రోజులు: 57, కిలోమీటర్లు: 824 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజులు: 57, కిలోమీటర్లు: 824

రోజులు: 57, కిలోమీటర్లు: 824

Written By news on Saturday, December 15, 2012 | 12/15/2012

ఈ ప్రభుత్వం ఫీజులు కడుతుందన్న భరోసా విద్యార్థులకు లేదు
దీంతో చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు
ప్రభుత్వ వైఖరి చూస్తూ కూడా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 57, కిలోమీటర్లు: 824

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం విషయంలో విద్యార్థులకు భరోసా లేకుండా పోయిందని, ప్రభుత్వం తమ ఫీజులు కడుతుందో లేదోనన్న భయంతో చాలా మంది చదువులు మానేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘కొంతకాలం కిందట రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన చ దువుల తల్లి వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంది. మరే విద్యార్థికీ ఇలాంటి దుస్థితి రాకుండా ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ జగనన్న నాడు వారం రోజులు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేశారు. అయినా ఈ సర్కారుకు కనువిప్పు కలగలేదు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఫీజుల పథకానికి తూట్లు పొడుస్తోంది. ఏ ఒక్క విద్యార్థికీ కూడా ఈ ప్రభుత్వం ఫీజులు కడుతుందనే భరోసా లేదు. ఎంతో మందికి చదువుకోవాలనే ఆశ ఉన్నా స్తోమత లేక, ప్రభుత్వం ఫీజులు కడుతుందన్న నమ్మకం లేక ఇంట్లో కూర్చుంటున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 57వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సాగింది. మార్గమధ్యంలో బడంగ్‌పేట్‌కు చెందిన ప్రణతి అనే విద్యార్థిని షర్మిలను కలిసి తాను ఎంబీఏ చదువుతున్నానని, ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో మేనేజ్‌మెంట్ తమపై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. డబ్బులు కట్టే స్తోమత లేదని, ఇక చదువు మానేసి ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు ధైర్యం చెప్పిన షర్మిల అనంతరం హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు మనసు రాలేదు..

‘‘రంగారెడ్డి జిల్లాలో నేను మర్చిపోలేని మరో సంఘటన ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అనురాధ అనే మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె వైద్యం చేయించుకోవడానికి ఏడాది పట్టింది. ఆపరేషన్ తరువాత ఆపరేషన్ అంటూ ఏడాది మొత్తం వైద్యంతోనే నడిచింది. అనురాధకు సహాయం చేసి అండగా నిలబడటానికి చంద్రబాబుకు మనసు రాలేదు. ఆమెకు వైద్యసాయం అందించాలని విద్యార్థులు ధర్నాలు చేసినా చంద్రబాబు చలించలేదు. 

పభుత్వ సహాయం కోసం అనురాధ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆయనకు మొట్టికాయ వేసి వైద్య ఖర్చుల కింద రూ. 5 లక్షలు చెల్లించాలని, ఆమెకు ఉద్యోగం కల్పించాలని తీర్పు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే ముఖ్యమంత్రి అనేవారు మానవతా దృక్పథంతో స్పందించాలి. చంద్రబాబుకు మానవత్వం అనేదే లేదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘అనురాధకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనురాధ ఒక్క మాట చెప్పింది.. ‘నాపై యాసిడ్ దాడి కంటే సర్కారు వ్యవహరించిన తీరే నన్ను చాలా బాధపెట్టింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది.’’ అని అన్నారు. వైఎస్సార్ సీఎం కాగానే ఆమెకు ఆర్థిక సాయం గా రూ.70లక్షలు, ఉద్యోగం ఇచ్చారని, ప్రస్తుతం ఆమె రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తోందని షర్మిల తెలిపారు. ప్రజలను పీడించిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమయ్యారన్నారు. ప్రజలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయాల్సిందిపోయి.. దానితోనే కుమ్మక్కై ప్రజలనే గాలికి వదిలేశారని విమర్శించారు.

పోటెత్తిన జనం..

పాదయాత్ర 57వ రోజు నాదర్‌గుల్ నుంచి నడక ప్రారంభించిన షర్మిల బడంగ్‌పేట్, మీర్‌పేట్ మీదుగా యాత్ర చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు ఆమె వచ్చే సరికి జనం కిక్కిరిసిపోయారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ఇంజాపూరు శివారులో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 16.30 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 824 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, శోభానాగిరెడ్డి, బాలరాజ్, రాజేష్, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వర్‌రావు, రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, బాజిరెడ్డి గోవర్ధన్, పుత్తా ప్రతాప్, బెక్కరి జనార్ధన్‌రెడ్డి, దేప భాస్కర్, దేప సురేఖ, సింగిరెడ్డి ధన్‌పాల్, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆదం విజయ్‌కుమార్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డాక్టర్ శివభారత్, జిట్టా, రవీంద్ర నాయక్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, వంగా మధు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: