అశ్రునయనాల నడుమ కిరణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అశ్రునయనాల నడుమ కిరణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు

అశ్రునయనాల నడుమ కిరణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి 
- అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు
- నివాళులర్పించిన విజయమ్మ, భారతి, పలువురు నేతలు
- వైఎస్ వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ
- ఆరోగ్యశ్రీ రూపకల్పనలో చురుకైన పాత్ర
వైఎస్సార్సీపీ కోశాధికారిగా అవిరళ కృషి 

సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ కోశాధికారి పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్‌రెడ్డి మృతిచెందారు. కొద్దినెలలుగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ కొంతకాలంగా చికిత్స పొందుతుండగా, మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.21 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 53 ఏళ్లు. ఆయనకు భార్య(శాంతి), కుమార్తె(ఐక్య) ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో భారీ సంఖ్యలో తరలివచ్చిన అప్తులు, మిత్రులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య కిరణ్ భౌతికకాయానికి అంత్యక్రి యలు జరిగాయి. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని అపోలో ఆసుపత్రి నుంచి మణికొండలోని ఆయన నివాసగృహానికి, ఆ తరువాత అక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అయ్యాక ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రోగపీడితులైన వారికి ఆర్థిక సాయం మంజూరు చేయించే బృహత్తరమైన బాధ్యతలను తొలుత ఆయన నిర్వహించారు. నిపుణులు, ఇన్సూరెన్స్, ఆర్థిక రంగ ముఖ్యులతోనూ చర్చించి ఆరోగ్యశ్రీ పథక రూపకల్పనలో ఎంతో కృషి చేశారు. 108, 104 పథకాలను పకడ్బందీగా అమలు కావడం వెనుక కూడా ఆయన కృషి ఉంది. రైతుల శ్రేయస్సు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిని దృష్టి లో ఉంచుకుని ‘హరితశ్రీ’ అనే పథకాన్ని కూడా ఆయన రూపొందించాలని భావించారు. వైఎస్‌తో తన అనుబంధం, పేదల పట్ల ఆయన ఆవేదన గురించి ఒక పుస్త కం రాయాలని భావించారు. ఈ కలలు సాకారమవ కుండానే కిరణ్ మృతిచెందడం అందర్నీ కలచి వేసింది. 

విజయమ్మ, భారతి నివాళి: కిరణ్‌కుమార్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మృతి వార్త తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మణికొండలోని కిరణ్ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. సమాచార హక్కు చీఫ్ కమిషనర్ జన్నత్ హుస్సేన్, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ ముగ్గురు సోదరులు వివేకానందరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీకర్‌రెడ్డి, రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి కూడా ఇంటివద్ద నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి ఆయన పార్థివ శరీరాన్ని తెచ్చినపుడు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయనకు జోహార్లు అర్పించారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ఎన్.అమరనాథరెడ్డి, ముఖ్య నేతలు ఎస్.రామకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎం.వి.మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సాక్షి ఫైనాన్షియల్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాదరెడ్డి, ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్, ఐఏఎస్ అధికారి కృష్ణమోహన్‌రెడ్డితోసహా పలువురు కిరణ్ భౌతికకాయాన్ని సందర్శిం చి నివాళులర్పించారు. కిరణ్ మరణవార్త తెలుసుకుని ఢిల్లీనుంచి బయల్దేరిన జాతీయ సలహామండలి సంయుక్త కార్యదర్శి కె. రాజు విమానం ఆలస్యమవడంతో అంత్యక్రియల సమయానికి చేరుకోలేకపోయారు. తర్వాత చేరుకుని సంతాపంప్రకటించారు. 

జీవిత విశేషాలు: నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామానికి చెందిన కిరణ్ సీఏ అభ్యసించి తొలుత బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తరువాత బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఏడీగా పనిచేశారు. సెర్ప్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు. వైఎస్ మరణం తరువాత కొంతకాలం విజయమ్మకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ స్థాపించినపుడు పార్టీ కోశాధికారిగా నియుక్తులయ్యారు. మరణించేవరకూ అదే పదవిలో ఉంటూ పార్టీ నిర్మాణంపై తన దృష్టిని సారించారు. 
Share this article :

0 comments: