వైఎస్ పథకాలు, ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి పట్టవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పథకాలు, ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి పట్టవు

వైఎస్ పథకాలు, ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి పట్టవు

Written By news on Tuesday, November 20, 2012 | 11/20/2012

- వారికి సాగు, తాగునీరిచ్చే ఉద్దేశం లేదు
- గురురాఘవేంద్ర ప్రాజెక్టు మహానేత చలువే
- ఏం సాధించారని రఘువీరా పాదయాత్ర 

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ప్రజలకు సాగు, తాగునీరిచ్చే ఆలోచన దుర్మార్గపు కిరణ్ సర్కార్‌కు ఎంతమాత్రం లేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ హయంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను, పథకాలను ఎత్తేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జిల్లాలో శిఖామణి(పులకుర్తి) ఎత్తిపోతల పథకాన్ని ఇదే రీతిన ప్రభుత్వం పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా సోమవారం ఆమె గూడూరు మండలంలోని జూలకల్లు నుంచి పొన్నకల్ క్రాస్, గూడూరు, గుడిపాడు, పెంచికలపాడు వరకు 15.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గూడూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో, వివిధ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీరు అందించే అవకాశం ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా మరుగున పడేస్తుందన్నారు. 

శిఖామణి ఎత్తిపోతల పథకంతో గూడూరు ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలు తీరుతాయని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రూ.150 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఆమోదించి మూడేళ్లయినా నేటికీ అతీగతీ లేదన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును చంద్రబాబు ఎన్నికల కోసం వాడుకొని శిలాఫలకాలు వేస్తే.. వైఎస్ అధికారంలోకి వచ్చి పూర్తి చేశారని గుర్తు చేశారు. ఈ జిల్లా నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి స్థాయిలో ప్రాతినిథ్యం వహించినా ఎవరూ రైతులకు సాగునీరు అందించలేకపోయారన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డి ఒక్కరే రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారన్నారు.

పాదయాత్రకు భారీగా జనం
గూడూరు మండలంలో సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు షర్మిల వెంట ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిలను కలవాలని, ఆమెతో నడుస్తూ ఫొటోలు దిగాలని పోటీ పడ్డారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి తదితరులు షర్మిల పాదయాత్ర ఆద్యంతం ఉన్నారు. సాయంత్రం వచ్చిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి స్థానికులను షర్మిలకు పరిచయం చేస్తూ ముందుకు సాగారు. గూడూరులో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన బహిరంగసభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కా... అన్నా... అమ్మా... తాతా... అని ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తుండడం స్థానికులను ఆకట్టుకుంటోంది. 
Share this article :

0 comments: