విశ్వసనీయతకు వెలకడతారా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయతకు వెలకడతారా!

విశ్వసనీయతకు వెలకడతారా!

Written By news on Tuesday, November 20, 2012 | 11/20/2012

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విజయమ్మ
జగన్ జైల్లో ఉన్నా, అన్ని పార్టీల నాయకులు అభిమానంతో వస్తున్నారు..
ఇదే విశ్వసనీయత అంటే.. ఈ మాటకు అర్థం కూడా బాబుకు తెలియదు
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినందుకు మీకు ఎన్టీఆర్ ఎన్ని కోట్లిచ్చారు?
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీడీపీ ఎమ్మెల్యేలకు మీరెంత ఇచ్చారు?
బాబుది శ్మశానయుగం... జగన్‌తో మళ్లీ వైఎస్ స్వర్ణయుగం వస్తుంది
విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జలగం వెంకట్రావు

ఖమ్మం, న్యూస్‌లైన్ ప్రతినిధి : ప్రజలు ఎన్నుకున్న నేతలు చంద్రబాబు కంటికి చాలా చులకనగా కనిపిస్తున్నారని, అందుకే ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆయన ఆరోపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘జగన్ ఎమ్మెల్యేలను కొంటున్నారని మీరు అంటున్నారు. ఆరోజు ఎన్టీఆర్ ఎన్ని కోట్లు ఇస్తే మీరు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు? ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వైస్రాయ్ హోటల్‌లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలకు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ప్రజలు ఎన్నుకున్న నేతలంటే మీకు అంత చులకనా’’ అని చంద్రబాబును నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సోమవారం విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విశ్వసనీయత అనే మాటకు బాబుకు అర్థం తెలియదని విజయమ్మ చెప్పారు. 

‘‘వైఎస్ పాలన స్వర్ణయుగం. అందుకే వైఎస్ ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. మీది శ్మశానయుగం. అందుకే మిమ్మల్ని ప్రజలు ఛీత్కరించారు. ఇచ్చిన మాట మీద నిలబడి వైఎస్ ఉచిత విద్యుత్‌తో పాటు ప్రజా సంక్షేమం కోసం డజన్లకొద్దీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. విశ్వసనీయత అంటే ఇదే. జగన్ ఓదార్పు యాత్రకు వస్తే ప్రజలు అతనిపై చూపిన అభిమానం ప్రజల విశ్వసనీయతకు నిదర్శనం. జగన్ జైల్లో ఉన్నప్పటికీ, అన్ని పార్టీల నాయకులు ఆయనపై అభిమానంతో వస్తున్నారు. ఇది విశ్వసనీయత అన్న విషయం మీరు తెలుసుకోవాలి. 2009 ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి పోటీలో దిగి పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చెత్తబుట్టలో పడేయలేదా? ఇదేనా మీ విశ్వసనీయత’’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘2012లో 50 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో సగం స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు దక్కలేదు. రెండు ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీ డిపాజిట్ గల్లంతైంది. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు’’ అని అన్నారు. అసలు టీడీపీ ఎన్టీఆర్‌దా.. నీదా.. అని బాబును విజయమ్మ ప్రశ్నించారు. టీడీపీ ఆయనదని చెప్పి నాడు మీడియాను బాబు మేనేజ్ చేశారన్నారు. ఎన్టీఆర్ చనిపోయేలా వెన్నుపోటు పొడిచిన బాబును ప్రజలు విశ్వసించరని చెప్పారు. 

పాదయాత్రతో బాబు మహానాటకం

‘‘వైఎస్ మరణం తర్వాత ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు మలమల్లాడుతున్నారు. ఇదేమని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాబు నోరు విప్పడంలేదు. అవిశ్వాసం పెట్టమంటే పెట్టడంలేదు. పైగా పాదయాత్రతో మహానాటకం అడుతున్నారు’’ అని విజయమ్మ దుయ్యబట్టారు. మీ కోసం పేరుతో మిమ్మల్ని వంచించడానికి వస్తున్న చంద్రబాబు మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ‘‘బాబు హయాంలోనే నాలుగు వేల మంది రైతులు ఆత్మార్పణ చేసుకున్నారు. 

ఇప్పుడు ఉచిత విద్యుత్, రుణాలు మాఫీ అని బాబు చెబుతున్న కల్లబొల్లి మాటలను నమ్మవద్దు. వ్యవసాయం శుద్ధ దండగని చెప్పిన బాబు ఇప్పుడు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం బాబు హయాంలోనే ఆలమట్టి నిర్మాణం చేపట్టి, ఎత్తు పెంచింది. అప్పట్లో ఆయన గమ్మున ఉండడంవల్లే ఈరోజు కృష్ణా జలాలు రాష్ట్రానికి రావడంలేదు. సాగు నీటి ప్రాజెక్టులు కట్టండంటూ ప్రజలు నాటి బాబు ప్రభుత్వాన్ని గొంతెత్తి అర్ధిస్తే ఇంకుడు గుంతలు కట్టారు. గ్రామగ్రామానికి బెల్టు షాపులు తీసుకొచ్చిన ఘనత కూడా బాబుదే. వైఎస్ హయాంలో రైతన్న రారాజులా బతికాడు. 64 లక్షల మంది రైతులకు చెందిన రూ.12 వేల కోట్ల రుణాలను వైఎస్ మాఫీ చేశారు. అలాగే రూ.1,250 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ రద్దు చేయించారు’’ అని తెలిపారు. జగన్ బాబు మళ్లీ వస్తాడని, వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని ప్రజలకు విజయమ్మ భరోసా ఇచ్చారు. వైఎస్ పాలన కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలను ఆశీర్వదించాలని కోరారు.

చంద్రబాబు నిర్దోషి అని ఏ కోర్టు సర్టిఫికెట్ ఇచ్చింది?

చంద్రబాబుపై 35 కేసులు పెట్టినా, ఏదీ రుజువు కాలేదని ఆయన చెప్పుకుంటున్నారని, ఆయన నిర్దోషి అని ఏ కోర్టు సర్టిఫికెట్ ఇచ్చిందో చెప్పాలని విజయమ్మ అన్నారు. ‘ఏ కోర్టు విచారణ చేసి మీకు నిర్దోషని సర్టిఫికెట్ ఇచ్చింది? బతుకంతా స్టే తెచ్చుకుంటున్న మీరు న్యాయవంతులు, నిర్దోషులా? వైఎస్ దోషి అని ఏ కోర్టు చెప్పింది? అవినీతి మీరు చేసి.. ఇప్పుడు పాదయాత్ర అంటూ మహానాటకం అడుతున్నారు. బాబు అవినీతిపై నేను 18 అంశాలు, రెండు వేల పేజీలతో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే.. నెల రోజుల్లో విచారణ చేయమని సీబీఐని కోర్టు ఆదేశించింది. దానిపై విచారణ జరపడానికి మాత్రం సీబీఐ వారికి సిబ్బంది లేరట. అదే సీబీఐ జగన్‌పై సత్వరమే విచారణ అంటూ 10 నెలలు విచారించి అక్రమంగా జైల్లో పెట్టింది. ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు నాయుడని 2002లోనే తెహల్కా డాట్ కామ్ చెప్పిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. బాబు హయాంలో ఐఎంజీకి 800 ఎకరాలను రూ.50 వేలకే ధారాదత్తం చేశారు. 

ఎమ్మార్‌కు అతి తక్కువ ధరకు 535 ఎకరాలు కట్టబెట్టారు. కేజీ బేసిన్ గ్యాస్ మనకు దక్కకుండా, మనం రాష్ట్రం టెండర్లు వేయకుండా, రిలయన్స్ టెండర్లు వేస్తే బాబు చూస్తూ ఊరుకోలేదా? మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లకు బాబు కాదా సహాయం చేసింది. ఏ గైడ్‌లైన్‌తో బాబు వారికి సహాయం చేశారు? అదే వైఎస్ చేస్తే మాత్రం తప్పా’’ అని విజమమ్మ మండిపడ్డారు. బాబు, సీబీఐ కుమ్మక్కై వైఎస్‌ను దోషిగా నిలబెట్టిన విషయం ప్రజలే గమనించారని తెలిపారు. ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ రాష్ట్ర నేతలు జనక్‌ప్రసాద్, గట్టు రాంచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిట్టా బాలకృష్ణారెడ్డి, వంగపండు ఉష, లక్ష్మారెడ్డి, బాణోతు మదన్‌లాల్, కృష్ణా, ఖమ్మం జిల్లాల కన్వీనర్లు సామినేని ఉదయభాను, పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం జిల్లా పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, రవీందర్ నాయక్, చందా లింగయ్య, చాగంటి రవీందర్‌రెడ్డి, చాగంటి వసంత, కుంజా భిక్షం, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

వైవీ సుబ్బారెడ్డికి స్వల్ప అస్వస్థత

బహిరంగ సభలో వేదిక వద్ద జనం ఒత్తిడితో ఊపిరాడక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని స్థానిక మమత మెడికల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ఉమాకాంత్ ఆయనకు చికిత్స చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కోలుకున్న సుబ్బారెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనతోపాటు వైద్యులు ఉమాకాంత్, వెంకట్ తోడుగా వెళ్లారు.

తొక్కిసలాటలో కాదు..అనారోగ్యంతోనే సత్యం మృతి

ఖమ్మంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వచ్చిన జాల సత్యం (70) అనారోగ్యంతోనే చనిపోయాడని ఆయన కుమారుడు శ్రీనివాస్ చెప్పారు. తొక్కిసలాటలో ఆయన చనిపోయినట్లు కొన్ని చానళ్లలో వచ్చిన వార్తలు అవాస్తవమని శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. శ్రీనివాస్ కథనం ప్రకారం...సత్యం ప్రభుత్వ ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి ఫిట్స్ వస్తుంటాయి. వైఎస్ విజయమ్మను చూసేందుకు మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరాడు. ఆయన రైతుబజారు వద్ద పడిపోయాడని సాయంత్రం శ్రీనివాస్‌కు సమాచారమొచ్చింది. తాను వెంటనే అక్కడికి చేరుకొని, సత్యంను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని శ్రీనివాస్ తెలిపారు. సభ ప్రారంభం కాకముందే తన తండ్రి గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాడని తెలిపారు. డీఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ సత్యం తొక్కిసలాటలో మృతి చెందలేదన్నారు.
Share this article :

0 comments: