పాఠకులకు విన్నపం (sakshi) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాఠకులకు విన్నపం (sakshi)

పాఠకులకు విన్నపం (sakshi)

Written By news on Friday, October 19, 2012 | 10/19/2012

మీ అందరి దీవెనలతో నాలుగున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన నాటినుంచీ ‘సాక్షి’ నిఖార్సయిన వార్తలకు, నిష్పాక్షికమైన వ్యాఖ్యలకు పెట్టింది పేరయింది. మీ కుటుంబ ఆత్మీయ నేస్తమయింది. సమాజ శ్రేయస్సుకు, తెలుగు కుటుంబాల సౌభాగ్యానికీ, మనో వికాసానికి ఊపిరులూదింది. ప్రభుత్వపరంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా, అధికారంలో ఉన్నవారు ఎంతగా ఇబ్బందులు పెడుతున్నా మీ అందరి సహకారంతో, మీ అందరి అండదండలతో వాటన్నిటినీ తట్టుకుంటూ... నమ్మిన విలువల విషయంలో రాజీపడకుండా ఆరంభమైన రోజునుంచీ అనునిత్యం దేవుని దయతో, మీ అందరి దీవెనలతో పురోగమిస్తూనే ఉంది. 

ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా అయితేనేమి, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల అయితేనేమి.. ద్రవ్యోల్బణం అన్ని రంగాలనూ కుంగదీస్తోంది. అన్నింటి ధరలూ చుక్కలనంటాయి. ఎంతగానంటే... హైదరాబాద్‌లో కప్పు టీ ధర రూ.10కి చేరుకుంది. ద్రవ్యోల్బణమూ, నిలకడగా లేని రూపాయి.. న్యూస్‌ప్రింట్ ధరలో ఎగుడు దిగుళ్లను సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరెంటుకోత డీజిల్ వాడక తప్పని పరిస్థితులు కల్పిస్తే... దాని ధర సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇతరత్రా ఖర్చులపై కూడా దాని ప్రభావం పడింది. ఫలితంగా నిర్వహణా వ్యయం సైతం అమితంగా పెరిగింది. పత్రికా నిర్వహణ మోయలేని భారంగా మారింది.

పత్రికా సంస్థల ప్రతినిధులంతా వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వార్తాపత్రికల ధరను పెంచడం తప్ప మరో మార్గం లేదని అన్నప్పుడు అందరితో పాటు మనం కూడా గళం కలపవలసి వస్తుండటం నాకు చాలా బాధ కలిగించింది. కష్టం అనిపించింది. ఎందుకంటే.. జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమై వ్యాపారాల కోసం సమయం కేటాయించలేని పరిస్థితుల్లో, దాదాపు రెండేళ్ల క్రితం నేను ఈ పత్రికను నడిపే బాధ్యతను స్వీకరించాను. అప్పటికే జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో ఆ వెంటనే కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. ఆదాయ పన్ను నోటీసులు ఇచ్చారు. కోర్టు కేసులు వేశారు. సీబీఐని రంగంలోకి దింపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేత కూడా విచారణ కొనసాగించారు. కనీవినీ ఎరుగని విధంగా...బహుశా దేశంలోనే మొదటిసారి షేర్లపై వచ్చిన ప్రీమియంపై పన్ను కట్టాల్సిందిగా ఆదాయ పన్ను అధికారులు ‘సాక్షి’కి నోటీసులు ఇచ్చారు. 

ఇవాళ చంద్రబాబు మొదలుకొని రామోజీరావు వరకూ...జీఎంఆర్ నుంచి జీవీకే, అంబానీ వంటి దిగ్గజాల వరకూ ఎవరైనా వారి వారి కంపెనీల షేర్లను ప్రీమియంకు అమ్మినప్పుడు వాటిని ఆదాయ పన్ను విభాగం మూలధన వసూళ్లు (కేపిటల్ రిసీట్స్)గానే పరిగణించి ఆయా సంస్థలకు గతంలో ఎప్పుడూ నోటీసులు కూడా ఇవ్వలేదు. కానీ, ‘సాక్షి’తో మాత్రం అధికారులు చెలగాటం ఆడుతూ ఇప్పటికే మాచేత బలవంతంగా రూ.40 కోట్ల మేరకు కట్టించారు. దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్నాం. మరోవైపు ఈడీని ఎగదోస్తూ ‘సాక్షి’ ఆస్తులను జప్తు చేయిస్తున్న సంగతీ తెలిసిందే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ‘ఈనాడు’ రూ.100 విలువైన షేర్లను ఒక్కొక్కటి రూ.5,28,630 చొప్పున ప్రీమియంకు అమ్మితే, ‘సాక్షి’ రూ.10 విలువగల షేర్లను ఒక్కొక్కటి రూ.350 చొప్పున ప్రీమియంకు అమ్మింది. ఆ షేర్లను కూడా ఒక్కొక్కరికి ఒక్కో ధరకు కాకుండా అందరికీ ఒకే ధరకు అమ్మడం జరిగింది. 

‘సాక్షి’ ఖాతాలను సీబీఐ స్తంభింపజేసినప్పుడు పత్రిక నడపడానికి, సిబ్బంది జీతాలకు ఇబ్బంది వస్తుందని కోర్టుల వరకూ వెళ్లి పోరాడవలసి వచ్చింది. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టదల్చుకున్నవారిని సీబీఐ భయభ్రాంతులను చేస్తోంది. బ్యాంకులు సైతం రుణాలిచ్చేందుకు వెనకడుగువేస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వమేమో ‘సాక్షి’కి వాణిజ్య ప్రకటనలు ఇవ్వొద్దంటూ ఏకంగా జీవోలే జారీ చేస్తోంది. ఆ జీవోలపై కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్నాము. ఇన్ని పోరాటాల మధ్య, ఇంతటి వ్యతిరేక పరిస్థితుల మధ్య... వీటికి తోడు అమాంతం పెరిగిపోయిన నిర్వహణా వ్యయం వల్ల గత్యంతరంలేని పరిస్థితుల్లో మేము కూడా మిగిలినవారితో గళం కలపక తప్పలేదు. ఇక్కడ మీ అందరికీ కొన్ని విషయాలు విన్నవించాలి. ‘సాక్షి’లో ఏనాడూ జగన్‌కానీ, నేనుగానీ కనీసం ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. షేర్లు అమ్మిన విలువ కూడా ‘సాక్షి’ సంస్థలోనే ఉంది. ఏజెంట్ల నుంచి పత్రికను ఇంటింటికీ చేర్చే పేపర్ బాయ్ వరకూ, విలేకరుల నుంచి సబ్ ఎడిటర్‌ల వరకూ, ఆ పత్రికను బయటకు తీసే చిన్న కార్మికుడి వరకూ.. ‘సాక్షి’పై ఆధారపడే కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30,000 పైనే.

సాధారణ పరిస్థితుల్లోనే వార్తా పత్రిక ప్రచురణకయ్యే ఖర్చు దాని అమ్మకం విలువకంటే చాలా ఎక్కువ. వార్తాపత్రికలను పాఠకులకు అందించేది సబ్సిడీపైనే. సమాచారాన్ని సాధ్యమైనంత తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా అందించాలన్న మా సంకల్పానికి... ప్రత్యేకించి మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న వేధింపులతో పాటు ఇతర పరిణామాలు అవరోధంగా నిలిచాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో.. ఈ అనూహ్య భారంలో కొంత మొత్తాన్ని మిగిలిన దినపత్రికలతో పాటు మేము కూడా పాఠక సోదరులకు పంచక తప్పడం లేదు. ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల్ని సహృదయంతో, పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని, ‘సాక్షి’ని ఎప్పటిలా మీ కుటుంబ భాగస్వామిగా, మీ బిడ్డగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

మీ....
వై.ఎస్. భారతి,
చైర్‌పర్సన్, ‘సాక్షి’ 

ఇకపై రోజూ సాక్షి పత్రిక ధర నాలుగు రూపాయలు ఉంటుంది.
శనివారం నుంచి ఈ ధర అమలులోకి వస్తుంది. ప్రత్యేక అనుబంధం
వచ్చే ఆదివారం సంచిక వెల మాత్రం ఐదు రూపాయలు.

పాఠక మహాశయులు గమనించగలరు.0
Share this article :

0 comments: