పైసా లేకుండా రూ.300 కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పైసా లేకుండా రూ.300 కోట్లు

పైసా లేకుండా రూ.300 కోట్లు

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు 
సోనియాగాంధీ అల్లుడికి రియల్ దిగ్గజం 
డీఎల్‌ఎఫ్ నుంచి భారీగా ముడుపులు
కారుచౌకగా ఆస్తులిచ్చి, వాటిని కొనటానికీ రుణం 
ఎలాంటి పూచీకత్తు,వడ్డీ లేకుండా వాద్రాకు రూ. 65 కోట్ల 
డీఎల్‌ఎఫ్ రుణం వాద్రా సంస్థలకు రూ. 300 కోట్ల ఆస్తుల సంతర్పణ 
రూ. 35 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు వాద్రాకు రూ. 5 కోట్లకే విక్రయం 
రూ. 25 కోట్ల విలువ చేసే పెంట్‌హౌస్ రూ. 89 లక్షలకే.. 
డీఎల్‌ఎఫ్ హిల్టన్ గార్డెన్ ఇన్‌లో 50 శాతం వాటా, 
విలువ రూ. 150 కోట్లకు పైనే..నాలుగేళ్లలో రూ. 50 లక్షల నుంచి రూ. 300 కోట్లకు 
పెరిగిన రాబర్ట్ వాద్రా ఆస్తులు 
ప్రతిఫలంగా డీఎల్‌ఎఫ్‌కు ఢిల్లీ, హర్యానాల్లో వందల ఎకరాల భూకేటాయింపులు
అక్రమ లావాదేవీలపై స్వతంత్రంగా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కేజ్రీవాల్ డిమాండ్

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని, పైసా పెట్టుబడి లేకుండా వందల కోట్ల రూపాయాల విలువైన ఆస్తులు సమకూర్చుకున్నారని.. అవినీతి వ్యతిరేక ఉద్యమ (ఐఏసీ) కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నుంచి వాద్రా ముడుపులు అందుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. డీఎల్‌ఎఫ్ ఎంతో విలువైన ఆస్తులను వాద్రాకు కారుచౌకగా నామ మాత్రపు ధరలకే విక్రయించిందని, అంతేకాకుండా వాటిని కొనుగోలు చేయటానికి వాద్రాకు వడ్డీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోట్ల రూపాయల రుణం కూడా ఇచ్చిందని వెల్లడించారు. 

భూ కేటాయింపుల కారణంగా వాద్రా ఆస్తులు రూ. 50 లక్షల నుంచి ఏకంగా రూ. 300 కోట్లకు పెరిగాయని తెలిపారు. కేజ్రీవాల్ తన సహచరుడు ప్రశాంత్‌భూషణ్, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్‌లతో కలిసి శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాబర్ట్‌వాద్రా గ్రూపు సంస్థలకు చెందిన ఆస్తుల వివరాలు కొన్నింటిని బహిర్గతం చేశారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా కొన్ని అధికారిక పత్రాల నకళ్లను మీడియాకు అందజేశారు. 

రూ. 50 లక్షలతో 300 కోట్ల ఆస్తులు! 

‘‘రాబార్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌వాద్రాలు కలిసి 2007 నవంబర్ 1, ఆ తర్వాత ఐదు కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల ఆడిట్ నివేదిక ఆధారంగా వీరి భాగస్వామ్య పెట్టుబడి రూ. 50 లక్షలు మాత్రమే. ఈ కంపెనీలకు డీఎల్‌ఎఫ్ నుంచి అందిన వడ్డీలేని రుణంపై లభించే వడ్డీ తప్పితే.. ఇతరత్రా ఎలాంటి వ్యాపార లావాదేవీలు కానీ, ఆదాయాలు కానీ లేవు. అయినప్పటికీ రాబర్ట్‌వాద్రా గత నాలుగేళ్లలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. 2007 - 2010 మధ్య కాలంలో ఈ ఐదు కంపెనీల పేరుతో ఢిల్లీలోనూ పరిసర ప్రాంతాల్లోనూ 31 ఆస్తులు కొన్నారు. వాటిని కొనుగోలు చేసే సమయంలోనే వాటి మార్కెట్ విలువ రూ. 300 కోట్లుగా ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ రూ. 500 కోట్లు ఉంటుంది’’ అని కేజ్రీవాల్ వివరించారు. అయితే.. వాద్రా సంస్థల బ్యాలన్స్ షీట్లలో వీటి విలువను రూ. 69.64 కోట్లుగా చూపినట్లు చెప్పారు. అదేవిధంగా సాకేత్‌లోని డీఎల్‌ఎఫ్ హిల్టన్ గార్డెన్ ఇన్‌లో 50 శాతం షేర్ కింద రూ. 32 కోట్లు చూపించారని, అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 150 కోట్లు పైనే ఉంటుందని చెప్పారు. 

వడ్డీ లేని రుణం.. కారుచౌకగా ఫ్లాట్లు

ఈ ఆస్తులను కొనటానికి కూడా రాబర్ట్ వాద్రాకు డీఎల్‌ఎఫ్ ఐదేళ్ల కిందట రూ. 65 కోట్లకు పైగా రుణాన్ని వడ్డీ, సెక్యూరిటీ లేకుండా ఇచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. తమ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లను రాబర్ట్ వాద్రాకు నామ మాత్రపు ధరకే విక్రయించిందని వివరించారు. ఉదాహరణకు.. ఢిల్లీ సమీపంలోని గుర్గాంలో డీఎల్‌ఎఫ్‌కు చెందిన మైగ్రోలియా అనే హౌసింగ్ ప్రాజెక్టులో 7 అపార్ట్‌మెంట్లను కారుచౌక ధరలకే వాద్రా కొనుగోలు చేశారని చెప్పారు. ‘‘ఈ 7 ఫ్లాట్లను కేవలం రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసినట్టు వాద్రా కంపెనీలు లెక్కలు చూపాయి. 

కొనుగోలు చేసిన సమయంలో ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 5 కోట్లుగా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో ప్లాట్ విలువ రూ. 10 నుంచి రూ. 15 కోట్ల వరకు ఉంది’’ అని తెలిపారు. ‘‘రూ. 35 కోట్ల విలువ చేసే ఫ్లాట్లను రూ. 5 కోట్లకే ఇచ్చారంటే.. అందులో తప్పకుండా ఏదో మతలబు ఉందనే అనుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గుర్గాంలోని ఒక డీఎల్‌ఎఫ్ భవనంలో నాలుగు పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. వీటిని వాద్రా ఐదు సంస్థలతో కొనుగోలు చేశారు. పది వేల చదరపు గజాల పెంట్‌హౌస్‌ను 2009లో రూ. 89 లక్షలకు విక్రయించారు. అప్పుడు దాని మార్కెట్ విలువ రూ. 25 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత విలువ రూ. 40 కోట్లు’’ అని ప్రశాంత్‌భూషణ్ పేర్కొన్నారు. ‘‘ఇంత సొమ్మును డీఎల్‌ఎఫ్ ఎలాంటి ప్రయోజనం లేకుండా వాద్రాకు ఎందుకిచ్చింది?’’ అని ప్రశ్నించారు. 

క్విడ్ ప్రో కోలో భాగమేనా..? 

‘‘వందల కోట్ల రూపాయలైన ఈ భారీ ఆస్తుల కొనుగోలుకు వాద్రాకు సొమ్మును డీఎల్‌ఎఫ్ ఇవ్వటం క్విడ్ ప్రో కోలో భాగమేనా?’’ అని అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్ చేకూర్చిన మేళ్లకు ప్రతిగా.. తాను అధికారంలో ఉన్న హర్యానా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములను, అందునా ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుల కోసం కేటాయించిన భూములను ధారాదత్తం చేసిందని వారు ఆరోపించారు. మైగ్రోలియా హౌసింగ్ ప్రాజెక్టులో రాబర్ట్‌వాద్రాకు 7 ఫ్లాట్లను కారుచౌకగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు 350 ఎకరాల భూమిని అప్పగించిందని వారు పేర్కొన్నారు. డీఎల్‌ఎఫ్ సంస్థకు ఢిల్లీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వాల ద్వారా వాద్రా లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. 

ఆ లావాదేవీలన్నీ ముడుపుల వ్యవహారమే 

‘‘వాద్రాకు డీఎల్‌ఎఫ్ రూ. 65 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా ఎందుకు ఇచ్చింది? డీఎల్‌ఎఫ్ ఆస్తులను వాద్రాకు కారుచౌకగా ఎందుకు అమ్మింది? వాద్రా రూ. 65 కోట్ల ఆస్తులను రూ. 5 కోట్లకే కొన్నారు. ... డీఎల్‌ఎఫ్‌కు ఎలా లాభం వచ్చింది? డీఎల్‌ఎఫ్‌కు కాంగ్రెస్ చేకూర్చిన ప్రయోజనమేమిటి?’’ అని ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎల్‌ఎఫ్ నుంచి ఆస్తులు కొనుగోలు చేయటానికి వాద్రా ఆ సంస్థ నుంచే అప్పు ఎలా తీసుకుంటారన్నారు. ‘‘రాబర్ట్‌వాద్రా వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసుకోవటానికి డీఎల్‌ఎఫ్ డబ్బును సమకూర్చి కాంగ్రెస్ ప్రభుత్వ రుణం తీర్చుకుందా..?’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘డీఎల్‌ఎఫ్ ప్రాజెక్ట్‌లో వాద్రా ఏడు ఫ్లాట్లు పొందారు. ... వాద్రాకు రూ. 300 కోట్లు ఇవ్వటం కోసమే ఈ లావాదేవీలన్నీ జరిగాయి’’ అని ఆరోపించారు. ‘‘గత ఐదేళ్లలో రిజిస్టర్ చేసిన 12 సంస్థల వివరాలు మా దగ్గర ఉన్నాయి. వీటిలో ఆరు సంస్థలను ఒక్క 2012లోనే రిజిస్టర్ చేశారు. ఈ సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని ప్రశాంత్ ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ అక్రమ నిధులను ఈ ఆస్తుల కొనుగోళ్ల కోసం బదలాయిస్తున్నారా?’’ అని వ్యాఖ్యానించారు. ఆరు సంస్థల్లోనూ ఏళ్ల తరబడి ఎలాంటి కార్యకలాపాలు సాగటం లేదని కేజ్రీవాల్ చెప్పారు. డీఎల్‌ఎఫ్ ఆస్తులను దక్కించుకోవటానికి రాబర్ట్‌వాద్రా వినియోగించిన నల్లధనంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. 

ప్రశ్నించే ధైర్యం ఏ సంస్థకూ లేదు

ఈ విషయాలు ఇప్పటికే ఆదాయపన్నుశాఖకు తెలిసి ఉండాల్సిందని, అది దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతూ ఉండాల్సిందని ప్రశాంత్‌భూషణ్ పేర్కొన్నారు. దేశం ఏ విధంగా పనిచేస్తోందో చూస్తే ఇలాంటి శక్తిమంతమైన వ్యక్తి నిజాయతీని ప్రశ్నించే ధైర్యం ఏ సంస్థకూ ఉండదన్న విషయం స్పష్టమేనన్నారు. వాద్రాపై అవినీతి వ్యతిరేక చట్టం, ఆదాయ పన్ను చట్టం నిబంధనల అతిక్రమణ కింద కేసు నమోదు చేసి, త్వరగా దర్యాప్తు చేయాలన్నారు. ‘‘మా సమాచారం మొత్తాన్నీ మేం ఆర్‌ఓసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) ద్వారా పొందాం. ఇంకా చాలా ఆస్తులపై దర్యాప్తు చేయాల్సి ఉంచి’’ అని చెప్పారు. ‘‘వాద్రా వద్ద లెక్క తేలని అనేక ఆస్తులు ఉన్నాయి. వాటి రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వాటిపై విచారణ జరగదు. దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ప్రజలు గళం విప్పాలి’’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదు 

ఈ ఆస్తుల అవినీతి లావాదేవీల్లో వాద్రాకు కలిగిన ప్రయోజనాలపై అవినీతి నిరోధక చట్టం కింద స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్‌లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా హోదాను బట్టి ఆయనపై నిష్పాక్షికమైన దర్యాప్తు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరగదని తమకు ముందే తెలుసన్నారు. శాంతిభూషణ్ మాట్లాడుతూ ‘‘దేశంలో 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల స్కాం, కోల్‌గేట్ స్కాంలు జరిగాయి. ఇప్పుడు దీనికి రాబర్ట్‌వాద్రా స్కాంగా పెరుపెట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమేమో కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ప్రయత్నిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. సోనియా అల్లుడైనంత మాత్రాన ఏదైనా చేస్తారా అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

10న మరో నాయకుడి గుట్టు రట్టు

ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్.. శక్తిమంతమైన ఇద్దరు రాజకీయ నేతల అవినీతిని శనివారం బట్టబయలు చేస్తామని ఈ నెల 2నే ప్రకటించారు. అయితే.. తమ ప్రణాళికను మార్చుకున్న ఆయన శుక్రవారమే విలేకరుల సమావేశం నిర్వహించి వాద్రాపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ముంబైకి చెందిన మరో రాజకీయ ప్రముఖుడికి సంబంధించి ఈ నెల 10న కేజ్రీవాల్ బృందం అవినీతి ఆరోపణలు చేస్తుందని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్‌లు ఇటీవల ప్రధాని సహా 15 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ పలు పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. 

నోట్: పై ఆస్తులన్నీ స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రయివేట్ లిమిటెడ్, స్కై లైట్ రియాలిటీ ప్రయివేట్ లిమిటెడ్, రియల్ ఎర్త్ ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్, నార్త్ ఇండియా ఐటీ పార్క్స్ ప్రయివేట్ లిమిటెడ్, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల పేర్ల మీద ఉన్నాయి.
Share this article :

0 comments: