పథకం ప్రకారమే ‘సాక్షి’ వాహనంపై దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పథకం ప్రకారమే ‘సాక్షి’ వాహనంపై దాడి

పథకం ప్రకారమే ‘సాక్షి’ వాహనంపై దాడి

Written By news on Tuesday, October 2, 2012 | 10/02/2012

వద్దని బతిమాలిన సాక్షి టీవీ టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్‌పై దౌర్జన్యం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నాయకత్వంలో ర్యాలీగా వచ్చి మూకుమ్మడి దాడి

టైర్లలో గాలి తీసి, పెట్రోల్ ట్యాంక్‌లో నిప్పుపెట్టిన ఆందోళనకారులు

వీడియో దృశ్యాల ఆధారంగా దౌర్జన్యకారులను గుర్తించనున్న పోలీసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ మార్చ్ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొందరు ఆందోళనకారులు పథకం ప్రకారమే మీడియా వాహనాలపై దాడులు చేసి తగులబెట్టారు. తాము మార్చ్‌ను కవర్ చేయటానికి వచ్చామని తమ వాహనాన్ని ధ్వంసం చేయవద్దని వేడుకున్న సాక్షి టీవీ డీఎస్‌ఎన్‌జీ వ్యాన్ డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్‌లపై వారు దౌర్జన్యానికి దిగి గాయపరిచారు. తెలంగాణ మార్చ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సాక్షి టీవీ డీఎస్‌ఎన్‌జీ వాహనంతో సిబ్బంది బయలుదేరి వెళ్లారు. 

కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా నెక్లెస్ రోడ్డులో మీడియాకు కేటాయించిన ప్రాంతంలో ఈ వాహనాన్ని పార్క్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే దాదాపు వంద మంది మూకుమ్మడిగా వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాడి చేశారు. టైర్లలో గాలి తీసేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ ట్యాంక్ తెరిచి నిప్పుపెట్టారు. మధ్యాహ్నం నుంచే వేలాది మంది తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డు మార్గంలోనే ఉన్నా ఏ ఒక్కరూ మీడియా వాహనాలవైపు కన్నెత్తి చూడలేదు. కానీ.. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో కలిసి మార్చ్ జరుగుతున్న ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు. వచ్చిన వెంటనే వారు సభాస్థలి వైపు వెళ్లకుండా మీడియా వాహనాల వైపు వచ్చారు. 

ముందుగా దూరదర్శన్‌తో పాటు మరో ప్రైవేట్ మీడియా డీఎస్‌ఎన్‌జీ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ పక్కనే ఉన్న సాక్షి టీవీ వాహనాన్ని ధ్వంసం చేశారు. దాదాపు వంద మంది ఒకేసారి దాడికి దిగటంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ తరువాత ఆందోళనకారులు వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు దౌర్జన్యకారులను గుర్తించనున్నారు. వీడియో టేపులను పరిశీలిస్తున్నామని, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. 
Share this article :

0 comments: