తప్పు చేయాలని వైఎస్ ఏనాడు చెప్పలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పు చేయాలని వైఎస్ ఏనాడు చెప్పలేదు

తప్పు చేయాలని వైఎస్ ఏనాడు చెప్పలేదు

Written By news on Tuesday, October 16, 2012 | 10/16/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తప్పు పని చేయమని ఎప్పుడూ చెప్పలేదని, తప్పు చేయమని తాను సైతం ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార భాను స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన భాను నుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణలో పలువురు ఐఏఎస్‌లు వాంగ్మూలమిచ్చినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఖండిస్తూ ఆయన సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి దేవానంద్ సీబీఐ ముందు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కొన్ని పత్రికల్లో రాసిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. దేవానంద్ ఇచ్చిన వాంగ్మూలం అధికారికంగా లభించినందున, ఇంకా కేసు విచారణలో న్యాయస్థానం పరిధి ఉన్నందున దానిపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.

అయితే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పరువు నష్టం జరిగేలా ఉన్నాయన్నారు. తన వృత్తి జీవితంలో గానీ, ఐఏఎస్‌లో చేరినప్పటి నుంచి ఎప్పుడూ ఏ అధికారికీ తప్పుడు పనిచేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఒకవేళ దేవానంద్ చెప్పినట్లు తాను ఒత్తిడి చేస్తే అప్పుడే పై అధికారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి భయపడి ఫిర్యాదు చేయలేదనుకున్నా... వైఎస్ మరణం తరువాత, తాను ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లిన తరువాతనైనా ఫిర్యాదు చేయవచ్చు కదా అని నిలదీశారు. దేవానంద్ చేసినట్లు రాసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సాక్ష్యాలు లేకుండా అబద్ధాలు చెబితే న్యాయస్థానాలు తగు సమయంలో వారిపై చట్టపరమైన చర్యలు చేపడతాయని తెలిపారు.
Share this article :

0 comments: