కోతలతో మూతే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోతలతో మూతే!

కోతలతో మూతే!

Written By news on Thursday, September 13, 2012 | 9/13/2012

 హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
- కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు
- గొంతు కలిపిన కార్మిక సంఘాలు
- ఆదుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు: జనక్ ప్రసాద్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అమలవుతున్న విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే పరిశ్రమలను మూసివేస్తామని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక సంఘాల(ఎంఎస్‌ఎంఈ) జేఏసీ ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎంఎస్‌ఎంఈ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు పారిశ్రామికవేత్తలు, కార్మికులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించి రిలే నిరాహారదీక్షలను చేపట్టారు. దీనికి కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి. కార్మిక సంఘాలూ గొంతు కలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తాలతో పాటు సీఐటీయూ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. 

విద్యుత్ కోతల సమస్య కేవలం పరిశ్రమల సమస్య కాదని, కార్మికుల సమస్య కూడా అని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. నెలకు కేవలం 12 రోజులు విద్యుత్ సరఫరా చేస్తుండటం వల్ల పరిశ్రమలు నడపడం తమ వల్ల కావడం లేదని జేఏసీ కన్వీనర్ ఎంఎం రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. పరిశ్రమ నడిస్తేనే కదా కార్మికులకు జీతాలు చెల్లించేదన్నారు. అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వం విద్యుత్‌ను కొనేలా చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరవధికంగా రిలే నిరాహారదీక్షలు చేపడతామని జేఏసీ ప్రకటించింది. గత ఏడాది 15వ తేదీన ప్రారంభమైన విద్యుత్ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయని జేఏసీ నేత దేవేంద్ర సురానా అన్నారు. ఈ నెల 15నాటికి సరిగ్గా ఏడాదవుతుందన్నారు. ఈ స్థాయిలో కోతలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ విధించలేదన్నారు.

చీమ కుట్టినట్టు కూడా లేదు: జనక్‌ప్రసాద్
తీవ్ర విద్యుత్ కోతలతో దిక్కుతోచని స్థితిలో పరిశ్రమలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జనక్ ప్రసాద్ మండిపడ్డారు. రోజుకు 12 గంటలపాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని, దీంతో లక్షలాది చిన్న, సన్నకారు పరిశ్రమలు మూతపడే దుర్భర పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. 

విద్యుత్ కోతల కారణంగా దాదాపు 35,000 పరిశ్రమలు మూతపడే గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయని, 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కటుంబాలు రోడ్డున పడే స్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు. సెంట్రల్ గ్రిడ్‌లో 15 శాతం అదనపు విద్యుత్‌ను రాష్ట్రానికి సాధించడంలో సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని, ఈశాన్య గ్రిడ్‌లో 300 యూనిట్‌ల అదనపు విద్యుత్‌ను కర్ణాటక, తమిళనాడు తరలించుకుపోతోంటే చోద్యం చూస్తోందని అన్నారు. చిన్న పరిశ్రమలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆదుకోకుంటే ప్రభుత్వం అడ్రస్ గల్లంతే: నాయిని
విద్యుత్ సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను ఆదుకోకుంటే ప్రభుత్వం అడ్రస్ గల్లంతవుతుందని టీఆర్‌ఎస్ నేత నాయిని నరహింహారెడ్డి హెచ్చరించారు. ఓ పక్క పరిశ్రమలు, రైతులు కరెంటు లేక అల్లాడుతుంటే సీఎం ఇందిరమ్మబాట అంటూ విహార యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేతకాకుంటే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. 

ఇంత చేతకాని సీఎంను చరిత్రలో చూడలేదు: బొజ్జల
రాష్ట్ర చరిత్రలో ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంతటి చేతకాని, పనికిమాలిన సీఎంను చూడలేదని టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం చిత్తూరు జిల్లావాడని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానన్నారు. 

చైనాతో ఒప్పందం ఉందా?: కిషన్ రెడ్డి
చైనాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ మూతేస్తాం.. మీ వస్తువులు అమ్ముకోండనే రీతిలో వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం కిరణ్‌కే ‘పవర్’ లేదని, ఇక మనకేం పవర్ ఇస్తారని ఎద్దేవా చేశారు. గ్యాసు లేదని, వర్షాలు రావడం లేదని సీఎం అంటున్నారు. దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లదీస్తున్నార’’ని మండిపడ్డారు.

బాబుతోనే సంక్షోభానికి పునాది: సీపీఐ చంద్రశేఖర్
‘‘బాబు హయాంలో విద్యుత్‌రంగాన్ని నాలుగు ముక్కలు చేసినప్పుడే విద్యుత్ రంగ సంక్షోభానికి పునాది పడింది’’ అని సీపీఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఉచిత విద్యుత్ హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు విద్యుత్‌నే సరఫరా చేయడం లేదని విమర్శించారు. 

దేశ చరిత్రలో పారిశ్రామికవేత్తలు, కార్మికులు కలిసి పోరాడిన చరిత్ర లేదని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ అన్నారు. బుధవారం రిలే నిరాహార దీక్షలో జేఏసీ కన్వీనర్ ఎంఎం రెడ్డి, ఫ్యాప్సియా అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, ఫిస్మి నుంచి సతీష్, ఫాస్మె- హన్మంతరావు, మూతపడనున్న చిన్నతరహా పరిశ్రమల సంఘం- ఎంకేడీ ప్రసాద్, అలిప్- రమాదేవి, ఫా్యిప్సీ నుంచి అనిల్‌రెడ్డిలు కూర్చున్నారు.
Share this article :

0 comments: