చివరి వరకూ వైఎస్ కుటుంబంతోనే: సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చివరి వరకూ వైఎస్ కుటుంబంతోనే: సురేఖ

చివరి వరకూ వైఎస్ కుటుంబంతోనే: సురేఖ

Written By news on Thursday, September 13, 2012 | 9/13/2012

మీడియా ప్రచారానికి కొండా సురేఖ ఖండన
హైదరాబాద్, న్యూస్‌లైన్: తాము రాజకీయాల్లో ఉన్నంత వరకూ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆమె గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు తాను దూరంగా ఉన్నట్లు, పార్టీకి రాజీనామా చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయనీ అవన్నీ పూర్తిగా తప్పు అని ఆమె అన్నారు. వై.ఎస్ మృతి చెందినపుడు ఒక మాట కోసం కట్టుబడి ఆయన కుటుంబంతో పయనిస్తున్నానని అందుకోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానని ఆమె అన్నారు. తమ కుటుంబం వై.ఎస్ కుటుంబం కోసం మూడు పదవులను, తాను తొలుత మంత్రి పదవిని ఆ తరువాత ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాననీ తన భర్త కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయారని ఆమె అన్నారు. తాము ప్రపలోభాలకు, పదవుల కోసం పాకులాడే వారం కాదని కూడా అన్నారు. వాస్తవానికి తమను ప్రలోభ పెట్టాలని చూసింది కాంగ్రెసేనని ఆమె అన్నారు. సీఎం ఫోన్లో మాట్లాడతారని, ఆజాద్ మాట్లాడతారని తమకు సందేశాలు పంపారని అయినా వాటిని తాము ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. 

శాసనమండలిలో కొందరు అధికారులు సైతం తాము కనుక ఒక్కసారి ముఖ్యమంత్రితో మాట్లాడితే కౌన్సిల్ పదవి రద్దు కాదని చెప్పారనీ అయినా ఖాతరు చేయలేదన్నారు. ఒక నమ్మిన నాయకుని కోసం ఇచ్చిన మాట కోసం నిలబడే వారమని ఆమె వివరించారు. తాను అనారోగ్యంతో ఉండటం వల్లనే పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైదరాబాద్‌లో చేసిన ఫీజు దీక్షకు హాజరు కాలేక పోయానని ఆమె అన్నారు. తీవ్రమైన వెన్ను నొప్పితో తాను భాధపడుతూ ఉండటం వల్ల విశ్రాంతి అవసరం అయిందని తన భర్తకు వరంగల్‌లో పనులున్నందువల్ల హాజరు కాలేక పోయారని ఆమె పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ తాము శాయశక్తులా కృషి చేస్తామనీ తద్వారా వై.ఎస్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని కూడా ఆమె అన్నారు. తమకు ఏమైనా సమస్యలుంటే నేరుగా జగన్‌తో మాట్లాడుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్‌లో తమకు ఆ స్వేచ్ఛ, అధికారం ఉన్నాయని ఆమె అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎప్పుడూ తమకు మంచి గౌరవం లభిస్తూ ఉందని కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికి వంద డెడ్‌లైన్లు పెట్టారనీ వాటి గురించి తాము పెద్దగా పట్టించుకోబోమని ఆమె మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఈ నెలాఖరుకు తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెబుతున్నారని ఆ విషయమై రెండు మూడు రోజుల్లో తాము కూడా స్పందిస్తామని అన్నారు. రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు రాజకీయంగా నిలదొక్కుకోవడానికే వైఎస్ డైరీ పేరుతో ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇపుడు గాంధీభవన్‌లో వై.ఎస్ ఫోటో లేదని మాట్లాడ్డం కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతకూ వై.ఎస్ పేరుతో డైరీని ఆవిష్కరించింది ఆయనను పొగడ్డానికా లేక వై.ఎస్‌ను ఇంకా తిట్టించడానికా అని ఆమె ప్రశ్నించారు. కేవీపీని, మంత్రులను వదలి వేసి సీబీఐ ఒక్క వై.ఎస్ కుటుంబాన్నే బలి చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: