అక్రమ నిర్బంధాలను అధిగమిస్తూ వెల్లువెత్తిన జన నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్రమ నిర్బంధాలను అధిగమిస్తూ వెల్లువెత్తిన జన నిరసన

అక్రమ నిర్బంధాలను అధిగమిస్తూ వెల్లువెత్తిన జన నిరసన

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012


బంద్‌ను నీరుగార్చేందుకు సర్కారు దమననీతి 
ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులు 
ఎమ్మెల్యేలు, మహిళా నేతలపైనా దౌర్జన్యకాండ 
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది శ్రేణుల నిర్బంధం 
వాణిజ్య సంస్థలను బలవంతంగా తెరిపించిన వైనం 
పోలీసు బందోబస్తు మధ్య బస్సులు తిప్పే యత్నం 
బంద్‌కు సహకరించవద్దంటూ టీడీపీ ప్రచారం 
బంద్ విఫలమంటూ ఒక వర్గం మీడియా కట్టుకథలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని, సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. పార్టీ శ్రేణులపై ప్రభుత్వ అణచివేత వైఖరి, పోలీసుల అక్రమ నిర్బంధాలు, పెద్ద ఎత్తున అరెస్టుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బంద్‌ను విఫలం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దమననీతిని ప్రదర్శించింది. బంద్‌కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము సమయానికే వేలాది మందిని నిర్బంధించారు. ఉదయం రోడ్లపైకి వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బంద్ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఊరేగింపుల్లో పాల్గొంటూ ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరిని వారి ఇళ్ల వద్దనే నిర్బంధంలోకి తీసుకున్నారు. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పట్టుకుని కార్యకర్తలు కనిపిస్తే చాలు వారిని బలవంతంగా పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించి తరలించుకుపోయారు. బంద్‌ను నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను ప్రభుత్వం చక్రబంధంలో ఇరికించింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను రోజంతా నిర్బంధంలో ఉంచారు. జిల్లాల్లోనూ, పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలోపోలీసులను మోహరించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన ప్రధానమైన విద్యుత్ సమస్యపై ప్రభుత్వంలో కదలిక తెచ్చే లక్ష్యంతో క్రియాశీల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం.. ప్రజల కష్టనష్టాలను, ప్రజా ప్రయోజనాలను విస్మరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్ కనుక ఎవరూ సహకరించవద్దంటూ ప్రచారం చేసింది. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్‌పై కక్ష కడుతున్నట్లు ప్రవర్తిస్తున్న ఒక వర్గం మీడియా కూడా.. బంద్ పిలుపు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే బంద్ విఫలమైందంటూ ఆ వర్గం మీడియా ప్రత్యేక కథనాలు ప్రచారం చేయటం విస్తుగొలిపింది. అయితే.. ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష, ఎల్లో మీడియా ప్రయత్నాలను వమ్ము చేస్తూ.. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేసి బంద్ పాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. జేఎన్‌టీయూ, ద్రవిడ, ఆంధ్రా విశ్వ విద్యాలయాల్లో శుక్రవారం జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను పోలీసు బందోబస్తు మధ్య తెరచినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే వుంది. కొన్నిచోట్ల పోలీసులు ఉదయం నుంచి రోడ్లపైనే మకాం వేసి దుకాణాలను తెరిపించారు. గురువారం సాయంత్రం నుంచే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫోన్ చేసి బంద్ పాటించవద్దంటూ హెచ్చరించారు. పాఠశాలల వద్ద బందోబస్తు పెట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్‌లో పాల్గొనవద్దని ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హెచ్చరించారు. 

రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం... 

ప్రజా రవాణా వ్యవస్థపై కూడా బంద్ తీవ్రమైన ప్రభావం చూపింది. ఆర్‌టీసీ బస్సులను పోలీసులే బలవంతంగా డిపోల నుంచి బయటకు తీయించి ప్రయాణికులు లేక వెలవెల పోతున్నా నడిపించారు. ఉదయం వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా.. మధ్యాహ్నం తర్వాత చాలా సర్వీసులను పునరుద్ధరించారు. కర్నూలు, గుంటూరు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆర్‌టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. పలుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు డిపోల ముందు బైఠాయించటం.. రోడ్డెక్కిన బస్సులను అడ్డుకోవటంతో ఉదయం పూట సర్వీసులను ఆర్‌టీసీ రద్దు చేసింది. నేతలు, కార్యకర్తలను ఆర్‌టీసీ డిపోల వద్ద అరెస్టు చేసి అందరినీ తొలగించిన తరువాత పోలీసులు బస్సులను బయటకు వచ్చేలా చేశారు. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్టు చేయటంతో ఆగ్రహించిన కార్యకర్తలు 8 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పలు బస్సుల టైర్లలో గాలి తీసేశారు. బంద్ కారణంగా ఆర్‌టీసీకి శుక్రవారం రూ. 4 కోట్ల ఆదాయం నష్టపోయింది. 

అరెస్టుల పర్వం
తెలంగాణ ప్రాంతంలో... 

- వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 986 మంది పార్టీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని.. శుక్రవారం సాయంత్రం వదిలిపెట్టారు. డోర్నకల్‌లో మాత్రం ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. 

- నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. నిజామాబాద్‌లో బస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసిన కేంద్రపాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులను అరెస్టు చేశారు. 

- ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ బాణోత్ పద్మావతి తదితరులను అదుపులోకి తీసకున్నారు. 

- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ప్రశాంతంగా బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వేములవాడలో పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఆది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ పుట్ట మధు తదితరులతో సహా.. మొత్తం 418 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

- మెదక్ జిల్లాలో 170 మందిని అదుపులోకి తీసుకుని శుక్రవారం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మెదక్ పట్టణంలో బంద్ చేయాల్సింగా విజ్ఞప్తి చేస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బస్సు డిపో ఎదుట బైఠాయించిన యువజన విభాగం జిల్లా కన్వీనర్ గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

- నల్లగొండ జిల్లాలో సుమారు 900 మందికిపైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డిని సూర్యాపేటలో.. జిల్లా కేంద్రంలో బంద్‌లో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా పరిశీలకుడు గాదె నిరంజన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సూరేపల్లి సత్యకుమారి ఇతర నాయకులను ఆర్‌టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేసి రూరల్ స్టేషన్‌కు తరలించారు. 

- ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, జిల్లా నాయకుడు బి.అనిల్‌కుమార్‌లతో పాటు 50 మందిని తెల్లవారు జామున్నే అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాయలసీమలో జిల్లాల్లో... 

- అనంతపురం జిల్లాలో 2,500 మందికి పైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డితో పాటు 40 మంది కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఉంచారు. 

- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అంబేద్కర్ విగ్రహం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుండగా.. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికవుంత్రి చిదంబరం వాహనాన్ని వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

- కర్నూలు జిల్లాలో పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 250 మంది పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

- వైఎస్సార్ జిల్లా పులివెందులలో యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కడప నగరంలో తెల్లవారుజామునే పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ అంజాద్‌బాషలను అరెస్టు చేశారు. 

కోస్తాంధ్ర జిల్లాల్లో... 

- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 538 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 200 మందికి పైగా ముందస్తుగా అదుపులోకి తీసుకుని వదిలేశారు. 

- ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు, ఎస్‌ఎన్ పాడు, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల్లో 133 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

- కృష్ణా జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. సిటీ కన్వీనరు జలీల్‌ఖాన్, మహిళా విభాగ కన్వీనరు తాతినేని పద్మావతిలను హౌస్ అరెస్టు చేశారు. విజయవాడ నగరంలో 263 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 105 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 

- పశ్చిమగోదావరి జిల్లాలో 140 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. 

- తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 800 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులను అరెస్టు చేశారు. 

- విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో వేయి మందికిపైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పార్టీ విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, నేతలు డాక్టర్ జహీర్‌అహ్మద్, కొయ్య ప్రసాదరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, పసుపులేటి ఉషాకిరణ్, పిన్నింటి వరలక్ష్మి, జి.వి.రవిరాజ్ తదితరులు అరెస్టు అయ్యారు. 

- విజయనగరం జిల్లాలో పోలీసులు శుక్రవారం తెల్లారేసరికే మాజీ ఎమ్మెల్యేలు పెద్దింటి జగన్మోహనరావు, గద్దే బాబూరావు, పార్టీ నాయకులు తూముల రాంసుధీర్, గొర్లె వెంకటరమణతో సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. 
- శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 మందిని అరెస్ట్ చేశారు. 

మాచర్ల ఎమ్మెల్యేపై పోలీసుల దౌర్జన్యం
గుంటూరు జిల్లా మాచర్లలో శుక్రవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న ధర్నాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. సీఐ దురుసుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను నెట్టివేస్తూ.. ఒక చేత్తో తుపాకీ పట్టుకొని బెదిరించే ధోరణితో మాట్లాడటంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యేను సీఐ ధర్మేంద్రబాబు, డీఎస్పీ రావుల గిరిధర్‌లు బలవంతంగా పట్టుకొని నెట్టుకుంటూ తీసుకె ళ్లారు. అడ్డగించిన కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఎమ్మెల్యేను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోయింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఉదయం నుంచి సాయంత్రం వరకు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రూరల్ ఎస్‌పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వందలాది మంది కార్యకర్తలతో రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేయబోయారు. ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేశారు. నిరసనకారులు సాగర్ రింగ్‌రోడ్డు, రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్, కంభంపాడు ఆర్టీసీ బస్సులను నిలిపివేసి టైర్లుకు గాలితీశారు. సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యేను విడుదల చేశారు.
Share this article :

0 comments: