విలీనం ప్రసక్తేలేదు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విలీనం ప్రసక్తేలేదు: విజయమ్మ

విలీనం ప్రసక్తేలేదు: విజయమ్మ

Written By news on Sunday, September 16, 2012 | 9/16/2012

 వైఎస్ఆర్ సిపి ఏ పార్టీలో విలీనం కాదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేశారు. శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశం ముగిసిన తరువాత ఆమె విలేకరులతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తమ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాదన్నారు. అలాంటి అవసరం తమకు లేదని చెప్పారు. తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కావలసిన అవసరంలేదని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించారని, అటువంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. విలీన దుష్ర్పచారాన్ని ఆమె ఖండించారు. 

జగన్మోహన రెడ్డికి బెయిల్ కోసం కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవలసిన అవసరంలేదన్నారు. 90 రోజులు అయితే బెయిల్ ఇవ్వాలని, బెయిల్ వస్తుందని ఆమె చెప్పారు. 111 రోజుల నుంచి జగన్ ను జైలులో పెట్టారు. ఏ ఒక్క అంశంలోనైనా జగన్ అవినీతికి పాల్పడినట్లు రుజువు చేయగలిగారా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ బయట ఉన్న 10నెలల్లో సీబీఐ ఏం చెప్పగలిగిందని అడిగారు. 

పరిశ్రమలన్నీ మూతబడ్డాయి, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం జరుగుతుందంటే ఏ పార్టీతోనైనా కలిసి పోరాడుతామని చెప్పారు. తమ పార్టీ ప్రజా పక్షంగా ఉంటుందని చెప్పారు. శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చించాలని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ఆమె అన్నారు. శాసనసభ ద్వారా ప్రజల సమస్యలు తీరుతాయన్న నమ్మకం కలిగించాలన్నారు. కనీసం 15 రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలు కూడా చర్చించాలన్నారు. గతంలో గ్యాస్ ధర పెంచినప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెంచిన ధరని ప్రభుత్వమే భరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యుత్, కరువు, వ్యవసాయం, తాగునీరు తదితర సమస్యలపై చర్చ జరగాలని కోరినట్లు తెలిపారు. జలయజ్ఞానికి కాలవ్యవధి విధిస్తే మంచిదని సూచించినట్లు చెప్పారు. శాసనసభ సమావేశాలు జరపాలన్న ఆలోచన ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు రాలేదని తెలిపారు. వారు ఇద్దరూ వచ్చి ఉంటే బాగుండేదన్నారు.
Share this article :

0 comments: