పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు

పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు

Written By news on Friday, November 2, 2012 | 11/02/2012

Written by Srinu On 11/2/2012 3:25:00 AM
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు మన పెద్దోళ్లు. పాలకులు ఉన్న పవర్ అంటువంటి మరి. ప్రభువులు కన్నెర్ర చేస్తే ఎంతటివారి అడ్రస్ అయినా గల్లంతవాల్సిందే. పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు. తమను ప్రశ్నించినా, ఎదరించి నిలబడి వారిని చూస్తే ఏలికలకు చిర్రెత్తుకొస్తుంది. నటనలో ఆస్కార్‌కు ఏమాత్రం తీసిపోని నేతలు ఇలాంటి సమయాల్లోనే తమ ‘చాతుర్యం’ చూపుతారు. తమకు చుట్టంగా సేవలందిస్తున్న చట్టానికి పనిచెబుతారు. తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వాడికి చుక్కలు చూపిస్తారు. అప్పుడే కదా పాలకుల ‘విలువ’ సామాన్యులకు తెలిసేది.

సమయం చిక్కాలేకానీ తమకు తెలిసిన ‘విద్య’ను ప్రదర్శించేందుకు ప్రభువులు వెనుకాడరు. కేంద్రంలోని ప్రగతిశీల సర్కారులో విత్త మంత్రిగా కొలువు వెలగబెడుతున్న కాంగ్రెస్ నేత పళనియప్పన్ చిదంబరం తన చాణక్యాన్ని చాటారు. తన సుపుత్రుడు కార్తీ చిదంబరంపై సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లో ఆరోపణలు చేసిన ఓ అనామకుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ట్విటర్‌లో తన కుమారుడిపై ఆరోపణలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యకర్త, పాండిచ్చేరికి చెందిన చిరువ్యాపారి రవి శ్రీనివాసన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేలా చక్రం తిప్పారు. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష పడేలా కేసు నమోదు చేయించారు.

ఇంతకీ శ్రీనివాసన్ చేసిన నేరం ఏమిటంటే ‘‘సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంటే కార్తీ చిదంబరం అధిక సంపద పోగేశారు’’ ట్విటర్‌లో పోస్ట్ చేయడమే. విత్తమంత్రి కుమారుడు ఇచ్చిన ఈ-మెయిల్ ఫిర్యాదుతో ఆగమేఘాల కదలిన ఖాకీలు శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేసి స్వామిభక్తి చాటుకున్నారు. విశేషమేమిటంటే 45 ఏళ్ల శ్రీనివాసన్‌కు ట్విటర్‌లో కేవలం 16 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. సీబీసీఐడీ అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ తనను అరెస్ట్ చేశారని నిందితుడు వాపోయాడు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తుడు. పాలకులతో పెట్టుకోడమే అతడు చేసిన తప్పా?

అన్నివైపుల నుంచి దూసుకువస్తున్నఅవినీతి ఆరోపణలతో ‘హస్తం’ పార్టీ నేతలు సతమవుతున్నారు. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉద్యమకారులు గుప్పిస్తున్న ఆరోపణాస్త్రాలు ఎదుర్కొలేక ఇరిటేట్ అవుతున్నారు. ఉద్యమ నేతలను ఏమీ చేయలేకపోతున్న ఏలికలు సామాన్యులపై తమ ‘ప్రతాపం’ చూపుతున్నారు. శ్రీనివాసన్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. దినపత్రికల్లో తాను చ దివిన వాటినే ట్విటర్‌లో పోస్ట్ చేశానని, తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని శ్రీనివాసన్ సంధిస్తున్న ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు.

అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని బట్టే అర్థమవుతుంది దీనివెనుకున్న చిదంబర రహస్యం. దీనిబట్టి చూస్తే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్(ఐఏసీ) కార్యకర్తలను టార్గెట్ చే శారన్న శంక కలుగుతోంది. కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచిన ఐఏసీ కార్యకర్తల దూకుడుకు కళ్లెం వేసేందుకు పాలకులు పన్నాగం పన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల బెదిరింపులకు తాను భయపడనని, తనకు కావాల్సిందల్లా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల నైతిక మద్దతు మాత్రమేనని శ్రీనివాసన్ అంటున్నాడు. ‘పవర్’కు భయపడని వాడు ఎవరికి తలవంచడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51830&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: