భస్మాసుర ‘హస్తం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » భస్మాసుర ‘హస్తం’

భస్మాసుర ‘హస్తం’

Written By news on Monday, December 31, 2012 | 12/31/2012

ఉప ఎన్నికల్లో పరాజయాల పరంపర.. సీనియర్ నాయకుల మధ్య వర్గ పోరు.. మంత్రులు, సీనియర్ల అసమ్మతి రాజకీయాలు.. తెలంగాణ ఎంపీల ఆందోళనలు.. సీనియర్ ఎంపీల అలకలు.. కొందరు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు.. అన్నిటికీ మించి పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు.. 127 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 2012 సంవత్సరం ముచ్చెమటలు పట్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పన్నిన కుయుక్తులు భస్మాసుర హస్తంగా మారి ఆ పార్టీనే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. జగన్ లక్ష్యంగా సాగుతున్న క్విడ్ ప్రో కో కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులివ్వగా.. అందులో మోపిదేవి వెంకటరమణ జైలుపాలయ్యారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేయాల్సి వచ్చింది.

అసమ్మతి సెగలు: అసమ్మతి రాజకీయాలకు కొదవే లేదు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు జానారెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి వంటి నాయకులు ఏడాది పొడవునా సీఎంపై అసమ్మతి రాజకీయాలు నడిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైతే అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంతో ఈ ఏడాది మంత్రి పదవులు దక్కించుకున్న సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులలో రామచంద్రయ్య సీఎంకు వైరి వర్గంగా మారి అవసరమైనప్పుడల్లా అసమ్మతికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. 

24 స్థానాల్లో 22 ఘోర పరాజయం: ఈ ఏడాది మొత్తం 1 పార్లమెంట్, 24 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఘోర పరాజయంపాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 10 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడి రికార్డుల్లోకెక్కింది. తొలుత తెలంగాణ కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. రాజీనామా చేసిన వారిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు (జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య) కూడా ఉన్నారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో ఓటమి పాలైంది. మిగిలిన రెండు స్థానాల్లోనూ ప్రతిపక్ష టీడీపీ సహకారంతో విజయం సాధించి మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలను నిరూపించింది. ఇక జగన్ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాలి రాజేష్ అధికార పార్టీకి రాజీనామా చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టింది. కాగా మజ్లిస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటం కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్ద షాక్.
Share this article :

0 comments: