బెయిలుపై ఉత్తర్వులకు ముందు బయటికొస్తున్న భూతాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెయిలుపై ఉత్తర్వులకు ముందు బయటికొస్తున్న భూతాలు

బెయిలుపై ఉత్తర్వులకు ముందు బయటికొస్తున్న భూతాలు

Written By news on Sunday, December 23, 2012 | 12/23/2012


తొలిసారి సీబీఐ కోర్టులో బెయిలు వేసినప్పటి నుంచీ ఇదే తీరు
అప్పట్లో టైమ్ చూసుకుని ‘బెయిల్ డీల్’ వ్యవహారం వెల్లడి
తరవాత హైకోర్టులో ఒక్కరోజు ముందు అనుబంధ చార్జిషీటు దాఖలు
సుప్రీంలో తొలుత లాయరును మార్చారంటూ మీడియాకు లీకులు
తీర్పునకు ఒక్కరోజు ముందు చిదంబరం ద్వారా టీడీపీ నేతల డ్రామా
వారు అడిగిన వెంటనే ‘ఈడీ’ ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు
ఇపుడు హైకోర్టులో బెయిలుపై ఉత్తర్వులకు ముందు కూడా అదే తీరు
ప్రతిసారీ బయటపడుతున్న సీబీఐ- కేంద్రం- టీడీపీల కుమ్మక్కు కుట్ర
ఎమ్మార్‌కు భూమిని కేటాయించిన బాబును విచారించనే లేదు
ఐఎంజీ కేసులో తమకు సిబ్బంది లేరంటూ తప్పించుకున్న సీబీఐ
అదే జగన్ కేసులోనైతే అన్నీ ఆగమేఘాల మీదే

అందరికీ అర్థమవుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా అదే పద్ధతి. పదే పదే అవే మాయోపాయాలు. ఒక్క వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు పన్నారో... ఆయనకు బెయిలు రాకుండా చేసేందుకు అంతకు మించిన కుట్రలు సాగిస్తున్నారు. జనహితాన్ని చూడాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం మూడూ కుమ్మక్కయి ఒక్క వ్యక్తిని అణిచేయటానికి అంతకంతకూదిగజారిపోతున్న వైనం బహుశా... ఇంకెక్కడా చూడలేమేమో!!

‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది ఈ ఏడాది మే 27న. అది కూడా కోర్టు సమన్లు అందుకుని... వాటి మేరకు మరో 24 గంటల్లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా. అది కూడా... మూడ్రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకబిగిన ఆయన్ను విచారించాక. అది కూడా... ఆయన్ను కనీసం విచారించకుండా మూడు చార్జిషీట్లు దాఖలు చేసేశాక.

? మరి దీన్నేమనాలి? కుట్ర కాక ఇంకేమనాలి? కోర్టుకు హాజరై పూచీకత్తు సమర్పించి బెయిలు తీసుకుంటే ఇక అరెస్టు చేయటం కుదరదనే హడావుడిగా అరెస్టు చేశారనుకోవద్దా? వెనక నుంచి ఎవరో నడిపించబట్టే అంతా స్క్రిప్టు ప్రకారం జరిపించారని అనుకోవద్దా? స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇలా వ్యవహరించవచ్చా?

బెయిలుకు ముందు ప్రతిసారీ...
అరెస్టు కుట్రను ఇంత పచ్చిగా కళ్లకు కట్టిన సీబీఐ... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పిటిషన్ వేసినపుడు కూడా అడ్డగోలు వాదనలే చేసింది. సరికదా... ఆ బెయిలుపై తీర్పు మరికొద్ది గంటల్లో వస్తుందని అనుకున్న ప్రతిసారీ.. ఏదో ఒక హైడ్రామాకు తెర లేపుతూనే ఉంది. ఒకటా రెండా... ఇప్పటిదాకా వై.ఎస్.జగన్ బెయిలుపై తీర్పు వెలువడిన ప్రతిసారీ ఈ పథకాన్ని అమలు చేస్తూనే వస్తోంది.

జడ్జిలను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో...?
అరెస్టయిన వెంటనే దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై జూన్ 1న కోర్టు తీర్పు వెలువరించింది. కాకపోతే ఆ తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు సీబీఐ చేసిన పనేంటో తెలుసా? గాలి జనార్దనరెడ్డి బెయిలు కోసం జడ్జిలకు ముడుపులిచ్చిన వ్యవహారాన్ని బయటపెట్టడం. అప్పటికి నాలుగురోజుల ముందే తమకు అందిన సమాచారాన్ని... సమయం కోసం కాసుకు కూర్చుని మరీ బెయిలుపై తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు బయటకు వెల్లడించింది. నిజానికి ఈ వ్యవహారాన్ని బయటపెట్టడాన్ని గానీ, మీడియాకు చెప్పటాన్ని గానీ ఎవ్వరూ ప్రశ్నించలేదు. కాకుంటే ఆ బయటపెట్టిన సమయంపై మాత్రం తీవ్రస్థాయి సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే తమకు ఆ సమాచారం అందినా దాన్ని ఎందుకు బయటకు వెల్లడించలేదన్న విషయమై సీబీఐ నుంచి సైతం సరైన సమాధానం రాలేదు. ఇదంతా జగన్‌కు బెయిలివ్వటంపై ప్రభావాన్ని చూపించిందని, ఆయనకు బెయిలివ్వాలంటేనే జడ్జిలు భయపడే స్థాయిలో సీబీఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని రాజకీయ నేతల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. అవి నిజం కాదని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు కూడా.

అనుబంధం పేరిట హైకోర్టులో కూడా...
సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. వాదప్రతివాదాలు జరిగాయి. చివరకు జూలై 4న ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతే! సీబీఐ మళ్లీ తన కుట్రకు పదును పెట్టేసింది. మరికొన్ని గంటల ముందు... అంటే జూలై 3న అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. అపుడెపుడో మార్చి 31న దాఖలు చేసిన తొలి చార్జిషీటుకు అనుబంధమంటూ కొన్ని పత్రాలు దాఖలు చేసింది. వాటిలో కొత్త అంశాలేవీ లేవని, ఈ కేసులో ఏదో ఉందని... బెయిలిస్తే ప్రమాదమని న్యాయవ్యవస్థకు సంకేతాలివ్వటానికే సీబీఐ ఇలా చేసిందని విమర్శలు సైతం వచ్చాయి. మరోవంక ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఒక వర్గం మీడియాలో పతాకస్థాయి కథనాలు వెలువడ్డాయి. షరా మామూలే. వాటిలో కొత్త విషయాలేవీ లేకపోయినా ఒక సంచలనం సృష్టించే ప్రయత్నం మాత్రం చేశాయి.

లాయరు మారారంటూ మీడియా లీకులు...
ఇది మరీ ఘోరం. దిగజారుడుకు పరాకాష్ట అనే చెప్పాలి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెయిలు కోసం సుప్రీంకోర్టులో జగన్ అప్పీలు చేయటంతో సీబీఐ చిత్రమైన విన్యాసాలు చేసింది. బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... సీబీఐకి రెగ్యులర్‌గా వచ్చే లాయరు మారారని, ఆయన బదులుగా వచ్చిన ప్రభుత్వ న్యాయవాదికసలు మాట్లాడటమే రాదని, చట్టం గురించే తెలియదని చెబుతూ ఒక వర్గం మీడియా విష ప్రచారానికి దిగింది. సీబీఐ ఈ లీకుల్ని పెంచి పోషించింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో రాజీకొచ్చారని, అందుకే లాయరును మార్చి ఉండవచ్చని ఆ మీడియా వండి వార్చేసింది.

? అసలు ఏ న్యాయవాది ఉంటే ఏం? సీబీఐ చెప్పే వాదననే కదా ఆ లాయరు వినిపించేది? అంతా ప్రభుత్వ న్యాయవాదులే కదా? ఏం... చదువుకోకుండానే, ప్రతిభ లేకుండానే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సొలిసిటర్ జనరళ్లు అయిపోతారా? ఇంత ఘోరమైన వాదన ఎక్కడైనా ఉంటుందా? ఒక లాయరు కారణంగా సీబీఐ కేసు గెలవటమో, ఓడిపోవటమో జరిగే పరిస్థితి ఉందా? ఎందుకిలాంటి కుట్రలు? మరి జగన్ కుమ్మక్కయితే బెయిలెందుకు రాలేదు? వీటికి సీబీఐ ఎప్పటికీ జవాబులు చెప్పలేదేమో!!

తెలుగుదేశం- కేంద్రం కలిసి మరీ కుట్ర...
మళ్లీ పాత లాయరు వచ్చి, వాదనలు పూర్తయి.. సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌పై ఉత్తర్వులు రాబోయే తరుణంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనున్నదనగా... నామా నాగ్వేరరావుతో సహా తెలుగుదేశం ఎంపీలు ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారు. వై.ఎస్.జగన్ ఆస్తుల్ని స్తంభింపజేయాలని కోరుతూ ఒక నోట్ సమర్పించారు. వారు కోరిన కొన్ని గంటల్లో... సాక్షికి సంబంధించిన కొన్ని ఆస్తులతో పాటు, సాక్షి ఇన్వెస్టర్లయిన హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఒక నోట్ విడుదల చేసింది. తరువాతి రోజు బెయిలును తిరస్కరిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

? అసలు తీర్పునకు కొన్ని గంటల ముందు టీడీపీ ఎంపీలు ఆర్థికమంత్రిని కలవటమేంటి...? వారు కోరినట్లుగా కొన్ని గంటల్లోనే ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఈడీ నోట్ విడుదల చేయటమేంటి? ఇదంతా ఎందుకు? ఈ కేసులో తామెలా వ్యవహరించాలని అనుకుంటున్నామో బయటకు స్పష్టంగా చెప్పటానికి కాదా? న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేయడానికి కాదా? ఈ కుట్రలు తెలియనిదెవరికి?

ధర్మాన ప్రాసిక్యూషన్‌తో మరో కుట్ర!
తనను అరెస్టు చేసింది మొదటి చార్జిషీటులోనని, అరెస్టుకు ముందే ఆ చార్జిషీటు దాఖలు చేశారు కనుక... అరెస్టు చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయలేదు కనక బెయిలివ్వాలని కోరుతూ గతనెల 16న సీబీఐ కోర్టులో జగన్ స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం గతనెల 29న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే స్టాట్యుటరీ అంశాన్ని ప్రస్తావించకుండానే తిరస్కరించటంతో దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. వాదప్రతివాదనలు ముగిశాయి. సోమవారం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

బెయిలు ఉత్తర్వులకు ముందు ప్రతిసారీ ఏదో ఒక భూతాన్ని బయటపెడుతున్నట్లు చేస్తున్న సీబీఐ ఈసారి కూడా అదే ఎత్తులకు దిగింది. వాన్‌పిక్ కేసులో నిందితుడైన రాష్ట్ర మంత్రి దర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ను తెరపైకి తెచ్చింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 10న ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని సీబీఐ అడిగింది. న్యాయ సలహా పేరిట ప్రభుత్వం నాలుగు నెలలు నాన్చింది. చివరకు ఇటీవలే తిరస్కరించింది. ఇన్నాళ్లూ కిమ్మనకుండా ఊరుకున్న సీబీఐ... సరిగ్గా బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... అసలు మంత్రి ప్రాసిక్యూషన్‌కు తమకు ప్రభుత్వ అనుమతేమీ అక్కర్లేదంటూ ఈ నెల 13న తాము కోర్టులో వేసిన మెమోను సీబీఐ లీకు చేసింది.

? మంత్రి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేనపుడు మరి ఇన్నాళ్లూ సీబీఐ దానికోసం ఎందుకు పట్టుబట్టినట్లు? ఈ నెల 13న గోప్యంగా వేసిన మెమోను ఇప్పుడెందుకు బయటపెట్టినట్లు? ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నరు వ్యతిరేకిస్తూ ఆ ఫైలును తిరిగి ప్రభుత్వానికి పంపటంలో ఆంతర్యమేమిటి? ఇదంతా సరిగ్గా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నట్లు? ఓ వర్గం మీడియా దీనికి పతాక శీర్షికలు కట్టి ఎందుకు ప్రాధాన్యమిస్తోంది? ఇదంతా సీబీహైడ్రామా కాదని ఎవ్వరైనా చెప్పగలరా?

బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కూ ఇప్పుడే అనుమతా?
ఇంకా చిత్రమేంటంటే హైకోర్టు తీర్పు కొన్ని గంటల్లో వెలువడనున్న ఈ తరుణంలోనే... సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. నిజానికి ఆయన ఏడు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసింది కూడా.

? మరి సీబీఐ విచారించాక... ఇదే సమయంలో కేంద్రం ప్రాసిక్యూషన్‌కు ఓకే చేస్తూ ఉత్తర్వులిచ్చిందంటే ఏమనుకోవాలి? ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి వాటా లేదని ఎవ్వరైనా చెప్పగలరా? కాంగ్రెస్-టీడీపీల కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం నడుస్తోందని చెప్పటానికి ఇంకా ఆధారాలేమైనా కావాలా? అసలు మోపిదేవిని, ధర్మానను ప్రాసిక్యూట్ చేయటానికి తమకు ఎవ్వరి అనుమతీ అవసరం లేదని చెబుతున్న సీబీఐ...ఈ ఫైళ్లన్నీ క్లియర్ కావటానికి కారణమైన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ను ఇప్పటిదాకా ఎందుకు విచారించలేదు? ఆయన్నెందుకు పట్టించుకోవటం లేదు?

బాబు మాత్రం సీబీఐకి వీఐపీయే...
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నుంచి బెయిలు వరకూ అడుగడుగునా కుట్ర బుద్ధి చూపిస్తున్న సీబీఐ... ఎందుకనో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాత్రం ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. ఎమ్మార్ కేసులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటమే కాక... హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 535 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు కోసం, శ్రీమంతుల విల్లాల కోసం కారుచౌకగా కట్టబెట్టేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ... ఈ కేసులో కూడా లేని లింకుల్ని వెదుకుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబీకులను, సన్నిహితులను వేధించటానికే ప్రయత్నించింది. అసలు 535 ఎకరాల స్థలాన్ని సింగిల్ టెండరు వేసిన సంస్థకు పోటీ లేకుండా ఎందుకు కట్టబెట్టారో, అలా చేయటం ద్వారా చంద్రబాబు ఏం లబ్ధి పొందారో తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంత పెద్ద కేసులో విచారణ జరుపుతూ... సింగిల్ టెండరుపై భూమి కట్టబెట్టేసిన బాబును కనీసం విచారణకు సైతం పిలవలేదు. ఆయన్ను విచారించకుండానే తంతు ముగించేసింది కూడా.

? మరి దీన్నేమనాలి? చంద్రబాబుకు సీబీఐ ఎందుకు కొమ్ము కాస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టనని మాట ఇచ్చి... దాన్ని కాపాడుతూ వస్తున్నందుకా? కేంద్రంలో సైతం అంశాల వారీగా తన ఎంపీలను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించేస్తున్నందుకా? సీబీఐ అనేది ఒక దర్యాప్తు ఏజెన్సీయా? లేక అధికార పార్టీకి అనుబంధ సంస్థా?

అదేజగన్ అయితే అన్నీ ఆగమేఘాలే...
చంద్రబాబునాయుడి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేస్తే... దానిపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశిస్తే మూడు వారాల పాటు ముందుకే కదల్లేదు ఈ సీబీఐ. అదే జగన్‌మోహన్ రెడ్డి కేసుకు వచ్చేసరికి మాత్రం కోర్టు ఉత్తర్వులు వెలువడిన 48 గంటల్లోనే మన్నూమిన్నూ ఏకం చేసేసింది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలు, నివాసాలు, ఇన్వెస్టర్ల కంపెనీలు, ఇళ్ళమీద మూకుమ్మడి దాడులు చేసింది. దేశంలో ఏ కేసులోనూ చేయలేని స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి... దాడులు చేసి ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించింది.

? ఇదంతా ఎందుకు? తమతో విభేదిస్తే ఎలా ఉంటుందో చెప్పటానికా? ఆ రకంగా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికా? సీబీఐ... దాని వెనకున్న పార్టీల ఉద్దేశాలు కనిపించటం లేదా?

కేసు వేయించటం నుంచే మొదలైన కుట్ర..
రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక... ఆయన తనయుడికి రాష్ట్రంలో అభిమానం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో కేసు వేయించటమే ఈ కుట్రకు ఆరంభం... పరాకాష్ట కూడా. దాన్లో తెలుగుదేశం నేతలు జత కల వటం దిగజారుడుతనానికి, అపవిత్ర కలయికకు తారస్థాయి తప్ప మరొకటి కాదు. ఇంకా చిత్రమేంటంటే ఈ కేసులో ప్రతివాదులుగా ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వ విభాగాలే ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది. అయినప్పటికీ ఈ కేసులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానిది తప్పో, ఒప్పో తేలకుంటే ఈ కేసే లేదు. అలాంటి కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వకున్నా... ఆ ఒక్క కారణంతో కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి అభిప్రాయం కారణంగా తీర్పు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేసింది.

? అసలు ఈ కేసేంటి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు కొందరు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని. మరి ఈ ప్రాజెక్టుల్ని, కాంట్రాక్టుల్ని కట్టబెట్టినపుడు నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అడ్డగోలుగా ఏమైనా కట్టెబెట్టేశారా? అన్నీ నిబంధనల ప్రకారం జరిగి ఉంటే వారు ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ప్రతీదీ జీవోల మేరకు జరిగిందే కదా? మరి ఆ జీవోలు తప్పో, ఒప్పో ప్రభుత్వం చెప్పాలి కదా? ప్రభుత్వం కోర్టుకు సమాధానమెందుకు చెప్పలేదు? జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించడానికి కాదా? మరి ఇన్నాళ్లూ ఊరుకుని, ఇపుడు ఆ జీవోలిచ్చిన మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహాయం అందించి మరీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఎందుకు వేయిస్తోంది? ఆ జీవోల్లో ఎలాంటి తప్పూ జరగలేదని ఇపుడు సుప్రీంకోర్టుకు చెబుతున్న ఆ సెక్రటరీలు... మంత్రులు హైకోర్టులోనే ఈ విషయం చెప్పి ఉంటే ఈ కేసు ఉండేదా? జగన్ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండేదా? ఒక్క జగన్ కోసం ఆది నుంచీ పథకం ప్రకారం ఈ కుట్రను నడిపించారని చెప్పటానికి ఇంకా ఏం కావాలి? అసలు వీళ్లని ఏమనుకోవాలి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉండగా వేనోళ్ల పొగిడిన నేతలు... ఆ తరవాత అధికారం కోసం ఇంత నైచ్యానికి దిగజారిపోవటం జనానికి తెలియటం లేదనుకోవాలా?


వాన్‌పిక్ అంటే ఐఎంజీలాంటి ప్రాజెక్టు కాదే?
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులన్నీ ప్రైవేటు పరమయ్యాయి. కాకినాడ పోర్టయితే మరీ ఘోరం. నిక్షేపంగా నడుస్తున్న పోర్టును... ఆదాయం తెస్తున్న పోర్టును... విస్తరణకు నిధుల్లేవన్న కారణంతో ప్రైవేటు పరం చేశారు చంద్రబాబు. అది కూడా తన సన్నిహితుడు, మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడి సంస్థకే. పెపైచ్చు దాన్లో తన సన్నిహిత సంస్థ ఎల్ అండ్ టీకి వాటా కూడా ఇచ్చారు. ఆ సంస్థ విస్తరణ మరిచి, ప్రభుత్వానికి లీజు చెల్లించకుండా ఆదాయం సాధించి... దాన్నే పెట్టుబడిగా విస్తరించినా కిమ్మనలేదు. పెపైచ్చు దానికి అనుకూలంగా నిబంధనలనూ మార్చేశారు. పెపైచ్చు ఐఎంజీ, ఎమ్మార్ వంటి సంస్థలకు రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. ఇవేవీ పట్టించుకోని సీబీఐ... ఎమ్మార్ విషయంలో తాము బాబుపై విచారణ జరపబోమని, ఐఎంజీపై దర్యాప్తు జరపడానికి తమ దగ్గర తగినంత సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ... ఎక్కడో వెనకబడిన ప్రకాశం జిల్లాలో... సముద్ర తీరాన ఉన్న భూములను పోర్టు కోసం వాన్‌పిక్‌కు కేటాయిస్తే మాత్రం క్షమించరాని తప్పిదమంటూ యాగీ చేస్తోంది. ఆ భూములతో పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారంటూ అడ్డగోలుగా వాదిస్తోంది.

? ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఆ వాన్‌పిక్ పోర్టును చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే స్కోడా కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేయటం సీబీఐకి తెలియదా? స్కోడా కంపెనీ వెనక్కి వెళ్లిపోవటం వల్లే కదా వాన్‌పిక్ తెరమీదికి వచ్చింది? అసలు ఈ పోర్టు ప్రతిపాదన చేసింది చంద్రబాబే కదా? ఇవన్నీ సీబీఐ ఎందుకు మరిచిపోతోంది?

వెనకబడిన జిల్లాలో పోర్టుకోసం భూముల్ని కొని భారీ ప్రాజెక్టును మొదలుపెట్టిన పారిశ్రామిక వేత్తలెవరూ అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలా తక్షణమే లాభాలిస్తుందని ఆశించరు. అదేమీ విల్లాల ప్రాజెక్టులా తక్షణమే లాభాలనిచ్చే ప్రాజెక్టూ కాదు. పోర్టు నిర్మాణం పూర్తయి పని ప్రారంభించిన తరవాత మాత్రమే అలాంటి పారిశ్రామిక వేత్తలకు ఆదాయం లభిస్తుంది. అదీగాక, వాన్‌పిక్ ప్రాజెక్టును వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది ఒక కంపెనీకేమీ కాదు. ఒక ప్రభుత్వానికి. రస్ అల్ ఖైమా దేశానికి. ఆ దేశానికైనా, ఆ ప్రభుత్వానికైనా ఇక్కడ పనులను చూసుకోవటానికి స్థానిక ప్రతినిధి ఒకరు ఉండక తప్పదు. ఆ స్థానిక ప్రతినిధిగా అప్పటికే పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను రాక్ ప్రభుత్వం ఎంచుకుంది. ఇదంతా సీబీఐకి కనిపించకపోవటంలో విచిత్రమేమీ లేదనే అనుకోవాలి. ఎందుకంటే అది నడుస్తున్నది ఆది నుంచీ రాంగ్ రూట్లోనే. కొందరు పెద్దలు చెబుతున్న రూట్లోనే.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54776&Categoryid=1&subcatid=1
Share this article :

0 comments: