వీధి నాటకానికే బాధ యాత్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వీధి నాటకానికే బాధ యాత్రలు

వీధి నాటకానికే బాధ యాత్రలు

Written By news on Thursday, October 4, 2012 | 10/04/2012


కిరణ్ సర్కారును భుజాన మోస్తూ పాదయాత్రలా?
దమ్ముంటే అవిశ్వాసం పెట్టి దించెయ్యండి: వైఎస్సార్‌సీపీ
బాబు ‘కుమ్మక్కు’ వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
ఎవరిది కుమ్మక్కో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
సర్కారును కూల్చనని ప్రకటించిన చరిత్ర బాబుది
ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాలకు పాల్పడ్డా ఏ కేసులూ లేవు..
కుమ్మక్కుకు ఇదే రుజువు
జగన్‌ను మాత్రం వివాదాస్పద జీవోలతో ఏ సంబంధం లేకున్నా జైలుపాలు చేశారు
కుమ్మక్కవనందుకేనని రాష్ట్రమంతటికీ తెలుసు
జగన్ కాంగ్రెస్‌లో ఉంటే సీఎం అయ్యేవారని ఆజాదే అన్నారు
జారిపోతున్న క్యాడర్‌ను కాపాడుకునేందుకే బాబు పాదయాత్ర
పాదయాత్రతో పిక్కలు పట్టేశాయన్న వ్యాఖ్యలు విడ్డూరం
కాళ్లు వాచిపోయే రోజులు కూడా వస్తాయన్న పద్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా మండిపడింది. విపక్ష నేతనన్న విషయం కూడా విస్మరించి అధికార పార్టీతో మూడేళ్లుగా అడుగడుగునా అంటకాగుతున్న చంద్రబాబు నోట ఇలాంటి మాటలు రావడం దొంగే తిరిగి ‘దొంగా!’ అని అరిచిన చందంగా ఉందంటూ ఎద్దేవా చేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును కాపాడే బాధ్యతను బాబు తన భుజస్కంధాలపై మోస్తున్న వైనాన్ని రాష్ట్రమంతా గమనిస్తూనే ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పక్కా అవగాహన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కంటికి రెప్పగా కాపాడుతున్నది బాబేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు అవినీతిమయమని ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్న చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలని సవాలు విసిరారు. ఆమె బుధవారం విలేకరుల సమావేశంలోనూ, తర్వాత ‘న్యూస్‌లైన్’ ప్రతినిధితోనూ మాట్లాడారు. ‘‘అవిశ్వాసం పెట్టి సర్కారును పడగొట్టడం నీ చేతిలో పని కాదా? అయినా కలలో కూడా ఆ పని చేయకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది నువ్వు కాదా? అవిశ్వాసం పెట్టబోనని, ప్రభుత్వాన్ని కూల్చబోనని పత్రికాముఖంగా ప్రకటించిందీ నువ్వే కాదా?’’ అంటూ బాబును ఆమె సూటిగా నిలదీశారు.

నానాటికీ చేజారిపోతున్న టీడీపీ క్యాడర్‌ను ఎలాగోలా నిలుపుకునేందుకే పాదయాత్ర పేరుతో వీధి నాటకాలాడుతూ బాబు ఆపసోపాలు పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన పాదయాత్రకు అంతకంటే పరమార్థం లేదన్నారు. బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల్లో అధికార పార్టీతో రాజీ పడిందెవరో అందరికీ తెలుసని పద్మ అన్నారు. కాంగ్రెస్‌తో రాజీ పడని కారణంగానే నేడు జగన్ తనకు ఏ సంబంధమూ లేని 26 జీవోల విషయంలో జైల్లో ఉన్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే కేంద్ర మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవారని సాక్షాత్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాదే ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎవరి దగ్గర ఎవరు రాజీ పడ్డారో చెప్పేందుకు ఇది చాలదా అంటూ బాబును నిలదీశారు. ‘‘63 ఏళ్ల వయసులో నిన్ను నువ్వు హింస పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. అంతగా హింస పెట్టుకోవడమెందుకు బాబూ? వైఎస్ తదనంతరం కాంగ్రెస్ పాలనలో జనాలకు నిత్యం కష్టాలే కాదా? ఇళ్లకు దేవుడెరుగు, కనీసం పరిశ్రమలకు కూడా కరెంటుకు దిక్కు లేదు. కొత్తగా ఒక్క రేషన్ కార్డు గానీ, బలహీన వర్గాలకు ఒక్క ఇల్లు గానీ, ఒక్క పెన్షన్ గానీ లేవు. పైగా కరెంటు నుంచి ఎరువుల దాకా అన్నింటి ధరలూ ఎడాపెడా పెరుగుతూనే ఉన్నాయి.


ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో కూలదోయడం నీ చేతిలో పని కాదా? ఆ పని చేయకుండా, అదే కాంగ్రెస్‌తో అడ్డంగా రాజీ పడిందీ, అవిశ్వాసం పెట్టకుండా రోడ్లపై పడి తిరుగుతున్నదీ.. నువ్వే కాదా! అందుకే కదా బాబూ.. ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాలకు పాల్పడ్డా, అతి విలువైన భూములను అప్పనంగా అస్మదీయులకు పంచి పెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీపై ఏ కేసులూ పెట్టనిది! ఎమ్మార్ విషయంలోనైతే పరిశ్రమలకు గానీ, ఉపాధికి గానీ కాకుండా కేవలం సంపన్నుల విలాసాల కోసం అతి విలువైన వందలాది ఎకరాలను కారుచౌకగా రాసిచ్చావు. అయినా నీపై కేసుల ఊసు కూడా లేదంటే, కేవలం కాంగ్రెస్‌తో కుమ్మక్కవడమే అందుకు కారణం కాదా! ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకుని తాజా ఉప ఎన్నికల దాకా కాంగ్రెస్‌తో నువ్వు ఓట్ల మార్పిడి చేసుకున్నది అబద్ధమా? మీ పరస్పర కుమ్మక్కే అందుకు కారణమన్నది అబద్ధమా?’’ అంటూ బాబును పద్మ తూర్పారబట్టారు. జగన్ ఏ దశలోనూ కాంగ్రెస్‌తో కుమ్మక్కవలేదనేందుకు నడిచిన, నడుస్తున్న చరిత్రే తిరుగులేని సాక్షి అని ఆమె స్పష్టం చేశారు. ఆజాద్ వ్యాఖ్యలు కూడా దానికి అద్దం పట్టాయన్నారు. ‘‘వివాదాస్పదమైనవని అంటున్న 26 జీవోలపై సంతకం పెట్టడం దేవుడెరుగు, వాటితో కనీసం సంబంధం కూడా లేకున్నా జగన్‌ను ప్రభుత్వ పెద్దలు జైలుపాలు చేశారు. స్వయంగా అతి భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డ బాబు మీదేమో ఈగ కూడా వాలనివ్వడం లేదు’’ అంటూ దుమ్మెత్తిపోశారు.

అక్కడా అనుకూలమేగా...!

కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై కూడా మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరగని పనిని, అందుకు ములాయంసింగ్ మద్దతివ్వరని, కాబట్టి లోక్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలు రానే రావని కూడా చంద్రబాబే తేల్చేస్తున్న వైనాన్ని పద్మ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అనుకూలంగా ఇంత బాహాటంగా మాట్లాడుతున్న ఆయన, ఏ ముఖం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పై కుమ్మక్కు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

మైండ్ బ్లాకైనందుకే...

ప్రజలను కలిసేందుకంటూ చేపట్టిన పాదయాత్రలో హుందాగా వ్యవహరించకుండా పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అంటూ జగన్‌ను అవహేళన చేస్తుండటాన్ని పద్మ తీవ్రంగా ఖండించారు. ‘పిల్ల కాంగ్రెస్ అంటున్నారు... మొన్నటి ఉప ఎన్నికల్లో ఆ పిల్ల కాంగ్రెస్ కొట్టిన దెబ్బకే టీడీపీకి ఒక్క అసెంబ్లీ సీటూ రాని వైనాన్ని, నెల్లూరు లోక్‌సభ స్థానంలోనైతే ఏకంగా డిపాజిటే గల్లంతైన చరిత్రను అప్పుడే మరిచారా బాబూ? లేక.. ఆ ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాకై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా?’’ అంటూ మండిపడ్డారు.

త్యాగమన్నట్టుగా పోజు కొడితే ఎలా..?

పాదయాత్ర పేరుతో పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు, ప్రజల సానుభూతి పొందేందుకు మాత్రమే బాబు తాపత్రయపడుతున్నారని పద్మ విమర్శించారు. ‘‘63 ఏళ్ల వయసులో మీకోసం వచ్చానంటూ అదేదో త్యాగం చేస్తున్నట్టుగా బాబు పోజు కొడుతున్నారు. రాత్రంతా నిద్ర పట్ట లేదని, పిక్కలు పట్టేశాయని పదేపదే చెప్పుకుంటున్నారు. ఒక్క రోజుకే పిక్కలు పట్టేస్తే ఎలా? కాళ్లు వాచిపోయే రోజులు కూడా వస్తాయి’ అంటూ ఎద్దేవా చేశారు. చనిపోవడానికైనా సిద్ధమంటూ హాస్యాస్పద వ్యాఖ్యలకు బాబు తెర తీశారని అన్నారు. నాయకుడంటే ప్రజల్లోనే ఉండాలని, అది వారి విధి అని ఆమె గుర్తు చేశారు. అలాంటి దాన్ని ఏదో పెద్ద త్యాగమన్నట్టుగా బాబు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. ‘‘జగన్ రెండేళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా, నిత్యం ప్రజల మధ్యన గడిపారు. కానీ ఆయన తనకు కలిగిన దుర్భరమైన శారీరక బాధలను ఏ రోజూ ఎవరికీ చెప్పుకోలేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, జ్వరంతో బాధ పడుతూ కృశించినా.. అంతటి బాధలను కూడా పక్కవారికైనా చెప్పుకోలేదాయన’’ అని గుర్తు చేశారు.

గ్యాస్‌పై ప్రశ్నించరేం!?

గృహావసరాలకు ఆరు సబ్సిడీ సిలిండర్ల తరవాత ఏడో సిలిండర్ నుంచి ఒక్కో బండ ధర ఏకంగా రూ.1,000 దాకా పెరిగే ప్రమాదమున్నా, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిగా నీరుగారుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పద్మ అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం చేయాల్సిన ఏ పనులనూ బాబు చేయడం లేదంటూ దుయ్యబట్టారు. బాబు తొమ్మిదేళ్లలో అందించిన పాలనకు అచ్చం నకలు వంటి పాలననే కిరణ్ అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘సంక్షేమ పథకాలొద్దు, సబ్సిడీలొద్దు’ అనే బాబు సిద్ధాంతాలనే కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు.

source:sakshi
Share this article :

0 comments: