హస్తిన సాక్షిగా ఎన్ని కుట్రలో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హస్తిన సాక్షిగా ఎన్ని కుట్రలో!

హస్తిన సాక్షిగా ఎన్ని కుట్రలో!

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

వందమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షకు గురికాకూడదన్నది మన నేర న్యాయ శాస్త్ర సిద్ధాంతానికి ప్రాణధాతువు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న సీబీఐ తన చేష్టలతో సరిగ్గా దాన్నే దెబ్బతీస్తోంది. సుప్రీంకోర్టులో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చిన సందర్భంగా ఆ సంస్థ చేసిన వాదనలు చూసినా, దాదాపు ఏడాదికాలంగా జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అది చేస్తున్న దర్యాప్తు తీరు గమనించినా ఇది స్పష్టంగానే అర్ధమవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం జగన్‌పై కన్నెర్రజేసి శంకర్రావు ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయించడం, అటు తర్వాత దానిలో తెలుగుదేశం పార్టీని జత కలుపుకోవడం దగ్గర్నుంచి దర్యాప్తు పేరుతో 28 బృందాలతో సీబీఐ అధికారులు చేసిన హంగామా... నాలుగు నెలలనాడు జగన్‌మోహన్ రెడ్డిని ప్రశ్నించడం పేరిట పిలిచి అరెస్టుచేయడంతో పరాకాష్టకు చేరుకుంది. 

అవినీతికి మూలమని చెబుతున్న 26 జీవోల ఊసెత్తకుండా సాగిన ఈ తతంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాటి గురించి పట్టించుకోరేమని ప్రశ్నించాక కొత్త అంకానికి తెరలేచింది. అందులోనూ ఎన్ని ఎత్తులని? జగన్‌మోహన్ రెడ్డిని అరెస్టు చేయదల్చుకున్నప్పుడు ఒక మంత్రిని అరెస్టు చేయడం...ఆయన బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చినప్పుడు మరో మంత్రిపై చార్జిషీటు దాఖలు చేయడం...ఒక అధికారిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా నిరోధించడం...మరో అధికారి పేరు చార్జిషీటులో ఉన్నా ఆయన జోలికెళ్లకపోవడం...ఇవన్నీ కళ్లెదుట కనబడుతున్నవే. సీబీఐని ఎవరో ఆడిస్తున్నారని తెలియజెప్పేవే. అది నిజంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే, నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తుంటే ముందు జీవోల జారీ దగ్గర్నుంచి దర్యాప్తు మొదలెట్టాలి. వాటి పర్యవసానంగానే అవినీతి జరిగిందని చూపగలగాలి. దాని లబ్ధిదారులను గుర్తించగలగాలి. కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ‘అసలు లక్ష్యం’ వేరుగనుక దర్యాప్తు రివర్స్‌లో మొదలైంది. 

సీబీఐ వేస్తున్న ప్రతి అడుగూ దాని పక్షపాత ధోరణిని ప్రతిఫలిస్తున్నది. పాలకుల అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు నెలల తరబడి నడుస్తూనే ఉంది. ఎక్కడిదాకానో అవసరంలేదు... సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చిన ప్రతిసారీ ఏదో రకమైన ఎత్తుగడ అనుసరించడం, విచారణ వాయిదా పడేలా చూడటం సీబీఐకి అలవాటైపోయింది. న్యాయవాదులను మార్చడం దగ్గర్నుంచి తమ న్యాయవాది అందుబాటులో లేరని చెప్పడం వరకూ చూస్తే జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ రాకూడదన్న కాంగ్రెస్, బాబు పార్టీల మనోభీష్టానికి అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తోందని అందరికీ అర్ధమయ్యే విషయం. జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తనముందుకు విచారణ కొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఈ వాస్తవాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అనే అనుమానం సామాన్యులకు సైతం కలగడం సహజం. 

బెయిల్ ఇవ్వడమనేదే రూలు... జైలు అనేది అరుదైన స్థితిలో మాత్రమే అనుసరించదగ్గ మార్గమని జస్టిస్ కృష్ణయ్యర్ ఒక కేసులో వ్యాఖ్యానించారు. కానీ, జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తమ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, విదేశాల్లో కూడా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదని, అందుకోసమని ఆయా దేశాలకు అభ్యర్ధనా పత్రాలు (లెటర్ రొగేటరీలు) కూడా పంపామని సీబీఐ అంటోంది. సీబీఐ ఎన్ని కేసుల్లో ఇలా అభ్యర్ధనా పత్రాలు పంపిందో, ఎన్నింటిపై ఇంతవరకూ దర్యాప్తు పూర్తయిందో ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించి ఉంటే ఆ సంస్థ అసలు రంగు వెల్లడయ్యేది. వివిధ దేశాలకు సీబీఐనుంచి వెళ్లిన 194 అభ్యర్థనా పత్రాల అతీ గతీ ఏమైందో ఎవరికీ తెలియదు. ఇదంతా ఏడాదిక్రితం లెక్క. ప్రస్తుతం వాటి సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చుకూడా. 

నిందితులను పట్టించి ఇవ్వడం ఇష్టంలేకే ఆయా దేశాలు స్పందించడంలేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆ అభ్యర్ధనా పత్రాలు సక్రమంగా లేకపోవడమే కారణమని చాలా కేసుల్లో రుజువవుతున్న అంశం. పశ్చిమబెంగాల్‌లోని పురూలియాలో కొన్నేళ్లక్రితం విమానంనుంచి వందలకొద్దీ ఏకే-47 రైఫిళ్లు వెదజల్లి తప్పించుకుపోయిన డెన్మార్క్ దేశస్తుడు కిమ్ డెవీని అప్పగించండంటూ పంపిన అభ్యర్థనా పత్రంతోపాటు సమర్పించిన కోర్టు వారెంటుకు కాలం చెల్లిందని కోపెన్‌హాగన్ కోర్టు చెబితేతప్ప అక్కడకు వెళ్లిన మన సీబీఐ బృందానికి జ్ఞానోదయం కలగలేదు. చివరకు కి మ్ డెవీని రప్పించలేకపోవడం వేరే కథ. బోఫోర్స్ కీలక నిందితుడు ఖత్రోచీ విషయంలోనూ సీబీఐ చరిత్ర డిటోయే. 

ఇంత నేపథ్యమున్న సీబీఐ... సర్వోన్నత న్యాయస్థానానికి జగన్‌మోహన్ రెడ్డి కేసులో లెటర్ రొగేటరీ సాకును చూపడం వింతల్లోకెల్లా వింత. బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం న్యాయస్థానాల విచక్షణకు సంబంధించిందే అయినా దర్యాప్తు సాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని నిర్ణయానికొచ్చేముందు ఆ దర్యాప్తు ఎలా సాగుతున్నదో సర్వోన్నత న్యాయస్థానం దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. ఏమైనప్పటికీ తాజా పరిణామాలతో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయిన వైనం హస్తిన సాక్షిగా మరోసారి బయటపడింది. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ జరిగే ముందురోజు హుటాహుటీన తెలుగుదేశం బృందం కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని కలవడం, వారి రాకకోసమే ఎదురుచూస్తున్నట్టు ఆయన వెనువెంటనే ఈడీకి ఆదేశాలివ్వడం, ఈడీ ఏమి చేయబోతున్నదో ముందుగా తెలుగుదేశమే మీడియాకు లీక్ ఇవ్వడం... గురువారం పగలంతా సాగిన కుట్ర తాలూకు ఆనవాళ్లు. తెలుగుదేశాధినేత ‘వస్తున్నా మీకోసం...’ అంటూ తమ కళ్లముందే తిరుగుతూ ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి ఆడిన నాటకాన్ని జనం గమనించకపోలేదు. ఈ కుట్రదారులకు వారు తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=50301&Categoryid=1&subcatid=17
Share this article :

0 comments: