పాదయాత్రవైపే మొగ్గు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్రవైపే మొగ్గు...

పాదయాత్రవైపే మొగ్గు...

Written By news on Thursday, October 11, 2012 | 10/11/2012

* ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయం
* రథయాత్ర, ఓదార్పు యాత్రపైనా వైఎస్సార్ సీపీ నేతల సమాలోచనలు
* వయసురీత్యా విజయమ్మతో యాత్ర వద్దని సూచన.. 
* నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. 
* అనంతరం జగన్‌తో సంప్రదింపులు.. ఆపై కార్యాచరణ వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ), కార్య నిర్వాహక మండలి(సీఈసీ) సభ్యులు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్ కుటుంబీకులు పాదయాత్ర చేయడం మంచిదని సమావేశంలో మెజారిటీ నేతలు సూచించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్రవైపే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపినట్లు వెల్లడించారు.

విజయమ్మ పాదయాత్ర వద్దన్న సీనియర్లు
కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆరోగ్య పరిస్థితులు, వయసు రీత్యా విజయమ్మ పాదయాత్ర చేయరాదని వారించారని, అయితే జగన్ కుటుంబీకులే దీనిని చేపట్టాలని కోరారని కూడా రామకృష్ణ తెలిపారు. పాదయాత్ర, ఓదార్పు యాత్ర, రథయాత్ర చేయాలని నాయకుల నుంచి సూచనలు వచ్చాయని రామకృష్ణ అన్నారు. ఢిల్లీ వెళ్లి పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేయాలని, జిల్లాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కూడా మరిన్ని అభిప్రాయాలు వచ్చాయని చెప్పారు. ఈ సూచనలన్నింటిపైనా గురువారం ఉదయం విజయమ్మ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని చర్చించాక సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వివరించారు. వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయాలని కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలను ఛేదిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు.

విత్తనాల్లేవ్, ఎరువుల్లేవ్, కరెంటు లేదు..
రైతులకు విత్తనాలు, ఎరువులు అందడం లేదని, మరోవైపు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించిన విధంగా ఉచిత విద్యుత్ సరఫరా జరగడం లేదని రామకృష్ణ విమర్శించారు. విద్యుత్ కొరత వల్ల పరిశ్రమలు ప్రొడక్షన్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొందన్నారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చినందువల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ‘రోమ్ నగరం తగులబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా’ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది..
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ అన్నారు. వైఫల్యాలతో పాలిస్తున్న కిరణ్ సర్కారును గద్దె దించడానికి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకుండా చంద్రబాబు పాదయాత్రకు వె ళ్లి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎపుడూ జనం మధ్యలో ఉండాలనేది తమ పార్టీ నేత జగన్ అభిమతమని, ఆయన అభీష్టానికి అనుగుణంగా పార్టీ తరపున ఏదో ఒక యాత్ర చేపడతామని అన్నారు. చంద్రబాబు పాదయాత్రను చూసే వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అదే కార్యక్రమాన్ని చేపడుతోందా? అని ప్రశ్నించగా ‘ఆయన్ను చూసి మేం చేసేదేమిటి! అసలు పాదయాత్ర అంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిందే... పాదయాత్ర పేటెంట్ ఆయనదే! మండుటెం డలో వైఎస్ ప్రాణాలకు తెగించి యాత్ర చేశారు... వైఎస్‌తో బాబు యాత్రకు పోలికేంటి?’ అని రామకృష్ట జవాబిచ్చారు.

పార్టీ సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్.సంతోష్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బి.గురునాథరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, భూమా నాగిరెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎం.వి. మైసూరారెడ్డి, ఎం.ప్రసాదరాజు, డి.రవీంద్రనాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, కణితి విశ్వనాథం, బాల మణెమ్మ, ఆర్.రవీంద్రనాథ్ రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మల కుమారి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, వై. విశ్వేశ్వరరెడ్డి, పువ్వాడ అజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: