అవిశ్వాసం పెట్టరేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసం పెట్టరేం?

అవిశ్వాసం పెట్టరేం?

Written By news on Wednesday, October 24, 2012 | 10/24/2012

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టాలి
కానీ పెట్టరు.. ఎందుకంటే జగన్ సీఎం అవుతారని భయం
సాగునీటికి వైఎస్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వెచ్చించారు
మీరు తొమ్మిదేళ్లలో 10 వేల కోట్లయినా ఖర్చు పెట్టారా?
మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా?
కరెంటు బిల్లు కట్టకపోతే జైల్లో పెట్టించింది మీరు కాదా?
వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా?
ప్రజల్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంది మీరు కాదా?
ఇంకా ఎందుకు పాదయాత్ర నాటకాలు చంద్రబాబూ?
ఆరో రోజు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కలిపి 15.1 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. ప్రభుత్వం పడిపోతే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు భయం..’ అని దుయ్యబట్టారు. ఆరో రోజు మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె పలు చోట్ల ప్రసంగించారు. ‘రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో సాగునీటికి కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. 

అదే రైతు పక్షపాతి రాజన్న 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు మనసులోని మాటను ఆయనే పుస్తక రూపంలో బయటపెట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఎల్లో డ్రామాలు ఆడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలులో పెట్టింది మీరు కాదా చంద్రబాబూ? వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా? ఇంకా ఎందుకు నాటకాల పాదయాత్రలు?’ అని షర్మిల ధ్వజమెత్తారు.

దొందూ దొందే..

‘చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం తీసిపోలేదు. దొందూ దొందే అన్నట్టుగా చంద్రబాబు ప్రజలను గాలికి ఒదిలేయగా.. రాజశేఖరరెడ్డి తెచ్చిన పథకాలన్నింటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారు..’ అని షర్మిల విమర్శించారు. ఆరో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని నేర్జాంపల్లి నుంచి ఆమె పాదయాత్ర కొనసాగించారు. నేర్జాంపల్లి దాటాక మార్గం మధ్యలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం వద్ద ఆగారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అనంతరం షర్మిల స్పందిస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు తెచ్చేందుకు వైఎస్ తాను చనిపోయేనాటికి 90 శాతం పనులు పూర్తి చేస్తే.. ఆయన చనిపోయిన మూడేళ్లలో ఈ ప్రభుత్వం కనీసం రాయి కూడా కదపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

‘ఈ పథకం పూర్తయితే చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లొచ్చే అవకాశం ఉందట. కానీ ఆ చిత్తూరులో పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ పథకం పూర్తిచేయాలని ఎందుకు లేదు? అక్కడే పుట్టిన చంద్రబాబు ఈ పథకం ఎందుకు పూర్తిచేయలేదని ఎందుకు నిలదీయలేదు? రాజశేఖరరెడ్డి పుట్టిన జిల్లా అంటే అంత కక్షా? ఈ నిర్లక్ష్యం, ఈ రాక్షస పాలన కొనసాగడానికి ఇక వీల్లేదు. ఇంతమందికి అన్నంపెట్టే ఈ ప్రాజెక్టుకు అన్యాయం చేసే ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు. జగనన్న సీఎం అయిన ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తారు..’ అని హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు.

అధికారులను నిలదీసిన షర్మిల

ఒంటిగంటకు వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న చిత్రావతి జలాశయం వద్దకు షర్మిల చేరుకున్నారు. 9 టీఎంసీల నీరు నిండాలని, తాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని రాజశేఖరరెడ్డి కన్న కల కలగానే మిగిలిపోతోందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందులకు తాగునీటి కోసం 1.5 టీఎంసీల నీరిస్తానని చెప్పిన అధికారులు ఆ మేరకు నీళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రాజెక్టు డీఈని షర్మిల ప్రజల తరఫున నిలదీశారు. ‘ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘పై నుంచి ఆదేశాల మేరకే మేం నడుచుకుంటున్నాం’ అని సమాధానం ఇచ్చారు. 

షర్మిల ‘అంటే చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ఇప్పుడు రైతులు, ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలని ఈ ప్రభుత్వ ఉద్దేశమా?’ అని ప్రశ్నించారు. ‘సాధ్యం అయినంతవరకు వనరులను బట్టి చేస్తున్నాం’ అని అధికారి బదులిచ్చారు. ‘ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడం సరికాదు కదా. మీరు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే ప్రజలకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. ఇది సరికాదు. ప్రజలకు న్యాయం చేయా లి..’ అని కోరారు. అనంతరం జలాశయం సమీపంలో భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 3.45కు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా సరిహద్దులోకి చేరుకున్నారు.

40 లక్షల చదరపు అడుగుల స్టోరేజ్

అనంతపురం జిల్లా దాడితోట గ్రామ సమీపంలోని రత్నమ్మ అనే రైతుకు చెందిన టమాట తోట ఎండిపోవడంతో అక్కడ ఆగారు. ఇప్పటికే రెండు లక్షల అప్పు ఉందని, ఇప్పుడు టమాట తోట ఎండిపోయి నష్టపోయామని, బోరు ఎత్తిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రత్నమ్మ వాపోయారు. ఇప్పుడు వరిపొలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని వివరించారు. ‘చిత్రావతికి ఇంత సమీపంలో రైతు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈప్రభుత్వానికి మనసే లేదు..’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘టమాటాలను రైతు 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది..’ అని రైతులు వివరించగా ‘జగనన్న సీఎం కాగానే రాష్ట్రంలో ఇప్పుడున్న 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యం పెంచుతార’ని షర్మిల హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దాడితోటకు వచ్చి సాయంత్రం 5.40కి అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. రాత్రి 7.45కు దాడితోట శివారులో రాత్రి బసకు చేరుకున్నారు. ఆరో రోజైన మంగళవారం మొత్తం 15.1 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ జిల్లాలో 7.3 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 7.8 కిలోమీటర్లు నడిచారు.

source:sakshi
Share this article :

0 comments: