కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకు పరాకాష్ట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకు పరాకాష్ట

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకు పరాకాష్ట

Written By news on Friday, October 5, 2012 | 10/05/2012


*బాబు లేఖ, ఈడీ అటాచ్‌మెంట్‌పై వైఎస్ విజయమ్మ, షర్మిల
*నేడు జగన్ బెయిల్ పిటిషన్ విచారణ.. అంతలోనే కొత్త నాటకం
*ఇది కచ్చితంగా కోర్టులను ప్రభావితం చేసే ప్రయత్నమే
*టీడీపీ ఎంపీలు చిదంబరాన్ని కలవగానే ఈడీ నోటీసులొచ్చాయి
*‘రెండు కాంగ్రెస్‌లు’ కుమ్మక్కయ్యాయని బాబు ఆరోపిస్తున్నారు
*ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలు చూస్తూనే ఉన్నారు
*జగన్‌ను జైల్లో ఉంచి బాబు పాదయాత్ర, కిరణ్ ఇందిరమ్మ బాట
*జగన్ బయటకొస్తే వాళ్ల యాత్రలకు ఇబ్బందనుకుంటున్నారేమో!
*ఇంకా ఎన్ని రోజులు జైల్లో పెడతారు? ఎన్ని చార్జిషీట్లు వేస్తారు?
*రూ. 21.5 కోట్ల లబ్ధికి రూ. 29.50 కోట్ల పెట్టుబడులా?
*ఈడీ వాదన ఎంత హాస్యాస్పదమో సామాన్యుడికీ తెలుస్తోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు నోటీసులు జారీ చేయడంపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనగా ఒక రోజు ముందు ఇలా అటాచ్‌మెంట్ చేయడం వెనుక కుట్ర ఉందని ఆమె విమర్శించారు.

గురువారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసి ‘సాక్షి’ ఆస్తులు అటాచ్‌మెంట్ చేయాలని కోరడం, ఆ వెంటనే అటాచ్‌మెంట్ అంటూ ఈడీ నోటీసులివ్వడం.. టీడీపీ, కాంగ్రెస్‌ల కుట్రకాక మరేమిటని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు జారీ అయిన తరువాత గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ఆమె తన కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను ఇంకా ఎన్నాళ్లు జైల్లో పెడతారు? ఎన్ని చార్జిషీట్లు వేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి జగన్‌ను రాజకీయంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. షర్మిల ఆంగ్లంలో మాట్లాడుతూ.. హెటెరో, అరబిందో కంపెనీలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అక్రమంగా రూ.21.5 కోట్లు లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిఫలంగా వారు జగన్ కంపెనీల్లో రూ.29.50 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఈడీ చెబుతోందన్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? రూ.21.50 కోట్ల లబ్ధి చేకూరిస్తే ఎవరైనా రూ.29.5 కోట్లు పెట్టుబడి పెడతారా? అని ఆమె ప్రశ్నిం చారు. విజయమ్మ, షర్మిల వ్యాఖ్యలు వారి మాటల్లోనే..

బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారీ..: విజయమ్మ

‘‘రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం నలుమూలలా వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని ప్రేమించే వారందరూ కూడా జగన్ బాబుకు బెయిల్ రావాలని ప్రార్థనలు చేస్తున్న తరుణంలో ఇవాళ (గురువారం) సాయంత్రం ‘సాక్షి’ ఆస్తులను అటాచ్‌మెంట్ చేస్తున్నట్లు వార్త వచ్చింది. అసలు ఇంత హడావుడిగా పరిస్థితులన్నిటినీ ఎంతగా మార్చేస్తున్నారు! దీన్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు టీడీపీ ఎంపీలు వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కలిశారు. అటాచ్ చేయాలని 6.30 గంటలకు ఈడీ నోటీసులు పంపింది. చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి రాసిన లేఖ ప్రతిని వాళ్లు చిదంబరానికి ఇచ్చి అటాచ్‌మెంట్ కోరడం... ఆయన ఆదేశాలివ్వడం.. దీన్నంతా ప్రజలు గమనిస్తున్నారు.

రూ.21.5 కోట్ల లబ్ధికి.. రూ.29.5 కోట్ల పెట్టుబడా?

హెటెరో, అరబిందో కంపెనీలకు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు 21.5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేటాయిస్తే అందుకు ప్రతిఫలంగా వాళ్లు జగన్ కంపెనీల్లో 29.5 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ నోటీసుల్లో రాశారు. ఇంతకంటే దారుణమంటుందా? అసలు ఈ రాష్ట్రంలో న్యాయం ఉందా? చట్టం ఉందా? అసలేం జరుగుతోంది. జగన్ కేసులో విచారణ మొదలై దాదాపు 14 నెలలైంది.. ఇదీ తప్పు అని ఒక్క ఆధారాన్నైనా చూపారా? ఇంత వరకూ జగన్ తప్పేమిటో నిరూపించలేకున్నారు. సాధారణంగా చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 90 రోజులకు బెయిల్ పొందే అర్హత లభిస్తుంది. అలాంటిది ఇవాళ్టికి జగన్ జైల్లో ఉండబట్టి 130 రోజులవుతోంది. ఈ రోజుకు కూడా ఆయన తప్పేంటో చెప్పలేని స్థితిలో సీబీఐ ఉంది. మరి ఈరోజు ఎందుకంత హడావుడిగా నోటీసులు జారీ చేశారు?

జగన్‌ను ఊరికే జైల్లో పెట్టారు..

సీబీఐ ఐదు నెలల క్రితం తొలి చార్జిషీటులో చెప్పిన దాన్ని తీసుకుని ఈడీ నోటీసులు ఇచ్చింది. అసలు ఏం జరుగుతోంది? ఎపుడు బెయిల్ కోసం పిటిషన్ వేసినా వెంటనే చార్జిషీటు పెడతారు. సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తారు. ఇంకా ఎన్ని చార్జిషీట్లు వేస్తారు!? ఎన్ని రోజులు విచారణ చేస్తారు? పది నెలలు జగన్‌బాబు బయట ఉన్నప్పుడు ఆయన ఎవరిని ప్రభావితం చేశారు? ఎవరినో ప్రభావితం చేస్తారని ఆయన్ను లోపల పెట్టారు. అక్కడ విచారణ జరుగుతున్నది కూడా ఏమీ లేదు. ఈడీ వారు వెళ్లి రెండు రోజులు విచారించారు, అంతకు ముందు సీబీఐ వారం రోజుల పాటు విచారించింది. ఆ తరువాత ఎలాంటి విచారణా లేకుండా ఊరికే జైల్లో పెట్టారు.

ఈ రోజే ఏం కుట్ర ఉందో?

ఆ రోజు ఎన్నికల కోసం జగన్ బాబును అరెస్టు చేసి జైల్లో ఉంచారు. మళ్లీ ఈరోజు టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోయి ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. వీరిద్దరూ కుమ్మక్కు అయి జగన్‌ను జైల్లో ఉంచి... చంద్రబాబు ఓ వైపు పాదయాత్ర చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రి మరోవైపు ఇందిరమ్మ బాట చేస్తున్నారు. పైగా ఆ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ కుమ్మక్కైందని మాట్లాడుతున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారు? ఎవరు చెప్పినట్లు ఎవరు వింటున్నారు? ఎవరు ఎవరిని కలుస్తున్నారు? ఎవరు చెబితే ప్రభుత్వం వింటోంది.. ప్రజలు అంతా చూస్తున్నారు. ఈ రోజు టీడీపీ ఎంపీలు చెప్పగానే ఈడీ నుంచి నోటీసులొచ్చాయి.

కోర్టులను ప్రభావితం చేసే యత్నం..

జగన్ బాబుకు బెయిల్ తప్పకుండా వస్తుందనుకుంటున్న తరుణంలో కోర్టులను ప్రభావితం చేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు. మొన్న కూడా అంతే. సీబీఐ తన లాయర్లను మార్చినపుడు మాపైనే దుష్ర్పచారం చేశారు. ఈ పరిణామాలతో నే నేమీ భయపడటం లేదు. కానీ ప్రజలకు జరుగుతున్నదేమిటో తెలపాలి. జగన్ ఏ తప్పూ చేయలేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు ఏ తప్పూ చేయలేదు. వైఎస్ గారు తప్పు చేశారని చెప్పగలరా? ఇవాళ మంత్రులే చెబుతున్నారు కదా, నిర్ణయాలన్నీ సమిష్టివేనని. కానీ వాళ్లు బయట ఉన్నారు, జగన్‌బాబు లోపల ఉన్నారు.

అసలు జగన్‌కు ఏం సంబంధం? ఆయన అపుడేమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా, మంత్రిగా ఉన్నారా? ఐదు సంవత్సరాలు(2004-2009) ఆయన ఏ పదవిలోనూ లేరు. ఆయన ఎంపీ అయ్యాక ఒక్క జీవో కూడా రాలేదు. జీవోలన్నీ అంతకు ముందు వచ్చినవే! 26 జీవోల మాటేమిటి? వాటిపై విచారణ జరిగిందీ లేదు, ఏమీ లేదు. ఆ రోజే ప్రభుత్వం వాటిపై సమాధానం చెప్పి ఉండాల్సిందని మంత్రులు కూడా అంటున్నారు. సంబంధం లేని జగన్‌ను లోపలికి పంపారు. కానీ, నేను దేవుడిని నమ్ముతున్నాను. జరిగేది రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. దేవుడున్నాడు, న్యాయం జరుగతుంది. కోర్టులను, న్యాయాధిపతులను నమ్ముతున్నాను. తప్పకుండా దేవుడు నా బిడ్డను బయటకు తెస్తాడు.

ఈడీ నోటీసులు హాస్యాస్పదం: షర్మిల

నా సోదరుడు వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సాక్షి ఆస్తులను అటాచ్ చేయాలనుకుంటున్నట్లు ఈడీ నుంచి మాకు నోటీసులు అందాయి. హెటిరో, అరబిందో ఫార్మా సంస్థలకు మా తండ్రి గారైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి 21.50 కోట్ల రూపాయల మేరకు అక్రమంగా.. (అక్రమంగా అని ఈడీ చెప్తోంది) లబ్ధి చేకూర్చినందుకు వారు ఆయన కుమారుడి కంపెనీల్లో రూ. 29.50 కోట్ల పెట్టుబడులు పెట్టారని నోటీసులో పేర్కొన్నారు. ఎవరికైనా 21.50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిస్తే వారు 29.50 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతారా? దీన్ని బట్టే తెలుస్తోంది ఈ అటాచ్‌మెంట్ నోటీసు ఎంతటి హాస్యాస్పదమైనదో. హెటిరో, అరబిందో రెండూ కూడా దేశంలోనే పేరు మోసిన ఔషధ కంపెనీలనేది అందరికీ తెలుసు. వాళ్లు సాక్షిలో తమ షేర్లను పెట్టుబడులుగానే పెట్టారు. మేం షేర్లను అమ్మితే వారు కొనుగోలు చేయలేదు. ఈ సంస్థల్లో మా పెట్టుబడులు షేర్లుగా ఎలా పెట్టామో, వారూ అలాగే పెట్టుబడులు పెట్టారంతే! దీన్ని ఈడీ అక్రమంగా ఎలా పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడంలేదు.

చంద్రబాబును ఒక్కసారైనా ప్రశ్నించారా?

జగన్ ఆస్తులపై విచారణ జరుపుతున్న సమయంలోనే ఎమ్మార్ వ్యవహారాన్ని కూడా సీబీఐ విచారిస్తోంది. ఎమ్మార్‌కు కేటాయించిన భూములకు సమీపంలోనే చంద్రబాబునాయుడు సతీమణికి ఉన్న భూమిని ఎకరా కోటి రూపాయల చొప్పున అమ్మారు. ఆ తరువాత మూడేళ్లకు (ఎమ్మార్‌కు భూమి కేటాయించే నాటికి) అక్కడ అదే భూమి ధర ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఆమె విక్రయించిన మూడేళ్ల తర్వాత అక్కడే చంద్రబాబునాయుడు ఎకరా 29 లక్షల రూపాయల చొప్పున చౌక ధర కు వందల ఎకరాలను ఎమ్మార్‌కు కేటాయించారు. ఇంత తక్కువ ధరకు భూమిని ఎమ్మార్‌కు కేటాయించిన చంద్రబాబును సీబీఐ కనీసం ప్రశ్నించలేదు. విచారణకు పిలువలేదు, ఎందుకు? పైగా ఈ కేసును ముగించడానికి, ఈ కేసు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన తప్పించుకోవడానికి సీబీఐ రంగం సిద్ధం చేసింది.

అంతే కాదు, చంద్రబాబు ఐఎంజీ సంస్థకు నగరం నడిబొడ్డున ఎకరా 50 వేల రూపాయల చొప్పున కారు చౌక ధరకు వందలాది ఎకరాల భూమిని కేటాయించారు. ఈ విషయంలో అసలు చంద్రబాబును సీబీఐ ప్రశ్నించనేలేదు. కానీ, మానాన్న మన మధ్య లేరు కనుక, ఆయన తిరిగి వచ్చి సమాధానం చెప్పుకోలేరు కనుక ఆయనపై నిందలు వేస్తున్నారు. ఇదీ ఒక అంకిత భావంతో పనిచేసిన రాజనీతిజ్ఞుడి పట్ల వ్యవహరిస్తున్న తీరు!

జగన్‌ను అణగదొక్కడానికి టీడీపీ, కాంగ్రెస్ కుట్ర..

టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరాన్ని కలిశారు. అనధికారికంగా తెలిసిందేమిటంటే అక్కడ వారు చంద్రబాబుతో చిదంబరాన్ని ఫోన్లో మాట్లాడించారు. వారి విజ్ఞప్తి మేరకు చిదంబరం వెంటనే తన శాఖ అధీనంలోనే ఉన్న ఈడీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత కొద్ది గంటలకే మాకు ఈడీ నోటీసులు అందాయి. టీడీపీ, కాంగ్రెస్ జగన్‌ను అణగదొక్కాలని ఎంత దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి అర్థం అవుతోంది. జగన్ ఎదుగుదలను అడ్డుకోవడానికి, రాజకీయ దృశ్యం నుంచి ఆయనను తప్పించడానికి వారెంత నీచ స్థాయికి దిగజారుతారో తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కాదు.

బెయిల్‌కు ఒక్క రోజు ముందు...

జగన్ బెయిల్ శుక్రవారం విచారణకు వస్తుందనగా.. ఒక్కటంటే ఒక్క రోజు ముందుగా వారిలా చేసి న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు వారాల క్రితం బెయిల్ పిటిషన్ విచారణకొచ్చినపుడు సీబీఐ తన న్యాయవాదులను జగన్ కేసులో మార్చినపుడు పెద్ద రాద్ధాంతం చేశారు. వారం రోజుల క్రితం బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడు.. న్యాయవాదులు కొత్త కనుక వాదనలకు సిద్ధంగా లేరని వాయిదా తీసుకున్నారు. ఇపుడు బెయిల్ విచారణకు ఒక్క రోజు ముందు ఇలా దిగజారారు. ఇక్కడ మేం చెప్పదల్చుకున్నది ఒక్కటే టీడీపీ, కాంగ్రెస్ ఎలా కుమ్మక్కు అయి పనిచేస్తున్నాయనేదే. జగన్‌ను అణగదొక్కాలని వారెంత నీచంగా వ్యవహరిస్తున్నారో చూడండి. అయినప్పటికీ మాకు దేవునిపై పూర్తి నమ్మకం ఉంది. బయట కోట్ల మంది ప్రజలు జగన్ విడుదల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్ నిర్దోషి అని ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వారంతా బల్లగుద్ది చెప్పారు. జగన్‌పై వారికి పూర్తిగా నమ్మకం ఉంది. న్యాయవ్యవస్థ ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు ప్రభావితం కాదని మేం నమ్ముతున్నాం. మేం కోరుకుంటున్నది విచారణ నిష్పాక్షికంగా జరిగి న్యాయం జరగాలని మాత్రమే!
Share this article :

0 comments: