మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయితీ వైపు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయితీ వైపు..

మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయితీ వైపు..

Written By news on Tuesday, November 20, 2012 | 11/20/2012

బాబు కుమ్మక్కు కుట్రలు చూడలేక, ఆయనపై నమ్మకం లేక వారంతా మా పార్టీలో చేరుతున్నారు
ఎప్పుడూ నిజం చెప్పలేని చంద్రబాబు దీనిపైనా అబద్ధాలాడుతున్నారు
మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు బాబూ.. వారిని కొనే అనుభవం మీకే ఉంది..
మీరు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు కాబట్టే అవిశ్వాసం పెట్టడంలేదు.. పీసీసీ చీఫ్ బొత్స ఒక డాన్
కిరణ్‌కుమార్‌రెడ్డిది అసమర్థ పరిపాలన అని వారి ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్నారు

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 33, కిలోమీటర్లు: 436.10
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా చంద్రబాబు నాయుడూ.. మీ కుమ్మక్కు రాజకీయాలు చూడలేక, మీ మీద నమ్మకం లేకనే మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. వాళ్లకు మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయతీ పక్షాన నిలబడాలనుకున్నారు. అందుకే.. జగనన్నకు అండగా నిలబడుతున్నారు. జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేని మీరు ఈ నిజాన్ని దాచిపెట్టి మేం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. 

చంద్రబాబూ.. మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనుభవం.. రహస్య ఒప్పందాలు చేసుకునే చరిత్ర మీకే ఉంది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానిపై అవిశ్వాసం పెట్టకుండా అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 33వ రోజు సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సాగింది. జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినందుకు నిరసనగా గూడూరులో వేలాది మంది ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిల పాదయాత్రలో కదంతొక్కారు. గూడురు సభలో ఆమె ప్రసంగిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబు ఆదివారం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. షర్మిలకు రాజకీయ అనుభవం లేదన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును ఆమె కడిగిపారేశారు.

ఇదా పరిపాలనా దక్షత?

ఉన్న నాయకుణ్ణి, పరిపాలనా దక్షుడిని అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక్క మాట అడుగుతున్నాను.. సూటిగా సమాధానం చెప్పండి. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ పెట్టిన రూ.2 కిలో బియ్యాన్ని రూ.5కు పెంచింది మీరు కాదా? మద్యపాన నిషేధం ఎత్తివేసి గ్రామగ్రామాన బెల్టు దుకాణాలు పెట్టింది మీరు కాదా? ఇదేనా మీ పరిపాలనా దక్షత?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్‌లో బంధించావు. కొందరిని బెదిరించావు, కొందరిని కొన్నావు. ఇదేనా మీకున్న అనుభవం? ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వమే పేదల కష్టాన్ని దోపిడీ చేస్తోంది.ఈ చేతగాని ప్రభుత్వం మాకొద్దుబాబూ అని ప్రజలు మొత్తుకుంటున్నా చంద్రబాబుకు వినపడటం లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దింపేయడానికి కావాల్సినంత బలం ఆయనకున్నప్పటికీ అవిశ్వాసం పెట్టకుండా ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారాయన’’ అని ఆమె నిప్పులు చెరిగారు.

బొత్స ఒక డాన్

‘‘పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక డాన్. బినామీ పేర్లతో ఆయన మద్యం దుకాణాలు తీసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారిస్తున్నారు. దీన్నే అనుభవం అంటారేమో ఆయన చె ప్పాలి. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిది అసమర్థ పరిపాలన అంటున్నారు. రాష్ట్రంలో జల ప్రాజెక్టుల నిర్మాణం కోసం తపించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించక పోవడం ఏ పరిపాలనా దక్షత కిందకు వస్తుందో చెప్పాలి. వీళ్లా మాకు రాజకీయ అనుభవ రాహిత్యం అని విమర్శించేది!!’’ అని షర్మిల మండిపడ్డారు.

మీరు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లరు..

‘‘ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జబ్బుచేస్తే ప్రభుత్వ ఆసుత్రులకు వెళ్లి ఎందుకు వైద్యం చేయించుకోరు? ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, సూదులు ఉండవని వాళ్లకు తెలుసు. చిన్న జబ్బు చేసినా కార్పొరేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటారు. అవసరం అనుకుంటే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. కానీ వీళ్లకు ఓట్లేసిన పేద ప్రజలు కార్పొరేటు అసుపత్రిలో వైద్యం చేయించుకోకూడదట. ప్రతి పేదవాడికీ పెద్ద ఆసుపత్రిలో వైద్యం అందుబాటులోకి రావాలనే తపనతో రాజన్న తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రధానమైన వ్యాధులను ఈ పథకం జాబితా నుంచి తీసేస్తోంది. తరతరాల వెనుక బాటుతనానికి చదువే శాశ్వత పరిష్కారమని రాజన్న పేద విద్యార్థులకు పెద్ద చదువులు చెప్పించడం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చేతకాని పాలకులు ఆ పథకాన్ని మెల్లమెల్లగా అటక ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

33వ రోజు పాదయాత్రలో షర్మిల ఉదయం జూలకల్ నుంచి బయలుదేరారు. గూడూరులో భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గుడిపాడులో రచ్చబండ మీద కూర్చొని మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. జయలక్ష్మి అనే మహిళ తన పసిపాప గుండెకు రంధ్రం పడిందని, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగితే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేయడంతో వైద్య సదుపాయం అందేలా చూడాలని స్థానిక నేతలకు షర్మిల సూచించారు. అక్కడి నుంచి పెంచికలపాడు సమీపంలో ఏర్పాటుచేసిన బసకు రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. సోమవారం 15.20 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 436.10 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది.

ఇతర జిల్లాల నేతల సంఘీభావం

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు రెండవ రోజు కూడా షర్మిలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి మధ్యాహ్నం పాల్గొనగా, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సాయంత్రం షర్మిల వెంట నడిచారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మహిళా నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు.

ఈ సర్కారు ఉంటే.. ఆత్మహత్యే గతి: పత్తి రైతు

‘‘చంద్రబాబు నాయుడూ.. మీరు మాట మాట్లాడితే నేను అనుభవం 
‘‘సాగు చేసి దెబ్బతిన్నాను.. ముక్కాలు ఏడాది నుంచి అప్పులపాలైనా. ఆరు ఎకరాలు ఉంది. అంతా పత్తే వేసినా.. ఎకరాకు రూ.10 వేలు ఖర్చు చేస్తే కరెంటు లేక, వానలు పడక ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి వచ్చింది. 12 కింటాళ్ల పత్తి తీసి అమ్మితే రూ.24 వేలు వచ్చినాయి. ఇంకా రూ.36 వేలు గుంతల పడ్డా. ముక్కాలు ఏడాది నుంచి వడ్డీ అసలు కలిసి రూ.2 లక్షల అప్పైందక్కా. పంటలు చేతికి రాకుంటే ఈ అప్పులు కట్టలేను. జగనన్న వస్తే నాయిన చేసినట్లు అప్పులు తీసేస్తాడు. ఈ సర్కారు కూలిపోవాలక్కా.. జగనన్న వస్తాడనే ఆశతోనే ఇంకా భూమిని నమ్ముకున్నా. ఈ సర్కారు కూలిపోకుంటే.. మా ఇంటిదానికి ఇంత పురుగుల మందుపోసి నేనింత తాగి చావాల్సిందే. అప్పులోళ్లతో ఏగలేనక్కా’’ అంటూ మునగాలకు చెందిన పత్తిరైతు రాజశేఖరరెడ్డి.. షర్మిల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. జగనన్న వచ్చే వరకు ఓపిక పట్టాలని, అంత వరకు ధైర్యం సడలొద్దని షర్మిల ఆ రైతును ఓదార్చారు. మరో ఏడాదిలో రైతన్న రాజ్యమే వస్తుందని, అప్పుడు జగనన్న ప్రతి రైతునూ రాజులా చూసుకుంటారని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: