కుమ్మక్కయ్యేవారు బాబులా రహస్యంగా కలుస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుమ్మక్కయ్యేవారు బాబులా రహస్యంగా కలుస్తారు

కుమ్మక్కయ్యేవారు బాబులా రహస్యంగా కలుస్తారు

Written By news on Wednesday, October 10, 2012 | 10/10/2012


ప్రజాదరణ లేక గందరగోళంలో ఉన్న టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌తో వైఎస్సార్ సీపీ విలీనం అయిపోతోందంటూ దిగజారుడు ఆరోపణలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ప్రజాదరణలో మూడో స్థానంలో ఉన్న చంద్రబాబును కనీసం రెండో స్థానానికైనా తెచ్చుకుందామనే ఎత్తుగడతో విలీనం వదంతులు పుట్టిస్తున్నారన్నారు. అశేష ప్రజాదరణతో మొన్నటి ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తమ పార్టీకి మరో పార్టీతో విలీనమయ్యే అవసరం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ‘వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ నివాసం గేటు దగ్గర ఇది వరకు పార్టీ జెండా ఉండేదట. అది ఇప్పుడు కనపడ్డం లేదట... కాంగ్రెస్‌లో విలీనం చేయడానికే జెండాను తీసేశారట... జగన్ ఇంట్లో ఫ్యాన్ తీసేసి ఏసీ బిగించుకున్నారట. ఫ్యాన్ లేదు కాబట్టి విలీనం అయిపోతారట...’ అంటూ టీడీపీ నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

చదవేస్తే ఉన్న మతీ పోయిందన్న రీతిలో టీడీపీ నాయకుడు దాడి వీరభద్రరావు చేసిన ఈ విమర్శలను చూస్తే ఆయన స్థాయి తప్పి మాట్లాడుతున్నారనిపిస్తుందని అంబటి అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలున్నా ప్రతిపక్ష పార్టీగా వాటి జోలికి పోకుండా జగన్ ఇంటికి ఏ రంగులేశారు, జెండా ఎలా ఉంది అని ఇంత తీక్షణంగా టీడీపీ పరిశీలిస్తోందంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే వారెంత భయపడి పోతున్నారో అర్థమవుతోందని అంబటి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మర్యాదపూర్వకంగా కలిసినందుకు టీడీపీ నేతలు రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. విజయమ్మ, రాష్ట్రపతిని కలిసినా, ప్రధానిని కలిసినా బహిరంగంగానే కలిశారని, దాపరికం ఏమీ లేదన్నారు. చంద్రబాబు మాదిరిగా రహస్యంగా కలవలేదని రాంబాబు దెప్పిపొడిచారు. 

చంద్రబాబు ప్రధాని వద్దకు ఎంపీలతో కలిసి వెళ్లినపుడు అందరి సమక్షంలో ఒకసారి, విడిగా ఎవరూ లేకుండా 3, 4 నిమిషాలు మరోసారి కలిసి అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతునిస్తామనే నీచమైన ఆలోచనలు కూడా చేశారని.. అలాంటివి తమ పార్టీ చేయదని అంబటి స్పష్టంచేశారు. కుమ్మక్కయ్యే వారు బహిరంగంగా కలుస్తారా! కుమ్మక్కయ్యే వారు బాబులాగా కలుస్తారు గానీ... అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జగన్ నివాసం వద్ద జెండా లేదని ఓ పత్రిక రాస్తే దాన్ని పట్టుకుని టీడీపీ యాగీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ వర్గం మీడియా ఇష్టానుసారం వ్యతిరేక వార్తలు రాస్తూ ఉందని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాంటివాటిని ప్రజలు పట్టించుకుని ఉంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపించి ఉండే వారే కాదన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్న వలసలను ప్రస్తావించగా ‘బాబు పాదయాత్ర 50 కి.మీ పూర్తి కాగానే ఒక నాయకుడు వచ్చారు.. 100 కి.మీ పూర్తి కాగానే ఇద్దరు వచ్చారు... 200 పూర్తయ్యేటప్పటికి నలుగురు వస్తారు... ఇలా ఆయన యాత్ర పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటారు’ అని అన్నారు. తమ పార్టీ తరపున పాదయాత్ర ఉంటుందా, ఉంటే ఎవరు చేస్తారనేది బుధవారం జరిగే పార్టీ సీజీసీ, సీఈసీ సంయుక్త సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు.
Share this article :

0 comments: