’ఆరోగ్యశ్రీ’ కిరణ్ ఇకలేరు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ’ఆరోగ్యశ్రీ’ కిరణ్ ఇకలేరు!

’ఆరోగ్యశ్రీ’ కిరణ్ ఇకలేరు!

Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012

Written by RM Basha On 12/26/2012 7:23:00 PM (sakshi)
ప్రజా శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా భావించిన అతికొద్ది మంది అధికారుల్లో ఒకరాయన. పేద ప్రజలకు ఆరోగ్య సిరిసంపదలను విజయవంతంగా అందించిన వ్యక్తి.. ప్రజా ఆరోగ్యం బాగుపడటానికి అనుక్షణం శ్రమించిన శ్రామికుడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేసి ఎందరో అధికారులకు స్పూర్తి ప్రదాతగా నిలిచిన వ్యక్తి.. ప్రజా సమస్యలకు సెలవుండదని ప్రగాఢంగా విశ్వసించిన ఆరోగ్యశ్రీ రూపశిల్పి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్ రెడ్డి మరణం రాష్ట్రంలోని పేద ప్రజలందరిని దుఃఖంలో ముంచింది.

క్యాన్సర్ వ్యాధితో కొద్ది నెలలుగా చికిత్స పొందుతున్న కిరణ్ మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత 12.21 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య (శాంతి), ఒక కుమార్తె (ఐక్య) ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఇ.ఎస్.ఐ శ్మశానవాటికలో భారీ సంఖ్యలో తరలి వచ్చిన అప్తులు, మిత్రులు, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య కిరణ్ భౌతిక కాయానికిఅంత్యక్రి యలు జరిగాయి. అంతకు ముందు ఆయన పార్థివ శరీరాన్ని ఆసుపత్రి నుంచి తొలుత మణికొండలోని ఆయన నివాసగృహానికి, ఆ తరువాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి తీసుకు వచ్చి నేతల అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

వైఎస్‌తో అనుబంధం

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి కిరణ్ ఆత్మీయుడైనప్పటికీ ఆయనతో కిరణ్ ప్రస్థానం 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యాక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రోగపీడితులైన వారికి ఆర్థిక సాయం మంజూరు చేయించే బృహత్తరమైన బాధ్యతలను తొలుత ఆయన నిర్వహించారు. ఖరీదైన చికిత్స చేయించుకోలేని లక్షలాది మంది ప్రజలకు ఆయన వై.ఎస్ ద్వారా తోడ్పాటును అందించారు. కార్పొరేట్ వైద్యం అందరికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా అందుబాటులోకి తీసుకు రావాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించడం ఒక్కటే చాలదని భావించిన కిరణ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపకల్పన చేశారు. ఇందు కోసం కొన్ని వందల గంటలు ఆయన నిపుణులతోనూ, ఆర్థిక రంగ ముఖ్యులతోనూ చర్చించి ఒక కొలిక్కి తెచ్చారు. స్వతహాగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కిరణ్ ఏ అంశాన్ని పట్టుకున్నా అందులోని ఆనుపానులన్నీ ఔపోసన పట్టే వారు. ఆరోగ్యశ్రీ పథకం పురుడు పోసుకుంటున్న సమయంలో తెర ముందు ప్రోత్సహించిన వ్యక్తి వై.ఎస్ అయితే తెర వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి వై.ఎస్.విజయమ్మ అని కిరణ్ ఎన్నో సార్లు తన అంతరంగిక చర్చల్లో వెల్లడించే వారు.

ఈ పథకం కింద లబ్ది పొందే వారి నుంచి కనీసం కొంతైనా ప్రీమియం రూపంలో వసూలు చేయాలని చర్చల సందర్భంగా కొందరు అధికారుల నుంచి వచ్చిన సూచనలను కిరణ్ తీవ్రంగా ప్రతిఘటించి ఎలాంటి వాటా లేకుండా ఈ పథకాన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ వర్తింప జేయాలని పట్టుబట్టి సాధించారు. లబ్ది దారుల నుంచి ఒక్క పైసా వసూలు చేసినా పేదలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం దెబ్బ తింటుందని ఆయన భావించారు. చివరకు ఈ పథకం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంత ఉపయోగపడిందో విశ్లేషకులందరికీ తెలిసిన విషయమే! వై.ఎస్ ముఖ్యమంత్రి కాక ముందు అసలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక విస్పష్టమైన విధానమంటూ ఉండేది కాదు. సామాన్య ప్రజలకైతే అదొకటుందనే విషయం కూడా తెలియదు. అలాంటి అంశాన్ని కిరణ్ చేతుల్లో పెట్టగానే దాని విధి విధానాలు పకడ్బందీగా రూపొందించి విస్తృత ప్రాచుర్యంలోకి తెచ్చారు.

దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటలలోపుగా సాయం అందే విధంగా కృషి చేయగలిగారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొన్ని వందల సంతకాలు ఆర్థిక సాయం దరఖాస్తులపై వై.ఎస్‌తో దగ్గరుండి కిరణ్ చేయించే వారు. ప్రతి రోజూ వై.ఎస్ తన క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు, పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అడుగుతూ ఉండిన ప్రశ్న ఒక్కటే ‘కిరణ్ ఏమైనా దరఖాస్తులున్నాయా...సంతకాలు చేయడానికి?’ అని. కిరణ్ కొన్ని వందల దరఖాస్తులపై సంతకాలు చేయించి గానీ ఆరోజు తన దినచర్యను ముగించే వారు కాదు.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సంతకాలు చేయించడం తప్పని సరిగా భావించే వారు. ఎందుకంటే ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఆర్థిక సాయం లేక చికిత్సకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారు కదా అనే భావనతోనే!

రైతుల శ్రేయస్సు, గ్రామీణ ఆర్థిక వ్యవ స్థ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ‘హరితశ్రీ’ అనే పథకాన్ని కూడా ఆయన రూపొందించాలని భావించారు. వై.ఎస్‌తో తన అనుబంధం, పేదల పట్ల ఆయన ఆవేదన గురించి ఒక పుస్తకం రాయాలని కిరణ్ భావించారు. ఈ రెండు కలలు సాకారం కాకుండానే ఆయన మృతి చెందడం అందరినీ కలచి వేసింది.

విజయమ్మ, భారతి నివాళి
కిరణ్‌కుమార్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మతి చెందిన వార్త తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాద్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్.భారతి మణికొండలోని కిరణ్ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. సమాచార హక్కు చీఫ్ కమిషనర్ జన్నత్ హుస్సేన్, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా ఇంటి వద్ద నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి ఆయన పార్థివ శరీరాన్ని తెచ్చినపుడు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయనకు జోహార్లు అర్పించారు. కిరణ్‌కుమార్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పార్టీ ఎం.పి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ఎన్.అమరనాథరెడ్డి, ముఖ్య నేతలుఎస్.రామకష్ణారెడ్డి, కొణతాల రామకష్ణ, ఎం.వి.మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, సాక్షి డెరైక్టర్ (ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వై.ఈశ్వరప్రసాదరెడ్డి, ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్, ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సి.ఇ.ఓ ఎ.చంద్రశేఖరరెడ్డి.ఐ.ఏ.ఎస్ అధికారి కష్ణమోహన్‌రెడ్డితో సహా పలువురు ప్రముఖులు కిరణ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

జీవిత విశేషాలు
నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామానికి చెందిన కిరణ్ సీఏ అభ్యసించి తొలుత బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తరువాత బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఏడిగా పనిచేశారు. సెర్ప్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా కూడా పనిచేవారు. 2004లో వై.ఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు. వై.ఎస్ మరణం తరువాత కొంత కాలం విజయమ్మకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు అందులో తొలి కోశాధికారిగా నియుక్తులయ్యారు. మరణించే వరకూ అదే పదవిలో ఉంటూ పార్టీ నిర్మాణంపై తన దష్టిని సారించారు. 23 జిల్లాల్లోనూ విస్తత పరిచయాలున్న కిరణ్ పార్టీ నిర్మాణం గురించే చివరి వరకూ తపించారు.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=54930&Categoryid=28&subcatid=0
Share this article :

0 comments: