షర్మిల మరో ప్రజాప్రస్థానం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల మరో ప్రజాప్రస్థానం: విజయమ్మ

షర్మిల మరో ప్రజాప్రస్థానం: విజయమ్మ

Written By news on Thursday, October 11, 2012 | 10/11/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్ : అన్ని రంగాల్లోనూ విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో పాదయాత్రను చేపడుతున్నారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి (ఇడుపులపాయ) నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ సాగుతుంది. కాంగ్రెస్, టీడీపీ చేసిన కుట్ర వల్ల అక్రమంగా జైలు పాలై తాను ప్రజలను కలుసుకునే పరిస్థితుల్లో లేనందున జగన్‌బాబు ఈ పాదయాత్ర చేయాలని చెప్పారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వెల్లడించారు. ఆమె గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సమస్యలతో అల్లాడుతూంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పక్షంగా తమ పార్టీ పోరాటం ప్రధానంగా అధికార, ప్రతిపక్షాలపైనేనని ఆమె అన్నారు. ప్రజా సమస్యలు తీర్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించేందుకు ప్రయత్నించకుండా రోడ్డెక్కి మొసలి కన్నీరు కార్చితే ప్రయోజనం ఏమిటని విజయమ్మ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. 

నేనే చేయాలనుకున్నా...

‘మామూలుగా అయితే బెయిలుపై విడుదలైన తరువాత పాదయాత్ర చేస్తూ తానే జనం మధ్యకు వెళ్లాలని జగన్‌బాబు భావించారు. ఆ ప్రకారం రోడ్‌మ్యాప్ కూడా రూపొందించారు. ఇవాళ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ప్రజల మధ్య పార్టీ ఉండాలని ఆయన భావిస్తున్నారు. మనలో ఎవరో ఒకరం ప్రజల మధ్య ఉండాలమ్మా...అని జగన్‌బాబు నాతో అన్నారు. ఆయన చెప్పినపుడు నేనే పాదయాత్ర చేయాలనుకున్నా. కానీ నాకు ఆర్థరైటిస్ (మోకాలి నొప్పులు) సమస్య ఉంది. అంత దూరం నడవాలంటే ఇబ్బంది అవుతుంది. పార్టీలో ఉండే పెద్దలు కూడా వద్దన్నారు. ఈ సంభాషణ జరిగేటపుడు అక్కడే ఉన్న షర్మిల ‘నేను చేస్తానమ్మా....’ అని ముందుకు వచ్చారు. ముందు తాను పాదయాత్ర ప్రారంభిస్తానని అన్న (జగన్) జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన దానిని కొనసాగిస్తారని షర్మిల అందరిలో అన్నారు. అన్న వచ్చేంత వరకూ నేనే చేస్తానని షర్మిల చెప్పారు. అందువల్ల షర్మిల పాదయాత్ర చేయాలని అందరమూ నిర్ణయించాం’ అని విజయమ్మ వెల్లడించారు. షర్మిల పాదయాత్ర ప్రారంభించాక వారంలో రెండు మూడు రోజుల పాటు ఆమెతో నేను కూడా ఉంటాను. అపుడపుడూ మధ్యలో భారతమ్మ కూడా వస్తూ ఉంటారని ఆమె వివరించారు. ఏరోజైతే జగన్ బయటకు వస్తారో ఆ రోజు నుంచి ఆయనే కొనసాగిస్తారు. పూర్తి చేస్తారని ఆమె అన్నారు. 

పాదయాత్ర ఎందుకు?

‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...! అసలు పరిపాలన ఉందా? అన్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పరిస్థితీ అలాగే ఉంది. అసలు ప్రతిపక్షం ఉందా? లేదా? అని అనుమానంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతోషంగా లేరు. ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్ మంజూరు కావడం లేదు. ఒక ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోతోంది. కానీ ఖజానా నింపుకునేందుకు ప్రజలపై పన్నులు వేసి భారం మోపుతోంది. కరెంటు ఛార్జీలు పెంచారు. సర్‌ఛార్జి సర్దుబాటు పేరుతో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ రేట్లను పెంచేశారు. నిత్యావసర వస్తువులైతే కొండెక్కి కూర్చున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. అందులోని చాలా వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో చేర్చారు. అక్కడ ఆపరేషన్లు చేయడానికి పరికరాల్లేవు, వసతులు లేవు. 108 అంబులెన్స్‌లు చూస్తే డీజిల్ లేకుండా ఉంది. 104 అసలుకే లేదు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటున్నారు. కానీ ఎక్కడా ఆ ఊసే లేదు. వై.ఎస్ గారు పావలా వడ్డీకి ఎంతో మందికి రుణాలు ఇచ్చారు. వైఎస్ పాలనలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఆయన ముందుకు నిత్యావసర సరుకుల ధరల వివరాలు వచ్చేవి. కరెంటు సరఫరా, జలాశయాల్లో నీటి నిల్వలు ఇలాంటి వివరాలన్నీ ఆయన టేబుల్ మీద ఉండేవి. ఆయన మానిటర్ (పర్యవేక్షణ) చేసే వారు. ఈరోజు దేని మీదా శ్రద్ధ లేనట్లుంది. అన్నీ ఆగి పోయాయి. సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరెంటు లేక పారిశ్రామిక రంగం కుప్పకూలింది. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పాదయాత్ర చేయాలని జగన్ చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు మన ప్రభుత్వం వస్తుంది, వైఎస్సార్ స్వర్ణయుగం వస్తుంది అని చెప్పి భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చెప్పాలన్నారు. ఈ సమస్యపై జగన్ వారం రోజుల దీక్ష చేశారు. మళ్లీ ఒకరోజు ఒంగోలులో దీక్ష చేశారు. నేనూ రెండు రోజుల పాటు దీక్ష చేశాను. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. దీక్ష చేసినందుకైనా ప్రభుత్వం దిగివస్తుందేమో అనుకున్నాం. కానీ అదేమీ జరుగలేదు. ఈ దీక్షలకు కొనసాగింపుగానే ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలనుకున్నాం. కరెంటు సరఫరా గ్రామాల్లో అధ్వాన్నంగా ఉంది. రెండు గంటలు కూడా రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఏడు గంటల పాటు సరఫరా చేయడమే కాక ఉచితంగా ఇచ్చారు. పేద ప్రజల కోసం ప్రజా పక్షంగా ఈ యాత్ర చేస్తున్నామని ఆమె అన్నారు. 

ప్రతిపక్షం బాగా పని చేసి ఉంటే...

అసలు రాష్ట్రంలో ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. మా పార్టీ చాలా చిన్న పార్టీ, మేం ఏమీ చేయలేం. ఈరోజు అసెంబ్లీ చూస్తే ఐదు రోజుల సమావేశాల్లో ప్రతిపక్షనేత కీలకమైన బీఏసీ సమావేశానికి కూడా రాలేదు. అసెంబ్లీ జరుపుకోవాలని ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. మమ్మల్ని బయటకు పంపి అసెంబ్లీ నడుపుకోండని టీఆర్‌ఎస్ వాళ్లు కూడా చెప్పారు. చంద్రబాబు ఐదు రోజుల్లో అపుడపుడూ ఐదు నిమిషాలు వచ్చి కూర్చుని వెళ్లి పోయారు. ఒక్క సంతాపం మాత్రమే అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎంతగా కలిసి పోయారంటే జగన్‌బాబును జైలుకు పంపే విషయంలో కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కోర్టుకు వెళ్లారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. నిన్నటికి నిన్న బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను క లిశారు. ఇడి విచారణ జరిపిందో లేదో రెండు మూడు గంటల్లోనే అటాచ్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. అంటే వారెంత బాగా కలిసి పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. చిరంజీవి కాంగ్రెస్‌తో కలవనంతటి వరకూ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. రెండోసారి అవిశ్వాసం పెట్టినా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే. మరి ఈ రోజు ఇంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉంటే ఎందుకు చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? ఈ రోజు బాబు రోడ్డున పడి పాదయాత్ర చేస్తున్నారు, 9 ఏళ్లు అధికారంలో ఉండగా ప్రజల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా ఆయన చేశారా? వై.ఎస్ చేసిన పథకాలు మంచి, కొనసాగించాలంటారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి వై.ఎస్‌ను, జగన్‌ను తిట్టడం ప్రారంభిస్తారు. దాని బదులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. మళ్లీ వేరు ప్రభుత్వం వచ్చేది. అపుడు ప్రభుత్వానికి భయం ఉండేది. అలా చేయకుండా పాదయాత్ర కు తిరుగుతున్నారు.

వై.ఎస్ పాదయాత్రకు నకలు

బాబు దివంగత వై.ఎస్.పాదయాత్రను అనుకరిస్తున్నారని విజయమ్మ అన్నారు. అసలు ఆయన వై.ఎస్‌ను అనుకరిస్తున్నారా...లేక జగన్‌బాబు ఓదార్పు మాదిరిగా వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మేం మాత్రం ఈ ప్రభుత్వంపైన ప్రతిపక్ష టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టే విధంగా ఒత్తిడి చేయడానికి కూడా పాదయాత్ర చేస్తున్నాం, ఈ విషయాన్ని ప్రధానంగా పాదయాత్రలో ప్రజలకు చెబుతామని విజయమ్మ వివరించారు. షర్మిల చేసే ఈ పాదయాత్రను ‘మరో ప్రజాప్రస్థానం’ అని పేరు పెట్టామన్నారు. ఆమె తండ్రి వై.ఎస్.ఆర్ స్ఫూర్తితో ఈ యాత్రలో ముందుకు వెళతామని ఆమె అన్నారు. వై.ఎస్ పాదయాత్రతో బాబు యాత్రకు పోలికే లేదని ‘ఎక్కడైనా ఎప్పుడైనా (ఎనీ వేర్, ఎనీటైం) సాటి రాదని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాబు కూడా ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నపుడు విమర్శించడం దేనికి ? అని విలేకరులు ప్రశ్నించినపుడు ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ కార్యక్రమం చేయలేదు. ప్రజలు ఆయన్ను నమ్మని పరిస్థితి ఉంది. మాకు విశ్వసనీయత ఉంది. వై.ఎస్ వారసులంగా మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అని విజయమ్మ అన్నారు. షర్మిల ఏ హోదాతో పాదయాత్ర చేస్తారని ప్రశ్నించినపుడు ‘షర్మిల వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారెతగా, జగన్ సోదరిగా చేస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్థన్, బి.గురునాథరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, అంబటిరాంబాబు, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మల, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 
Share this article :

0 comments: