయంటే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను నియంత్రించడానికి కొన్ని చోట్ల టీడీపీకి, మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాని విధంగా ఒకరికొకరు సహకరించుకున్నాయి. బీసీల విషయంలోనూ అంతే! బీసీలకు వంద టికెట్లు కాదు, వంద సీట్లు ఇద్దామని జగన్‌బాబు చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందించరు. చంద్రబాబు 2009 ఎన్నికలపుడు కూడా బీసీలకు వంద టికెట్లు ఇస్తానని చెప్పి 47 మందికే ఇచ్చారు. అదే వైఎస్ ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పకుండానే 67 మందికి టికెట్లు ఇచ్చారు. ఇపుడు ఎలాగైనా వంద మంది బీసీలను అసెంబ్లీకి వెళ్లేలా చేయాలని జగన్‌బాబు అంటున్నారు.

ఆ పథకం బాబు పెట్టారా: ఫీజుల పథకం తానే పెట్టానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. నిజంగా ఈ పథకం ఆయనే పెట్టి ఉంటే ఏ ఒక్కరైనా చెప్పాలి కదా.. ఆయన హయాంలో ఫీజులు పొందానని! ఈ రోజు ఆయన కాలేజీల చుట్టూ తిరుగుతూ మీటింగ్‌లు పెట్టి.. తాను పథకం పెట్టానని చెబుతున్నారు. నేను ఇపుడు దీక్ష చేస్తున్న చోట(ధర్నా చౌక్) గతంలో వారం రోజులపాటు జగన్‌బాబు ఫీజుల కోసం దీక్ష చేశారు. వారం రోజులపాటు ఏమీ తినకుండా ఎలా ఉంటావు.. నాన్నా! అని నేను అడిగితే వేలాది మంది తల్లిదండ్రులకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నా వల్ల మేలు జరుగుతుందంటే.. అంత కంటే ఏం కావాలమ్మా అని అన్నాడు. విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు కట్టలేదని కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా ఒంగోలులో ఒక రోజు ధర్నా చేశాడు. జగన్ త్వరలో బయటకు వస్తాడు. తప్పకుండా వైఎస్ పథకాలన్నింటినీ అమలు చేస్తాడు.


పోటెత్తిన విద్యార్థులు, మహిళలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం ప్రారంభించిన రెండు రోజుల ‘ఫీజు దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘ఫీజు దీక్ష’కు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల, యూనివర్సిటీల్లో విద్యార్థులు కూడా దీక్షలు, నిరసనలు ప్రారంభించగా.. హైదరాబాద్‌లో విజయమ్మ దీక్ష చేస్తున్న ‘ధర్నాచౌక్’కు వేలాదిగా విద్యార్థులు, మహిళలు తరలి వచ్చారు. ప్రత్యేకించి రంగారెడ్డి, హైదరాబాద్ పరిసరాల్లోని ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి జేజేలు పలికారు. 

విజయమ్మను చూడటానికి విద్యార్థులు, యువతులు ఎగబడ్డారు. వికలాంగ విద్యార్థులు, గిరిజనుల సంఘాల నాయకులు విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. ఫీజు దీక్షకు హాజరైనవారిలో ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, తెల్లం బాలరాజు, జి.బాబూరావు, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ప్రసాదరాజు, జంగా కృష్ణమూర్తి, పార్టీ ముఖ్యనేతలు వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, తలశిల రఘురాం, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, జనక్ ప్రసాద్, రాజ్‌సింగ్ ఠాకూర్, బి.జనార ్ధన్ రెడ్డి, ఆదం విజయకుమార్, విజయచందర్, కె.కె.మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్, పువ్వాడ అజయ్ కుమార్, కె.అమృతాసాగర్, బి.శివకుమార్, వి.ఎల్.ఎన్.రెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: