21.5 కోట్ల లబ్ధికు బదులుగా 29.5 కోట్ల పెట్టుబడులు ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21.5 కోట్ల లబ్ధికు బదులుగా 29.5 కోట్ల పెట్టుబడులు ?

21.5 కోట్ల లబ్ధికు బదులుగా 29.5 కోట్ల పెట్టుబడులు ?

Written By news on Friday, October 5, 2012 | 10/05/2012

బెయిల్ పిటిషన్‌పై విచారణకు ఒక రోజు ముందు నోట్ విడుదల
13 ఎకరాల పైచిలుకు జననీ ఇన్‌ఫ్రా భూమి, రూ. 14.5 కోట్ల జగతి ఫిక్స్‌డ్ డిపాజిట్లు అటాచ్
హెటెరోకు చెందిన 35 ఎకరాలు, రూ. 3 కోట్లు; రూ. 3 కోట్ల అరబిందో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా
రూ. 21.5 కోట్ల అనుచిత లబ్ధికి బదులుగా జగన్ కంపెనీల్లో అవి రూ. 29.5 కోట్లు పెట్టాయట!

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంలో రూ.51 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 5(1) కింద ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు, జప్తు చర్యలకు సంబంధించి గురువారం ఢిల్లీలో మీడియాకు ఈడీ ఒక నోట్ విడుదల చేసింది. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు రానుండగా, దానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈడీ ఇలా అటాచ్‌మెంట్ వివరాలను వెల్లడించడం గమనార్హం.

‘‘హెటెరో డ్రగ్స్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు 35 ఎకరాలు, రూ.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్; ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇది అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు నూరు శాతం అనుబంధ సంస్థ)కు చెందిన 96 ఎకరాల భూమి; అరబిందో ఫార్మా లిమిటెడ్ పేరిట ఉన్న రూ.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్; జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాలకు పైబడిన భూమి; రూ.14.5 కోట్ల మొత్తానికి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్’’లను అటాచ్ చేసినట్టు నోట్‌లో ఈడీ వివరించింది. ‘మనీ లాండరింగ్‌కు సంబంధించి జగన్, ఇతరులపై పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు నిర్వహిస్తున్నాం. జగన్‌తో పాటు గుర్తు తెలియని సంస్థలు, వ్యక్తులతో సహా మరో 73 మంది ఇతర నిందితులపై హైదరాబాద్‌లోని సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తు నడుస్తోంది’ అని అందులో ఈడీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల ద్వారా హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా అక్రమంగా లబ్ధి పొందినట్టు వెల్లడైందని చెప్పింది. ‘‘హెటెరో, అరబిందోలకు రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. 

ఈ కేటాయింపుల్లో ఒక్కో సంస్థకు రూ.8.6 కోట్ల చొప్పున అక్రమంగా లబ్ధి చేకూర్చింది. ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ లిమిటెడ్‌కు 30.33 ఎకరాల భూమి కేటాయింపులో రూ.4.3 కోట్ల అక్రమ లబ్ధి చేకూర్చారు’’ అని తెలిపింది. ధరల నిర్ణాయక కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఈ భూముల కేటాయింపులను జరిపిందని చెప్పింది. ఇలా మూడు సంస్థలకు కలిపి రూ.21.5 కోట్ల లబ్ధి చేకూరిందన్న ఈడీ.. అందుకు బదులుగా జగన్‌కు చెందిన సంస్థల్లో అవి ఏకంగా రూ.29.5 కోట్ల పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది! ‘‘జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్‌కు రూ.14.5 కోట్లు, జననీ ఇన్‌ఫ్రాకు రూ.15 కోట్లను ఈక్విటీ రూపంలో సదరు సంస్థలు చెల్లించాయి. నిజానికి ఈ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం వాటికి చేకూర్చిన ప్రయోజనాలకు ఇచ్చిన ముడుపులు. రూ.51 కోట్ల మేరకు నేర లావాదేవీలు సాగాయని ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తులో వెల్లడైంది’’ అని ఈడీ చెప్పుకొచ్చింది. పీఎంఎల్‌ఏ కింద ఈ కేసులో తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు పేర్కొంది.
Share this article :

0 comments: