నేటి మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో షర్మిలకు శస్త్రచికిత్స .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో షర్మిలకు శస్త్రచికిత్స ..

నేటి మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో షర్మిలకు శస్త్రచికిత్స ..

Written By news on Tuesday, December 18, 2012 | 12/18/2012

మోకాలిలో లేటరల్ మెనిస్కస్, మీడియల్ కొల్లేటరల్
లిగమెంటుకు బలమైన గాయాలైనట్టు వైద్యుల నిర్ధారణ
సర్జరీ తర్వాత 3 వారాలపాటు విశ్రాంతి తప్పనిసరి
దీంతో పాదయాత్ర మూడు వారాలపాటు వాయిదా
గాయం తగిలిన రోజు ఆగకుండా 4 కిలోమీటర్లు నడిచిన షర్మిల.. దాంతో పెరిగిన గాయం తీవ్రత

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మోకాలికి అయిన గాయం తీవ్రత ఊహించినదానికంటే అధికంగా ఉందని, శస్త్రచికిత్స అత్యవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మంగళవారం అపోలో ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్స అనంతరం కనీసం మూడు వారాలు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ మేరకు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర వాయిదా పడింది. షర్మిల కోలుకోగానే తిరిగి రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుంచే పాదయాత్రను కొనసాగించనున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వెల్లడించారు. వాస్తవానికి మంగళవారం ఉదయమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పగా.. షర్మిల తన అన్న జగన్‌మోహన్‌రెడ్డిని చూశాకే ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబడుతున్నారని అన్నారు. దీంతో మంగళవారం ఉదయం జైలుకు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వచ్చాక మధ్యాహ్నం శస్త్రచికిత్స చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు.

రెండు రకాల గాయలు..

షర్మిలకు ఆదివారం చేసిన ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులు సోమవారం అందాయి. వాటిని పరిశీలించిన వైద్యులు.. ఊహించినదానికంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, షర్మిల మోకాలిలో రెండు రకాల గాయాలయ్యాయని నిర్ధారణకొచ్చారు. మోకాలిలో ‘లేటరల్ మెనిస్కస్’ భాగం కొంత మేర తెగిపోయి పాడైందని, దాన్ని తొలగించి మిగతా భాగాన్ని బాగుచేయాల్సి ఉందని ఆర్థోపెడిక్ వైద్యులు సోమశేఖరరెడ్డి, రఘువీరారెడ్డి, శివభారత్‌రెడ్డి తెలిపారు. ఇక మీడియల్ కొల్లేటరల్ లిగమెంటుకు పాక్షిక గాయమైందని, అయితే అది అతుక్కోవడానికి కనీసం మూడు వారాలు పడుతుందని చెప్పారు. అత్యవసరంగా శ్రస్త్ర చికిత్స చేయాలని, లేకుంటే నొప్పి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అపోలో ఆసుపత్రిలో కీహోల్ శస్త్ర చికిత్స నిర్వహిస్తామన్నారు. శస్త్ర చికిత్సకు సుమారు ఒక గంట సమయం పడుతుందని, బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వారు చెప్పారు. ఆపరేషన్ అనంతరం కాలుకు సిమెంటు పట్టీ వేస్తామని, ఈ పట్టిని కనీసం మూడు వారాలు తీయకుండా ఉంచాలన్నారు. కనీసం మూడు వారాలకు పైగా విశ్రాంతి తీసుకుంటేనే దెబ్బతిన్న లిగమెంటు తిరిగి పూర్వపు స్థితికి వస్తుందని ఆయన చెప్పారు. మూడు వారాల తర్వాత పట్టీ విప్పి పరిస్థితిని సమీక్షించాక.. మరింత కాలం విశ్రాంతి అవసరమా లేదా అన్నది చెప్తామన్నారు. కాగా సోమవారం అపోలోలో షర్మిలకు పలు వైద్య పరీక్షలు చేశారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు

సోమవారం షర్మిల జన్మదినం కావడంతో ఆమె బస చేసిన ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు తీరారు. నడిచేందుకు కాలునొప్పి సహకరించకపోయినా ప్రజల ఆకాంక్ష మేరకు వాహనంపై ఉన్న రెడీమేడ్ వేదిక మీదకు ఎక్కి ఆమె కేక్ కోశారు. తన కోసం వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. షర్మిల జన్మదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. షర్మిలను పరామర్శించిన వారిలో వైఎస్ వివేకానందరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బి. జనార్ధన్, దేప భాస్కర్ రెడ్డి, గోనె ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

గాయమైనా నడవడం వల్లే పెరిగిన తీవ్రత..

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యాత్ర 57వ రోజు శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా బీఎన్‌రెడ్డి నగర్‌లో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించి దిగుతుండగా ఎడమ కాలు జారి ముందుకు తూలిపడబోతూ.. షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలికి మెట్లు బలంగా గుద్దుకున్నాయి. తీవ్ర నొప్పితో కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. 

డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. తర్వాత కాలు నొప్పిని లెక్క చేయకుండా ఆమె బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కిలోమీటర్లు నడిచి అక్కడ బస చేశారు. ఉదయానికి నొప్పి మరింత తీవ్రమవడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆమె దానికి ససేమిరా అన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి యాత్ర చేస్తానని ఆమె పట్టుబట్టగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఆమెను వద్దని వారించారు. కనీసం రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించడంతో అందుకు షర్మిల అంగీకరించారు. అయితే మరుసటిరోజుకు నొప్పి మరింత పెరగడంతో వైద్యులు ఆమెను దిల్‌సుఖ్‌నగర్ కోనార్క్ ఆసుపత్రికె తీసుకెళ్లి ఎమ్మారై స్కానింగ్ చేశారు. మోకాలికి దెబ్బ తగిలిన రోజు.. ఆమె ఆగకుండా మరో 4 కిలోమీటర్ల పాటు నడవడంతో గాయం తీవ్రత పెరిగిందని వైద్యులు వెల్లడించారు.
Share this article :

0 comments: