జనం కష్టాలు తీర్చని ఆ పదవులు ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం కష్టాలు తీర్చని ఆ పదవులు ఎందుకు?

జనం కష్టాలు తీర్చని ఆ పదవులు ఎందుకు?

Written By news on Friday, October 26, 2012 | 10/26/2012

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కడిగేసిన షర్మిల
ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీళ్లు ఇవ్వలేరా?
మూడేళ్లుగా హంద్రీనీవా పూర్తిచేయలేదెందుకు?

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేరా? ముఖ్యమంత్రిలా మీరూ నిద్రపోతున్నారా? కుర్చీలు, ఢిల్లీ తప్ప మీకు జనం సమస్యలు పట్టవా? జనం కష్టాలు తీర్చని మీకు ఆ పదవులు ఎందుకు?..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల నిప్పులు చెరిగారు.

అనంతపురం జిల్లాలో సాగుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా బుధ, గురువారాల్లో ఆమె ధర్మవరం నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలు షర్మిలకు తమ సమస్యలపైన, అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపైన ఫిర్యాదులు చేశారు. ప్రతి గ్రామంలో ఈ ఫిర్యాదులు అందాయి. ‘సాగునీటి మాట దేవుడెరుగు.. మాకు తాగునీళ్లు ఇచ్చే నాథుడే లేడు. కేవలం మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నామని మా ఎమ్మెల్యే మమ్మల్ని వేధిస్తున్నాడు.. మీరొస్తున్నారని ఫ్లెక్సీలు కూడా కట్టుకోకూడదట’ అని సమస్యలు ఏకరువు పెట్టారు. దీనిపై షర్మిల స్పందిస్తూ ‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తెచ్చారు. జీవో ఇచ్చి రెండేళ్లు అమలు చేశారు. కానీ ఈ మంత్రులు అలా ఎందుకు చేయడం లేదు? తుంగభద్ర నుంచి నీటిని తేవడంలో ఆలస్యం చేస్తున్నారేం?’ అని ప్రశ్నించారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి చంద్రబాబు నాయుడు రెండుసార్లు శిలాఫలకం వేసి పక్కకు తప్పుకొన్నారు. కానీ మన రాజన్న రూ. 4,500 కోట్లతో ఈ పథకాన్ని ఐదేళ్లలో 90 నుంచి 95 శాతం పనులు చేస్తే.. ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఒక్క రాయి కూడా కదపలేదు’ అని షర్మిల అన్నారు.

బాబూ ఎందుకు పాదయాత్ర?

‘ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు వారికే మద్దతుగా నిలుచున్నారు. ఇప్పుడు దొంగ పాదయాత్రలు చేస్తున్నారు. అసలు ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మేం ఏమీ చేయలేం కాబట్టి మేం పాదయాత్ర చేసినా అర్థం ఉంది. కానీ ఆయనకు ఎందుకు పాదయాత్ర? నేరుగా అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాని దింపొచ్చుగా..’ అని షర్మిల ప్రశ్నించారు. ‘రాజన్న పాదయాత్ర చేసినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? రాజశేఖరరెడ్డి ఇచ్చే హామీలన్నీ నెరవేరాలంటే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలన్నాడు. కానీ రాజన్న పాదయాత్ర చేశాడు. వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని అమలు చేసి చూపాడు. చంద్రబాబు గారూ ప్రజలకు మీ పాలన చరిత్ర తెలుసు. కేవలం రాజన్న పాదయాత్రను కాపీ కొట్టారు. ఆయన ఇచ్చిన హామీలనే ఇప్పుడు మీరు ఇస్తున్నారు..’ అంటూ ప్రతిపక్ష నేతను కడిగిపారేశారు.
భూమి లేని నిరుపేదలకు ఎకరా భూమి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీలను షర్మిల జనం ముందుకు తీసుకెళుతున్నారు. భూమి లేని నిరుపేదలకు ఎక రా భూమి, రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతోపాటు పిల్లలను బడికి పంపించే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 500, ఇంటర్ విద్యార్థులు ఉన్న తల్లులకు రూ. 700, డిగ్రీ చదివే విద్యార్థులున్న తల్లులకు రూ. 1,000 వారి ఖాతాలో వేస్తామని ప్లీనరీ నిర్ణయాలను గుర్తుచేశారు. కోటి ఎకరాలకు సాగునీరు, రాష్ట్రంలో గుడిసే లేకుండా ప్రతి ఒక్కరికీ ఇల్లు వైఎస్ కల అని, వీటిని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నెరవే రుస్తాడని హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: