సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం

Written By news on Friday, November 2, 2012 | 11/02/2012

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం
పేదల గుండెల్లో జగన్ స్థానం సంపాదించుకున్నందుకే కుట్ర చేశారు
అన్న బయట ఉంటే మీకూ, టీడీపీకి ఉనికి ఉండదనే మీ భయం
జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే కష్టాలు ఉండేవి కావని కాంగ్రెస్ నాయకుడు ఆజాదే చెప్పారు
అంటే కావాలనే జైల్లో పెట్టారనే కదా?
జగన్ ఏ తప్పూ చేయలేదని ధైర్యంగా చెప్తున్నాం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 15, కిలోమీటర్లు: 201.30

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్ ఎవరి కోసం జైలుకెళ్లాడు? ప్రజల కోసమా? మహిళల కోసమా? రైతుల కోసమా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఆయనకు ఇదే నా సమాధానం. అవును.. జగనన్న రైతుల కోసం పోరాడారు. పేద ప్రజల కోసం పోరాడారు. విద్యార్థుల కోసం పోరాడారు. మహిళల కోసం పోరాడారు. చేనేత కార్మికుల కోసం పోరాడారు. అలా పోరాడడం వల్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే మీరు జైలులో పెట్టారు. అలా పోరాడడం వల్ల మీకు, టీడీపీకి స్థానం ఉండదనే, ఉనికి కోల్పోతారనే మీరు జైలులో పెట్టారు. నీచమైన కుట్రకు పాల్పడ్డారు.

సీబీఐని వాడుకున్నారు. గుండెల మీద చేయి వేసుకుని మీరు నిజం చెప్పలేరు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 15వ రోజు గురువారం పాదయాత్రలో భాగంగా ఆమె అనంతపురం జిల్లా జల్లిపల్లిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆజాద్ పబ్లిక్ మీటింగ్‌లోనే చెప్పారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావని అన్నారు. అంటే దానర్థం ఏమిటి? కావాలనే జైలులో పెట్టారనే కదా? కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారనే కదా దాని అర్థం. రాజన్న కుటుంబం ఈరోజు ఒక మాట చెబుతోంది. జగనన్న ఏ తప్పూ చేయలేదు. ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక రోజు వస్తుంది. ఆరోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు జగనన్న తప్పకుండా బయటకు వస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి..’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చేశానని చంద్రబాబు చెప్పలేరు.. 

‘చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఉండి ఏం చేశారు? చేసింది చెప్పుకొనే ధైర్యం లేదు. ప్రజల కోసం ఫలానా మంచి పనిచేశానని చెప్పగలరా? కానీ ఇప్పుడు మళ్లీ అధికారం కావాలట. పాదయాత్రలంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. ప్రజలు అమాయకులేమీ కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చివాళ్లేం కాదు. చంద్రబాబుకు లేనిది, రాజన్నకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజం. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత. బాబుకు పాదయాత్ర అవసరం లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన అవిశ్వాసం పెట్టరట..’ అని షర్మిల.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.


బీమా ఇవ్వడం లేదు..

ఉదయం 11.30కు ముద్దలాపురంలో శంకర్ అనే రైతుకు చెందిన వేరుశనగ చేనును షర్మిల పరిశీలించారు. చెట్లు తీశామని, కానీ చెట్టుకు రెండు మూడు కాయలే ఉన్నాయని ఆ రైతు వాపోయారు. ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. ‘వర్షాధారంగా ఈ పంట పండిస్తున్నాం. ఏటా పెట్టుబడులు నష్టపోతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 4 ఏళ్లు పంట పండింది. పంట పండని సమయంలో ఇన్సూరెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు వాతావరణ బీమా పేరుతో మండలం యూనిట్‌గా చేసి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదమ్మా’ అని శంకర్ వాపోయారు.

రోడ్డు వేయించండమ్మా...

మామూలుగా అయితే రోడ్లు వేయించాలని, కుళాయిలు ఇప్పించాలని ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని, అధికార పార్టీ నేతల్ని అడుగుతారు. ఐతే ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఉన్న ప్రజలు.. పాదయాత్రలో తమ ఊరికి వస్తున్న షర్మిలకు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నా రు. గురువారం ఉదయం ముద్దలాపురం సమీపంలో గొటుకూరుకు చెందిన వికలాంగుడు హరినాథ్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు గొనంకి లక్ష్మయ్య రోడ్డు పక్కన కూర్చుని షర్మిల రాకకోసం ఎదురుచూస్తూ కనిపించారు. వారి వద్దకు షర్మిల రాగానే ‘నిన్న కలవాలనుకున్నా సాధ్యపడలేదమ్మా.. అందుకే ఇక్కడ కూర్చున్నాం. మా ఊరు వద్ద రోడ్డు గతుకులుగా ఉండడంతో రోడ్డు ప్రమాదం జరిగి నా కాలు పూర్తిగా విరిగిపోయింది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయించండమ్మా’ అని హరినాథ్‌రెడ్డి మొరపెట్టుకున్నారు. రాజన్న రాజ్యంలో మీ కోరికలన్నీ నెరవేరతాయని షర్మిల భరోసా ఇచ్చారు. లక్ష్మయ్య మాట్లాడుతూ.. వైఎస్ తనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికిఇక్కడిదాకా వచ్చానన్నారు. ‘నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. కానీ మళ్లీ చేయాల్సి వచ్చింది. అప్పుడు వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ నాకు వరమైంది. 2 లక్షలతో మళ్లీ ఆపరేషన్ చేయించారు’ అని అన్నారు.

గొర్రె చనిపోతే దిక్కులేదు..

మార్గం మధ్యలో జల్లిపల్లికి చెందిన గొర్రెల కాపరులు ఇటుకలప్ప, పల్లెప్ప గొర్రెలు కాస్తుండగా షర్మిల వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..
షర్మిల : ఏమన్నా.. బతుకుదెరువు ఎలా ఉంది?
కాపరి: మా బాధలేమని చెప్పేది.. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రావడం లేదమ్మా
ఇంతకుముందు వచ్చేదా?

ఇంతకుముందు గొర్రెకు రూ. 18 కడితే.. చనిపోయినప్పుడు రూ.1,000 వచ్చేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.
ఎందుకు రావడం లేదు?

ఏమో అమ్మా. అప్పుడంటే రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాబోటివాళ్లను పట్టించుకున్నారు. ఇప్పుడెవరు పట్టించుకుంటారు? బస్సు కింద పడి 180 గొర్రెలు చనిపోయాయి. కానీ ఒక్కదానికీ పరిహారం రాలేదు. గొర్రెలకేం తెలుసు. అవి ఒక్కటి పోయి రైలు కిందపడితే.. అన్నీ వెళ్లి పడతాయి.

పశువులకు నీళ్లు, మేత ఉన్నాయా?

కాలువ నీళ్లు రావడం లేదట. అప్పటి నుంచి ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. ఈ ప్రాంతంలో కురుమలు ఎక్కువ. గొర్రెలకు నీళ్లు లేవు. అప్పుడప్పుడు పడే చినుకులకు ఈసారి ఇక్కడ మేత దొరుకుతోంది. కానీ మేత దొరకనప్పుడు ఒక్కోసారి వందల కిలోమీటర్ల దూరం అలా మేపుకొంటూ వలస వెళ్లాల్సిందే. చెరువులు నింపితే మాకు కొద్దిగా ప్రయోజనం. ఇప్పటికే తాగునీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు.
జగనన్న సీఎం అయ్యాక మళ్లీ రాజన్న లాగే పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నీటిని తెస్తాడు. ధైర్యంగా ఉండండన్నా..

వర్షంలోనే పాదయాత్ర..

గురువారం పాదయాత్ర ఉదయం వర్షం కారణంగా 11 గంటలకు ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో అదే వర్షంలో పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.. తిరిగి సాయంత్రం కొద్దిసేపు వర్షం కురిసినా.. షర్మిల ఆగకుండా యాత్ర చేశారు. గురువారం మొత్తం షర్మిల 13 కిలోమీటర్ల మేర నడిచి రాత్రి 7.30కు భం భం స్వామి గుట్ట వద్ద టెంట్‌లో బసచేశారు. దీతో ఇప్పటివరకు పాదయాత్ర 201.30 కిలోమీటర్లు పూర్తయింది. గురువారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, వైఎస్సార్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉరవకొండ పార్టీ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొల్లి నిర్మల కుమారి, వాసిరెడ్డి పద్మ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: