ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు....

ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు....

Written By news on Saturday, November 24, 2012 | 11/24/2012

ఏ ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో 
వైఎస్ వేళ్ల మీద లెక్కేసి చెప్పేవారు
ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు
ప్రస్తుత సీఎంకు పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోతోంది
ప్రజల్ని పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెడతావు చంద్రబాబూ?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 37, కిలోమీటర్లు: 492.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. 

పజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాసంతో దించేయకుండా దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 37వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా కలుగొట్ల గ్రామానికి చెందిన శనగ రైతులు లక్ష్మీకాంతరెడ్డి, జమ్మన్న, ఆంజనేయులు, జాన్ పాషా షర్మిలను కలిశారు. ‘‘వేళాపాళా లేని కరెంటు కోతలతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నాలుగు గంటల కరెంటును నాలుగుసార్లు ఇడుస్తున్నారు. బోర్ల లోంచి నీళ్లు కాల్వకు మల్లేసరికి కరెంటు పోతాంది. తోటకు నీళ్లు పారలేదు. పంటంతా ఎండిపోయింది’’ అంటూ వారు ఆవేదన వ్యక్తంచేయడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వైఎస్ వేళ్ల మీద లెక్కేసి చెప్పేవారు

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు తుంగభద్ర నది నుంచి ఆర్‌డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల సమస్య ఉంటే నాన్నగారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆమె ప్రశ్నించారు.

జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు

‘‘కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్నను జైల్లో పెట్టించాయి. ఒక రోజు వస్తుంది. ఉద యించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో.. జగనన్నను కూడా అలాగే ఎవరూ ఆపలేరు. ఆ రోజున అన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో రైతన్నను రాజులా చూస్తాం. రాజన్న కల అయిన కోటి ఎకరాలకు నీటిని జగనన్న ఇస్తాడు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడు’’ అని షర్మిల ఉద్ఘాటించారు.

ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది..

‘‘ఉపాధి హామీతో రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది. ఉపాధి హామీ కింద వైఎస్సార్ ఉన్నప్పుడు రోజుకు రూ.90 నుంచి 120 పడేవి. ఇప్పుడు రోజుకు కనీసం రూ.30 కూడా పడటం లేదని, కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.18 కూడా పడటం లేదని అక్కా చెల్లెళ్లు చెబుతున్నారు. అవి కూడా రెండు వారాలకు ఒకసారి, మూడు వారాలకొకసారి ఇస్తున్నారట.. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీరుస్తాడు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపే తల్లుల ఖతాలో డబ్బులు వేస్తాడు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ.1000 చొప్పున వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పెన్షన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడు.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’ అని ఆమె హామీ ఇచ్చారు.

యాత్రకు నేతల సంఘీభావం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల యాత్రలో శుక్రవారం వేలాది మంది ఆమె వెంట నడిచి సంఘీభావం తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు, నేతలే కాకుండా వైఎస్సార్ సీపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, మాజీ మంత్రి కొండా సురేఖ, వైఎస్సార్ సీపీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సంకినేని వెంకటేశ్వరరావు, బాల మణెమ్మ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, డి.భాస్కర్‌రెడ్డి, చల్లా మధుసూధన్‌రెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కుమార్ యాదవ్, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి తదితరులు షర్మిల వెంట నడిచారు.

పాలు పితికి.. మిషన్ కుట్టి..

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా 37వ రోజు శుక్రవారం కలుగొట్ల నుంచి ప్రారంభమైన యాత్ర పోతులపాడు గేటు మీదుగా బొంకూరుకు చేరింది. కలుగొట్ల గ్రామంలో వేరుశనగ రైతులను, పత్తి రైతులను కలిసి షర్మిల వారి సమస్యలు తెలుసుకున్నారు. బొంకూరులో నల్లాల వద్ద బిందెలు పెట్టుకుని నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న మహిళలను పలకరించారు. వారం రోజులకు ఒక సారి నీళ్లు వదులుతారని, తాగడానికి నీళ్లు లేవని మహిళలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి చంద్రశేఖర్ నగర్, శ్రీనివాస నగర్ మీదుగా కలుకుంట్ల చేరుకున్నారు. అక్కడ స్థానిక మహిళలతో కలిసి కుట్టు మిషన్ కుట్టారు. పాలు పితికారు. అక్కడి నుంచి రాత్రి 7.40కు బూడిదపాడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. శుక్రవారం 14.50 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 492.40 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.
Share this article :

0 comments: