పెళ్లి, ఢిల్లీపై శ్రద్ధ.. జనంపై లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెళ్లి, ఢిల్లీపై శ్రద్ధ.. జనంపై లేదు

పెళ్లి, ఢిల్లీపై శ్రద్ధ.. జనంపై లేదు

Written By news on Wednesday, November 7, 2012 | 11/07/2012


 రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు పెళ్లి, ఢిల్లీపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఏమాత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నీలం తుపాను వల్ల రాష్ట్రం అతలాకుతలమై ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉంటే పీసీసీ అధ్యక్షుడి ఇంట్లో అట్టహాసంగా జరిగిన వివాహానికి హాజరుకావడం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం తప్ప ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే ముఖ్యమంత్రి తన పీఠం కాపాడుకోవడంపైనే దృష్టిని పెట్టారని విమర్శించారు.
తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా ముప్పు ఉండదని సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించి తప్పు చేశారన్నారు. మంత్రికి అందిన సమాచారం ఏమిటో, ఏ అంశాల ఆధారంగా అలా చెప్పారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుపాను వల్ల చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయగోదావరి, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో సహా కోస్తాలో భారీ నష్టాలు సంభవించగా... క్షేత్ర స్థాయిలోఎక్కడా ప్రభుత్వ యంత్రాం గం సహాయక చర్యలే చేపట్టడం లేదని ఆయన విమర్శించారు.

బాబు వడ్డీ మాఫీ కూడా చేయలేదు

అధికార దుర్వినియోగంతో ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో అవినీతి చీడపురుగులను ఏరేస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖుర్షీద్‌కు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రమోషన్ లభించిందని, ఐపీఎల్ కుంభకోణంలో పదవి కోల్పోయిన శశిధరూర్‌కు మళ్లీ పదవి ఇచ్చారని, గ్యాస్ ధర పెంపుదలను అడ్డుకున్న ఎస్.జైపాల్‌రెడ్డిని మాత్రం పెట్రోలియం శాఖ నుంచి అప్రాధాన్య శాఖకు మార్చేశారని విమర్శించారు. రిలయన్స్ అభీష్టానికి భిన్నంగా వ్యవహరించిన వారెవ్వరూ కేంద్రంలో మన జాలరని దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. అసలు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో రిలయన్సే శాసించిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో టీడీపీని నడుపుతున్నది రిలయన్స్ సంస్థేనని తాము తొలి నుంచి ఆరోపిస్తున్నామన్నారు. రిలయన్స్‌కు, చంద్రబాబుకు ఉన్న లావాదేవీల బంధంపై ఆయనే స్వచ్ఛందంగా విచారణను కోరాలన్నారు. వరద పర్యటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ‘‘బాబు ఇపుడు రుణాల మాఫీ గురించి మాట్లాడుతున్నారు... ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఇలాంటి సందర్భాలు వచ్చినపుడు రుణాలు రద్దు చేశారా? రద్దు మాట దేవుడెరుగు... వాటిపై వడ్డీనైనా మాఫీ చేశారా? కనీసం రుణాల రీషెడ్యూలింగ్ (వాయిదా) అయినా చేశారా? ’’ అని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి తనను ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆక్షేపించారు. ఆయన పాలనలో ప్రజలు అల్లాడిపోయారన్నారు. బాబు ప్రసంగాల తీరు చూస్తుంటే మళ్లీ సీఎం కావాలనే కోరికతో ఎంత దహించుకుపోతున్నారో అర్థమవుతోందన్నారు.


source:sakshi
Share this article :

0 comments: