అనంత ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంత ఆదరణ

అనంత ఆదరణ

Written By news on Friday, November 9, 2012 | 11/09/2012

‘అనంత’లో ముగిసిన షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర
కర్నూలు జిల్లాలో ప్రవేశం.. ఘనంగా వీడ్కోలు పలికిన ‘అనంత’ జనం
జిల్లాలో 17 రోజులు.. ఐదు నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం.. 
షర్మిల పాదయాత్ర ముందు వెలవెలబోయిన బాబు యాత్ర 
పాదయాత్ర విజయవంతంతో కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో కలవరం 


అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎత్తిచూపడం.. కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడం లక్ష్యంగా మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లోని 63 గ్రామాలు, ధర్మవరం, గుంతకల్లు మున్సిపాల్టీలు, అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 17 రోజులపాటు 194.5 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర గురువారం సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరింది.

అక్కడ అనంతపురం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఘనంగా వీడ్కోలు చెప్పగా, కర్నూలు జిల్లా నేతలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్రలో లక్షలాది మంది జనం పాల్గొన్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో చంద్రబాబు జిల్లాలో చేసిన పాదయాత్రతో పోలిస్తే షర్మిల పాదయాత్రకు నాలుగింతల మంది ప్రజలు అధికంగా హాజరయ్యారని కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల నివేదికలు స్పష్టీకరిస్తోండటం గమనార్హం. షర్మిల పాదయాత్రకు అభిమాన జనసంద్రం ఉప్పొంగడంతో కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో కలకలం రేగింది. 

ఆ రెండు పార్టీల నేతలు రాజకీయ భవిష్యత్‌పై కలవరపడుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్ సమాధి వద్ద నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు షర్మిల అక్టోబరు 18న శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అక్టోబరు 23న షర్మిల పాదయాత్ర తాడిమర్రి మండలం దాడితోట సమీపంలో జిల్లాలో ప్రవేశించింది. షర్మిల జిల్లాలో అడుగుపెట్టడంతోనే ‘జన అభిమాన’ వాయుగుండం ఏర్పడింది.. ఆ వాయుగుండం నానాటికీ బలపడుతూ వచ్చింది. ఆ వాయుగుండం ధర్మవరం చేరేసరికి తుపానుగా మారింది. ఆ తుపాను రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో మరింత బలపడింది. జనసంద్రం ఉప్పొంగడంతో పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గురువారం షర్మిల కసాపురం నుంచి 5.2 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టారు. భారీ ఎత్తున చేరిన జనసందోహం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికింది.

ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు..
జిల్లాలో చరిత్రలో ఏ నాయకుడు నిర్వహించిన పాదయాత్రకు, బహిరంగ సభలకు హాజరుకాని రీతిలో షర్మిల పాదయాత్రకు జనం పోటెత్తారు. రికార్డు స్థాయిలో జనం షర్మిల అడుగులో అడుగేస్తూ కదం తొక్కడం టీడీపీ, కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుట్టించింది. అక్టోబరు 2న హిందూపురం సమీపంలోని సూగురు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. చంద్రబాబు యాత్రకు ఏమాత్రం జనస్పందన లభించలేదు.

ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు పాదయాత్ర జనస్పందన లేక నీరసించింది. దాంతో టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షర్మిల చేపట్టిన పాదయాత్రకు జనప్రవాహం పోటెత్తడం టీడీపీ శ్రేణులను కుంగదీసింది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పాదయాత్రతో పోలిస్తే షర్మిల పాదయాత్రకు నాలుగైదు రెట్లు అధికంగా జనం హాజరయ్యారని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలు ఆ పార్టీని మరింత కలవరపరిచాయి. 

ఇకపోతే ఈనెల 3న ఆరో విడత భూపంపిణీ ప్రారంభించడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తికి వచ్చారు. ఆ సభకు జనసేకరణకు సంబంధించి అధికారులకు, ఆ పార్టీ నేతలకు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ టార్గెట్లు పెట్టారు. జనసేకరణలో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అయినా.. సీఎం సభకు జనం తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న ధర్మవరం, గుంతకల్లు నియోజకవర్గాల్లో షర్మిల నిర్వహించిన పాదయాత్రకు రికార్డు స్థాయిలో జనం హాజరయ్యారు. ఇది కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న వారిలో అధిక శాతం యువతీ యువకులు, మహిళలు, వృద్ధులే కావడం గమనార్హం. యువత, మహిళలను అభిప్రాయ నిర్ణేతలు(ఒపీనియన్ లీడర్స్)గా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మహిళలు, యువత ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజయం ఉంటుందని తేల్చి చెబుతున్నారు. పలు ఎన్నికల్లో ఇది నిరూపితమైంది కూడా. ఇదే అభిప్రాయంతో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ శిబిరాలు గజగజ వణికిపోతున్నాయి.

చివరి రోజూ అదే ఆదరణ..
బుధవారం రాత్రి గుంతకల్లులోని టీటీడీ కల్యాణమండపం సమీపంలో గుడారాల్లో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అప్పటికే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. భారీ జనసందోహం మధ్య పాదయాత్రను ప్రారంభించిన షర్మిల నేరుగా కసాపురానికి చేరుకున్నారు. షర్మిల చేరుకునే సరికే కసాపురం జనసంద్రంగా మారింది. 

అక్కడ మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల.. బహిరంగసభలో ప్రసంగించారు. ఆ తర్వాత కసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆమె.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కసాపురం శివారులో హంద్రీ-నీవా కాలువ సమీపంలో మధ్యాహ్న భోజనం చేసిన ఆమె అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించిన షర్మిల భారీ జనసందోహం మధ్య కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు.

అక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జిల్లా ప్రజానీకం ఘనంగా వీడ్కోలు పలికింది. కర్నూలు జిల్లా ప్రజానీకం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గురువారం జిల్లా పరిధిలో 8.2 కిలోమీటర్ల దూరం షర్మిల పాదయాత్ర సాగింది. మొత్తం 17 రోజుల్లో 194.5 కిలోమీటర్ల దూరం జిల్లాలో నడిచారు.

రెండు రోజలు జ్వరం బాధించినా.. ఐదు రోజులు నీలం తుపాను ప్రభావం వల్ల ఎడతెరిపి లేని వర్షాలు కురిసినా షర్మిల పాదయాత్రను కొనసాగించారు. తన పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసిన ‘అనంత’ ప్రజానీకానికి ఆమె కృతజ్ఙతలు తెలిపారు. తమను ఆదరిస్తోన్న ‘అనంత’ ప్రజానీకాన్ని గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. షర్మిల పాదయాత్ర విజయవంతం కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నూతనోత్సాహంతో కదంతొక్కుతున్నాయి.
Share this article :

0 comments: