ఫీజుల పథకం ఎత్తేసేందుకే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజుల పథకం ఎత్తేసేందుకే!

ఫీజుల పథకం ఎత్తేసేందుకే!

Written By news on Saturday, September 8, 2012 | 9/08/2012

*ఫీజులు రూ.లక్ష పైగా నిర్ణయించి 35 వేలే కడతామంటే ఎలా?
*మిగతా సొమ్ము ఆ పేద పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు?
*వైఎస్ హయాంలో బడ్జెట్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చారు..
*ఇప్పుడు అడ్మిషన్లు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులకు టెన్షనే
*బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనారిటీలకు నష్టం జరుగుతోంది
*ఇంత జరుగుతున్నా ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించరెందుకు?
*పైగా, తానే ఈ పథకం పెట్టానని చెప్పుకుంటున్నారు..
*కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయి
*ప్రభుత్వం ఏ హామీనీ సరిగ్గా అమలు చేయడం లేదు

ప్రజలపై భారం పడకూడదని భావించిన వైఎస్... ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. కానీ ఈరోజు అన్ని పన్నులూ పెంచారు. రేట్లు పెరిగాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అలాంటపుడు ఫీజుల పథకం అందరికీ అమలు చేస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి? వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక గత మూడేళ్లుగా అడ్మిషన్లు వచ్చినపుడల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు టెన్షనే! అసలు ఈ పథకాన్ని ఒక భారంగా ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? ప్రజల కష్టాలను తీర్చే ఒక బాధ్యతగా ఎందుకు అనుకోవడం లేదు?
- వైఎస్ విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ప్రభుత్వం రూ.50 వేల నుంచి ఒక లక్షా ఐదు వేల వరకూ నిర్ణయించింది. ఇప్పుడేమో 35 వేల రూపాయలే కడతామంటోంది. రూ.35 వేలుపోను అంత పెద్ద మొత్తం ఆ పేద పిల్లలెక్కడి నుంచి తెస్తారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు కలగడం లేదు? ఆ తల్లిదండ్రులు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చికట్టాలి? ప్రభుత్వం ఈ పథకాన్ని ఏదో విధంగా తీసేయాలనే ఆలోచనతోనే ఈ ఆంక్షలన్నీ పెడుతోంది తప్ప మరొకటి కాదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అర్హులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్(ఇందిరాపార్కు) వద్ద గురువారం ఉదయం ప్రారంభించిన ‘ఫీజు దీక్ష’ను విజయమ్మ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విరమించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రియాంక, నవీన ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం విజయమ్మ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పెద్ద చదువులపై వైఎస్ భరోసా కల్పించారు

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు పిల్లల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువులంటే అవి మన పరిధిలో లేవనుకునేవారు. ఇంజనీరింగ్, మెడిసిన్ గురించి వారసలు ఆలోచించే వారే కాదు. అలాంటిది వైఎస్ సీఎం అయ్యాక.. ఇంజనీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులన్నిటినీ పేద పిల్లలూ చదువుకోవచ్చనే భరోసా కల్పించారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం అందుకే ప్రవేశ పెట్టారు. అయితే ఈ ప్రభుత్వం ఆయన మాదిరిగా ఆలోచించడం లేదు. ఈ పథకాన్ని ఎలా ఎత్తి వేయాలా అని చూస్తోంది. ఇంజనీరింగ్‌లాంటి చదువులు తమ వంశంలో లేనివని విద్యార్థులు ఆలోచించే పాత రోజులు వచ్చేస్తాయనిపిస్తోంది. వైఎస్ ఇపుడు ఉన్నా ఈ పథకాన్ని కొనసాగించలేకపోయేవారని మంత్రులు చెబుతున్నారు. ఆయన చేసి పోయిన అప్పులు ఇప్పుడు కడుతున్నాం అంటున్నారు. అది చాలా తప్పు. ఆయన ఉన్నపుడు ఈ పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంకన్నా ఎక్కువ డబ్బు విడుదల చేశారు. వైఎస్ పాలన నిజంగా సువర్ణయుగమే! ఉచిత విద్యుత్ ఇచ్చారు, కరెంటు బకాయిలు రద్దు చేశారు. 

గామీణ రైతులకు ఎంతో మేలు చేశారు. మరి ఈరోజు, విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన చోట కూడా క్రాప్‌హాలిడే ప్రకటించే పరిస్థితి. ఎరువుల ధరలు వందల రెట్లు పెరిగాయి. రైతు కూలీలకు వంద రోజుల ఉపాధిని 200 చేస్తామన్నారు. అది జరగలేదు. రూ.6.5 లక్షల కోట్లతో పరిశ్రమలు వస్తాయన్నారు. ఏటా 15 లక్షల ఉద్యోగాలన్నారు. ఎక్కడ ఇచ్చారు? కరెంటు లేక 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి. లక్షా 85 వేల మంది వికలాంగులకు పెన్షన్లు రద్దు చేశారు. వయసు తక్కువ అనే సాకుతో వృద్ధుల పెన్షన్లు కూడా రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారి పోయింది. చాలా వ్యాధులను ప్రభుత్వాసుపత్రులకు మార్చేశారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు.

చంద్రబాబు ప్రశ్నించరేం?

వైఎస్ ఉన్నపుడు ఫీజు పథకం కింద 28 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల కొన్ని వందల మందికి మాత్రమే ఈ పథకం వర్తించేలా ఉంది. ఇలా జరుగుతూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా.. అంటే ఆయన ప్రశ్నించరు. ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోతోంది. ప్రతిపక్షం కూడా ఆ బాధ్యతను గుర్తు చేయదు. చంద్రబాబు తానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెట్టానంటున్నారు. ఈ పథకం ఆయనదేనని ఏ ఒక్క విద్యార్థి చెప్పగానేను వినలేదు. ఏనాడూ కళాశాలలకు వెళ్లి ఫీజులు ఎలా కడుతున్నారని అడగని బాబు ఇపుడిలా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తీరు వల్ల బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనారిటీ విద్యార్థులకు నష్టం జరుగుతున్నా ఆయన అసలు పట్టించుకోవడం లేదు.

కుమ్మక్కు రాజకీయాలు

ప్రజల పరిస్థితి ఇలా ఉంటే ఈ మూడేళ్లలో టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసిపోయి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి పోయి జగన్ ఒక్కడిని టార్గెట్ చేశాయి. శంకర్రావు, ఎర్రన్నాయుడు కుమ్మక్కయి కోర్టుకు వెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం, సమాచార కమిషనర్ల నియామకం, అమీర్‌పేట భూములు.. అన్నింటా రెండు పార్టీల కుమ్మక్కు బయటపడింది. ఎంతసేపూ ఈ రెండు పార్టీల నాయకులకూ వైఎస్‌పైనా, జగన్‌బాబుపైనా నిందలేయడమే కార్యక్రమంగా మారింది. సీబీఐ పరిస్థితీ అంతే! 26 జీవోల జారీపై ప్రభుత్వాన్ని విచారించాలని కోర్టు ఆదేశిస్తే సీబీఐ మాత్రం ప్రభుత్వం అనే పదాన్ని తీసేసి ఆ స్థానంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఫిర్యాదులో 52వ ముద్దాయిగా ఉన్న జగన్‌బాబును ఒకటో నిందితుడిగా చేర్చింది. (సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా దీక్షా స్థలిలో నినాదాలు మారుమోగాయి).

జగన్ తప్పు చేశాడని తేల్చారా?

జగన్‌ను జైలులో పెట్టి వంద రోజులైంది. ఇన్ని రోజుల నుంచి ఆయన ఒక్క తప్పైనా చేసినట్లు సీబీఐ వారు తేల్చారా? చివరకు ఆయనను కోర్టుకు ఒక క్రిమినల్‌లా సాధారణ వాహనంలో తెచ్చారు. ఎన్నో కష్టాలు పెడుతున్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ధర్మం, న్యాయం మన పక్షాన ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాపక్షంగా ఉంటుంది. ప్రజలంటే వైఎస్సార్‌కు ప్రాణం. చివరి వరకూ వారి కోసమే తపించారు. అలాగే జగన్ కూడా.. జగన్‌బాబు ప్రజల్లో తిరుగుతూ ఉంటే తొలుత బాధ అనిపించేది. కానీ మిమ్మల్నందరినీ చూశాక మంచి నిర్ణయమే తీసున్నాడనిపించింది(ప్రజల హర్షధ్వానాలు). మిమ్మల్నందరినీ చూస్తూ ఉంటే వైఎస్‌లాంటి నాయకుడు కావాలని అనుకుంటున్నట్లుగా ఉంది. తప్పకుండా వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. త్వరలోనే జగన్‌బాబు బయటకు వచ్చి ఈ పథకాలన్నీ అమలు చేస్తాడు.

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షలు ఎందుకు చేస్తోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు కనుకనే నేను ఈ రోజు ఇక్కడ దీక్షకు కూర్చోవాల్సి వచ్చింది. మన దీక్షలకు ప్రభుత్వం ఎంత దిగి వస్తుందో తెలియదు. నిద్రపోయే వాళ్లనైతే లేపి చెప్పవచ్చు కానీ.. నిద్రపోతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వాన్ని మాత్రం మనం లేపలేం..’’
- వైఎస్ విజయమ్మ

‘‘అమ్మా.. ఈ రోజు నేను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డిగారు పెట్టిన ఫీజు పథకం వల్లనే. వైఎస్ జీవించి ఉన్నంతకాలం ఆయనలాగే అందరం చిరునవ్వు నవ్వుతూ ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న జైల్లో ఉన్నాడని ఎవ్వరూ అధైర్యపడొద్దు. జగనన్న తప్పకుండా జైలు నుంచి బయటకొస్తాడు. ఎన్నికల్లో గెలుస్తాడు. అమ్మా మీరు బాధపడొద్దు.. మేమంతా మీ వెంటే ఉన్నాం.’’
- విజయమ్మతో ఫీజు దీక్ష విరమింపజేయడానికి ముందు విద్యార్థిని ప్రియాంక అన్న మాటలు
Share this article :

0 comments: