ఎరువుల ధరలను దించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎరువుల ధరలను దించండి

ఎరువుల ధరలను దించండి

Written By news on Saturday, December 15, 2012 | 12/15/2012

రెండు దశాబ్దాలుగా సాగు లాభసాటిగా లేదు 
ప్రధాని మన్మోహన్‌కు విజయమ్మ లేఖ

హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశ ఆహారభద్రతను, రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని.. పెంచిన ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయానికి ప్రధాన అడ్డంకిగా మారిన సమస్యలను కూలంకషంగా వివరిస్తూ విజయమ్మ శుక్రవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. ‘దేశం మొత్తం మీద 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత పనుల మీదే బతుకుతున్నారు. ఆహారభద్రత పరంగానే కాకుండా వ్యవసాయం ఎక్కువ మందికి జీవనోపాధిగా ఉంది. దేశంలో ఆహారధాన్యాల దిగుబడి 1951లో 50 మిలియన్ టన్నులు ఉండగా 2012 నాటికి 250 మిలియన్ టన్నులకు చేరింది. పాల ఉత్పత్తిలో భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఉద్యానవనంలో ద్వితీయస్థానంలో ఉంది. 

ఇంతటి ఘనచరిత్ర ఉన్న దేశ వ్యవసాయరంగం వృద్ధిరేటు రోజు రోజుకు క్షీణిస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవసాయం నాలుగు శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2.5 శాతానికి మించటంలేదు. ఫలితంగా వ్యవసాయం రెండు దశాబ్దాలుగా లాభసాటిగా లేకుండా పోయింది’ అని విచారం వ్యక్తం చేశారు. ‘కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన అందుకు మినహాయింపు. ఆయన చేపట్టిన కొన్ని పథకాలతో పాటు.. రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించటం వల్ల 2004-09 మధ్య కాలంలో రాష్ట్రం 6.87 శాతం వ్యవసాయవృద్ధి రేటు సాధించింది. దేశంలో తొలిసారిగా భారీ వృద్ధి సాధించటంతో పాటు సగటు ఎకరా దిగుబడి పెంచటంతో రైతులు అధిక రాబడులు సాధించారు’ అని విజయమ్మ తెలిపారు. పంట అధిక దిగుబడికి నీటిపారుదల తర్వాత ముఖ్యభూమిక పోషించేది ఎరువులేనని విజయమ్మ పేర్కొన్నారు. 

‘ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నాలుగేళ్లుగా ఈ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు. ధరల భారం రైతులపైనే పడుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఎరువుల ధరలు ఎలా పెరిగిందీ ఆమె ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ‘డీఏపీ ధర 150 శాతం పెరగగా, ఎన్‌పీకే 200 శాతం పెరిగింది. అలాగే ఎంఓపీ కూడా 300 శాతం పెరిగింది. ఇంతకు ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. అయితే రెండేళ్ల కాలంలో వరి మద్దతు ధర కేవలం 25 శాతం మాత్రమే పెరిగింది. ఎరువుల ధరలు, ఇతర పెట్టుబడులు విత్తనాలు, డీజిల్, కూలీల ధరలు పెరగటంతో రైతులు భరించలేకపోతున్నార’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక పెద్దమనసు చేసుకొని దేశ ఆహారభద్రత దృష్ట్యా ఎరువుల ధరలను తగ్గించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విజయమ్మ అభ్యర్థించారు.
Share this article :

0 comments: