మ్యాచ్ ఫిక్సింగ్ అను ఉమ్మడి కుమ్మక్కు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మ్యాచ్ ఫిక్సింగ్ అను ఉమ్మడి కుమ్మక్కు

మ్యాచ్ ఫిక్సింగ్ అను ఉమ్మడి కుమ్మక్కు

Written By news on Monday, September 17, 2012 | 9/17/2012

దాదాపు మూడేళ్లుగా మన రాష్ట్రంలో ఒక మహోజ్వల రాజకీయ దైనందిన ధారావాహిక నిర్విఘ్నంగా సాగిపోతోంది. ‘మ్యాచ్ ఫిక్సింగ్ అను ఉమ్మడి కుమ్మక్కు’ ఈ ధారావాహిక టైటిల్. నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడిగా ఈ ధారావాహికకు స్క్రిప్ట్ రాస్తున్నారు. అధిష్టానమ్మ ఈ ధారావాహికకు నిర్దేశకత్వం సమకూరుస్తున్నారు. రేవంత్ రెడ్డి, వై.బీ.రాజేంద్రప్రసాద్ తదితర నక్కలూ, తోడేళ్లూ ఈ ధారావాహికకు నేపథ్య సంగీతం అందిస్తున్నారు. 

రాష్ట్ర రాజకీయ రంగస్థలం మీద వీరంగమాడిన మహామహులెందరో ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెయ్యి రోజులు దాటిపోయినా, ఈ ధారావాహిక ప్రదర్శన నానాటికీ ఊహాతీతమయిన మలుపులు తిరుగుతూ పోతూనే ఉంది. సోమవారంనాడు -సెప్టెంబర్ 17న- ఈ ఉమ్మడి కుమ్మక్కు ధారావాహికలో ప్రవేశపెట్టిన ‘అసెంబ్లీ సమావేశ ఘట్టం’ అలాంటి మలుపుల్లో ఒకటి.

ఆదివారం నాడు జరిగిన అసెంబ్లీ సభా వ్యవహారాల కమిటీ సమావేశానికి కూడబలుక్కుని ఎగ్గొట్టిన బాబు, కిరణ్ ఈ తాజాఘట్టానికి తెరతీశారు. బావమరిది మరియు వియ్యంకుడు కూడా అయిన బాలకృష్ణ ఇంట్లో విందు సాకుగా చూపించి ప్రధాన ప్రతిపక్ష నేత ఈ సమావేశానికి ఎగనామం పెట్టగా, ముఖ్యమంతి కిరణ్ అలాంటి సాకులుగానీ, నెపాలు గానీ చూపించకుండానే అదే పని చేయడం విశేషం.

దశాబ్ద కాలంలో ఇలా ఎన్నడూ జరగకపోవడం గమనార్హం. కాగా, రెండు రోజుల కిందట, మహబూబ్ నగర్‌లో జరిగిన ‘ఇందిరమ్మ బాట’ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకూ, టీడీపీకీ మధ్య కుదిరిన ఒప్పందం గురించి సూచనప్రాయంగా వెల్లడించడం అసలయిన విశేషం. 

‘పాలక, ప్రతిపక్షాల ఉద్దేశం ఒకటే కావడం వల్ల కలిసి ముందుకు సాగుతున్నా’మని ముఖ్యమంత్రి అంతటివాడే ప్రకటించడం అక్షరాలా అపూర్వం! అయితే, ఆ ఉద్దేశమేమిటన్నదానిపై ఆయన వివరంగా చెప్పలేదు. చెప్పినదాన్లో నిజమూ లేదు! ప్రజా సమస్యల పరిష్కారానికి విధాన సభ సమావేశాలే అత్యున్నతమయిన వేదికగా ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నవారందరూ భావిస్తారు. అలాంటిది, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అయిదే రోజులకు పరిమితం చెయ్యడంతోనే బాబు, కిరణ్‌లు ఈ సమావేశాలపట్ల ఎంతటి శ్రద్ధాసక్తులు ప్రదర్శించారో అర్థంచేసుకోవచ్చు.

దానికితోడు, ఆదివారం నాడే -అంటే, సభావ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించిన రోజే- చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశం కూడా ఏర్పాటుచేస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ, అకస్మాత్తుగా ఆ సమావేశాన్ని రద్దు చేసేశారు. సమావేశ ప్రకటనకూ, రద్దుకూ మధ్య ఏంజరిగిందో ఏమో ఎవరికీ అంతుబట్టకుండాపోయింది. స్పీకర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన టీడీపీ నేతలు కూడా -ఎజెండా ఖరారు చెయ్యడానికి సంబంధించిన చర్చ ఒక కొలిక్కి రాకముందే- వాకౌట్ చేసి వెళ్లిపోవడం విశేషమే. బాబు ఆదేశాల ప్రకారమే వాళ్లలా చేసివుంటారనడంలో సందేహం అనవసరం!

పోనీ, మన రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలేవీ లేదనుకోడానికీ వీల్లేకుండా ఉంది! కరెంటు కోతలతో రాష్ట్రంలోని పరిశ్రమలు పరాయి పంచలకు తరలిపోవాలని తలపెడుతున్నాయి. ఇక, గంటల తరబడి కరెంటుకోతల కారణంగా రాష్ట్ర ప్రజానీకం నిద్రాహారాలకు దూరమయి బతుకీడుస్తున్నారు. ఇదిలావుండగా, రెట్లకు రెట్లు ధరలు పెంచేసి పాలకులు ప్రజా జీవితాన్ని దుర్భరం చేసిపారేస్తున్నారు.

ముఖ్యంగా, తాజాగా పెరిగిన డీజిల్ ధరలూ, వంటగాస్ ధరలూ సామాన్య ప్రజల జీవితాలపై దారుణమయిన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక, పేదింటి దీపంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు వాపసు పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నీరుగార్చేసింది. ఫీజువాపసు పథకం కొనసాగించాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు సార్లు దీక్ష చేసినప్పటికీ సర్కారు బండగుండె కరగలేదు.

తాగునీరు సరఫరా, గ్రామీణ ప్రాంతాలను పట్టి పీడిస్తున్న విషజ్వరాలు, అతివృష్టి-అనావృష్టి విషవలయంలో పడి విలవిల్లాడుతున్న రైతాంగం దీనపరిస్థితి, పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కూడా కరువవడం, పండించాల్సిన పంటలకు ఎరువులు దొరకని దుస్థితి, తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం, వివిధ ఆస్పత్రులలో కొనసాగుతూనే ఉన్న శిశుమరణాలూ, జూనియర్ల డాక్టర్ల డిమాండ్ల పరిష్కారంలో వైఫల్యం పర్యవసానంగా పదేపదే జరుగుతున్న జూడాల సమ్మెలూ - ఇన్ని సమస్యలుండగా ప్రధాన ప్రతిపక్షనేతకు బావమరిది ఇంట్లో విందులు కుడవడం ఎక్కువ ముఖ్యమయిందా? ఇక ముఖ్యమంత్రిగారు ఏ రాచకార్యంలో ములిగితేలుతూ సభా వ్యవహారాల కమిటీ సమావేశం ఎగ్గొట్టారో వారికే తెలియాలి!

అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం నిర్లజ్జగా కావిలించుకు తిరగడమే దారునమనుకుంటే, ఇలా కూడబలుక్కుని కీలకమయిన సమావేశాలను తప్పించుకు తిరగడం కూడా మొదలు పెట్టారన్నమాట. ఇది చాలదన్నట్లుగా, 2014 వరకూ తానే ముఖ్యమంత్రినని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల గుండెల్లో దురంతో ఎక్స్‌ప్రెస్‌లను పరిగెట్టిస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అను ఉమ్మడి కుమ్మక్కు కొనసాగినంత కాలం పరిస్థితులు మరోలా ఉంటాయని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది!
Share this article :

0 comments: