మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట

మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట

Written By news on Saturday, December 8, 2012 | 12/08/2012

ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీల డుమ్మా
యూపీఏకు చంద్రబాబు ‘చే’యూత-చీకటి కుమ్మక్కు బట్టబయలు 
రాజ్యసభలో ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరు 
సుజనా చౌదరి, గుండు సుధారాణి, దేవేందర్ గౌడ్ డుమ్మా
ఢిల్లీలోనే ఉండి కూడా సభకు హాజరవని వైనం.. మీడియాకూ దూరం
కీలక ఓటింగ్‌లో యూపీఏను గట్టెక్కించేందుకు పరోక్ష సహకారం 
బాబు అనుమతి లేకుండా గైర్హాజరు కారంటున్న టీడీపీ సీనియర్లు 
మాయావతి, ములాయం బాటలోనే నడిచిన బాబు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే..
‘జగన్ వ్యతిరేక కుమ్మక్కు’కు కొనసాగింపు
మాయావతిపై అపనమ్మకంతోనే ఆయన సాయం కోరిన ‘ఢిల్లీ పెద్దలు’ 
ముందు రోజే ఫోన్‌లో మంతనాలు...ఆ మేరకు పక్కాగా వ్యూహరచన 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:తెర తొలగింది... చీకటిచాటున జరిగిన కుమ్మక్కు ఒప్పందాలు బట్టబయలయ్యాయి! అవసరానికి అనుగుణంగా ఒకరినొకరు ఆదుకుంటూ రాష్ట్రంలో చేతిలో చెయ్యేసి సాగుతున్న కాంగ్రెస్, టీడీపీ దోస్తీ మూలాలు దేశ రాజధానిలోనే ఉన్నాయని విస్పష్టంగా వెల్లడైంది. ఈ రెండు పార్టీల కుమ్మక్కు తంత్రం పార్లమెంటు సాక్షిగా రట్టయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సాగడానికి ‘అన్నివిధాలా’ సహకారం అందిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారుకు కూడా అదే తరహా అండదండలు అందిస్తున్న సంగతి బట్టబయలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదోలా అడ్డుకునేందుకు... తనపై కోర్టు కేసులు, సీబీఐ విచారణలను తప్పించుకునే లక్ష్యంతో కాంగ్రెస్‌తో చెట్టపట్టాలుగా ‘ముందుకు’ సాగుతున్న బాబు, అందులో భాగంగా ‘ఢిల్లీ పెద్దలతో’ కలిసి రచించిన తాజా నాటకం.. వారి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది! చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ రాజ్యసభలో విపక్షాలు పెట్టిన కీలక తీర్మానంపై ఓటింగ్ సమయంలో టీడీపీ చాకచక్యంగా అధికార పక్షంతో కరచాలనం చేసింది. 

ముందస్తు వ్యూహం ప్రకారం.. ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు! బీఎస్‌పీ అధినేత్రి మాయావతి బాహాటంగా ఇచ్చిన మద్దతు, ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ వాకౌట్‌తో చేసిన సాయం.. వారిద్దరి బాటలోనే టీడీపీ ఇచ్చిన తోడ్పాటు ఫలితంగా యూపీఏ కూటమి ఓటింగ్‌లో ‘ఘన విజయం’ సాధించింది. దాంతో కాంగ్రెస్ పెద్దలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్య కారణాల వల్లే సభకు హాజరు కాలేకపోయామని, డాక్టర్ అపాయింట్‌మెంట్లు ఉన్నాయని టీడీపీ ఎంపీలు చెప్పడం కేవలం కుంటిసాకుగానే కనిపిస్తోంది. నిజానికి తీవ్ర అనారోగ్యంతో ఉన్న జనార్దన్ వాఘ్మారే (మహారాష్ట్ర)ను స్ట్రెచర్‌పై, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్)ను వీల్‌చైర్‌పైనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు రప్పించింది. వారితో లాబీలోనే ఓటు వేయించింది. ఇటువంటి ప్రతిష్టాత్మక సమయంలో టీడీపీ ఎంపీలు చెబుతున్న సాకులు హాస్యాస్పదమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని చిరు వ్యాపారులు, రైతులందరి పాలిట పెను శాపమైన ఎఫ్‌డీఐని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజునుంచీ టీడీపీ గగ్గోలు పెట్టటం, చివరి నిమిషంలో ఆ పార్టీ ఎంపీలు గైర్హాజరు కావటం చూస్తే టీడీపీ ‘వ్యతిరేకత’ పెద్ద నాటకమని రుజువైందనే ప్రచారం విపక్షాల వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు అన్నా డీఎంకే నేత మైత్రేయన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచిన టీడీపీ.. అందివచ్చిన సువర్ణావకాశాన్ని ఇలా ఆవిరి చేస్తుందని అనుకోలేదంటూ బీజేపీ, వామపక్షాల నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది కూడా కంటితుడుపు చర్యేనని కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ రెండు పక్షాల ఎంపీలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

ముందే హోంవర్క్ చేసుకున్నాం..

రాజ్యసభలో నెగ్గే బలం తమకుందని మొదటినుంచీ చెప్తున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ ఆవరణలో ప్రస్తావిస్తూ.. ‘‘ఎలా నెగ్గామో చూశారు కదా! మేం ముందే హోంవర్క్ అంతా బాగా చేసుకున్నాం’’ అని గుంభనంగా వ్యాఖ్యానించారు. రాజ్యసభ మొత్తం బలం 245. ఒక స్థానం ఖాళీగా ఉండటంతో ప్రస్తుత సభా బలం 244. ఇందులో 15 మంది సభ్యులున్న బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది. 9 మంది సభ్యులున్న సమాజ్‌వాదీ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. లోక్‌సభలో ఎస్‌పీ, బీఎస్‌పీ రెండూ ఓటింగ్‌కు దూరంగా ఉండగా రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ముందే ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ వైఖరిపై పూర్తి విశ్వాసమున్న కాంగ్రెస్ పెద్దలు.. బీఎస్‌పీ సారథిని నమ్మడానికి లేదని, చివరి నిమిషంలో చేయిస్తే కొంప కొల్లేరవుతుందన్న ఉద్దేశంతో ముందే చేసుకున్న ఏర్పాట్లను తెరపైకి తీసుకొచ్చారు. 

కనీసం ఒక్క ఓటుతోనైనా గెలిచేలా అంకెల పావులన్నీ కదిపి అన్నీ సిద్ధం చేసి పెట్టారు. 244 మంది సభ్యులున్నప్పటికీ ప్రభుత్వానికి కచ్చితంగా ఓటేసే ఇద్దరు సభ్యులు మురళీ దేవరా (కాంగ్రెస్), సచిన్ టెండూల్కర్ (నామినేటెడ్) సభకు రాలేని పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర స్థాయిలో టీడీపీ ఇస్తున్న అండదండలనే ఢిల్లీలోనూ రహస్యంగా అందజేయాలని చంద్రబాబును కోరగా అందుకాయన వెంటనే సంసిద్ధత తెలిపి అంకెల గారడీ చేసినట్టు చెప్తున్నారు. పార్టీ ఎంపీలందరూ సభకు గైర్హాజరైతే కాంగ్రెస్‌తో తాను జట్టుకట్టిన సంగతి బాహాటంగా అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. యూపీఏ సర్కారు కనీసం ఒకటి రెండు ఓట్లతో గట్టెక్కేలా ముగ్గురు ఎంపీలను ఓటింగ్ సమయంలో సభకు దూరంగా ఉంచుతానని కాంగ్రెస్ వ్యూహకర్తలకు మాటిచ్చినట్టు తెలియవచ్చింది. బీఎస్‌పీ చివరి నిమిషంలోనైనా మనసు మార్చుకుని బయటకు నడవొచ్చన్న అంచనాతో కాంగ్రెస్ వ్యూహకర్తలు.. ఓటింగ్‌కు అరగంట ముందే టీడీపీ ఎంపీలు సభకు దూరంగా ఉండేలా చూడాలని బాబుకు శుక్రవారం ఉదయం ఫోన్ చేసి మరీ గట్టిగా చెప్పారని, ఆ మేరకు బాబు నుంచి వచ్చిన మౌఖిక ఉత్తర్వులను పాటిస్తూ ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా నిలిచారని బోధపడుతోంది.

స్ట్రెచర్లపైనే సభకు వాఘ్మారే, నేదురుమల్లి 

కీలకమైన ఓటింగ్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఎక్కడా రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అస్వస్థతతో బాధపడుతున్న ఎంపీలనే కాదు, విదేశాల్లో ఉన్న విజయ్‌మాల్యానీ రప్పించారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఇంటి నుంచి, ఆసుపత్రి నుంచి కదల్లేని స్థితిలో ఉన్న పార్టీ ఎంపీలిద్దరికి అన్ని ఏర్పాట్లూ చేసి మరీ ఢిల్లీకి రప్పించారు. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ జనార్దన్ వాఘ్మారే, రాష్ట్రానికి చెందిన నేదురుమల్లి జనార్దనరెడ్డి వచ్చి ఓటేసిన తీరు అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది. వాఘ్మారేను స్ట్రెచర్‌పై తీసుకురాగా, జనార్దనరెడ్డి వీల్ చైర్‌లో వచ్చారు. వారిద్దరూ రాజ్యసభ లాబీల్లోంచి ఓట్లు వేయడానికి అనుమతించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ స్వయంగా సభాధ్యక్షుడిని కోరగా ఆయన అంగీకరించారు. వారిద్దరూ అలాగే ఓట్లువేశారు. ఇక బ్రిటన్‌లో ఉన్న విజయ్‌మాల్యా ఈ ఓటింగ్‌లో పాల్గొనడం కోసమే ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీలో వాలారు. పార్లమెంటుకు వచ్చి ఓటేశాకఆయన మళ్లీ బ్రిటన్ బయల్దేరి వెళ్లారు.

టీడీపీ ‘ఎఫ్‌డీఐ నిబద్ధత’ ఇదీ...

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో తీర్మానాన్ని అన్నాడీఎంకే నేత మైత్రేయన్ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష నేతల్లో అరుణ్ జైట్లీ, సీతారాం ఏచూరి తదితరులతో పాటు టీడీపీ తరఫున సి.ఎం.రమేశ్ బలపరిచారు. ఎఫ్‌డీఐని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తీర్మానాన్ని తాము పూర్తిస్థాయిలో బలపరుస్తామని గురువారం సభలో ప్రసంగించిన సమయంలో సి.ఎం.రమేశ్ తీవ్రస్వరంతో ప్రకటించారు. తెల్లారేసరికి ఆయన ప్రకటించిన వ్యతిరేకతలోని డొల్లతనం బట్టబయలైంది. తీర్మానాన్ని బలపరిచిన సి.ఎం.రమేశ్‌తో పాటు మరో ఎంపీ హరికృష్ణ మాత్రమే టీడీపీ తరఫున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరు తీర్మానానికి అనుకూలంగా ఓట్లేశారు. ఇది కూడా బాబు-కాంగ్రెస్ పెద్దల వ్యూహంలోనే భాగంగా జరిగిందని తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లిన కారణంగానే ఓటింగ్‌లో పాల్గొనలేకపోయానని, ఈ విషయమై బాబుకు ముందే సమాచారం ఇచ్చానని దేవేందర్‌గౌడ్, బంధువు అస్వస్థతకు గురికావటంతో వెళ్లిన తనకు చివరి నిమిషంలో ఢిల్లీకి రావటానికి విమానం దొరకలేదని గుండు సుధారాణి శుక్రవారం రాత్రి తమ వ్యక్తిగత సహాయకుల ఫోన్ల నుంచి మీడియా ప్రతినిధులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. ఇది కూడా చంద్రబాబు సూచనల ప్రకారమే జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆ ముగ్గురూ అలా...
చంద్రబాబు నోటి నుంచి మాట రాకుండా ఓటింగ్‌కు గైర్హాజరయ్యేంత సీన్ ఆ ముగ్గురు ఎంపీలకూ లేనే లేదని టీడీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. పైగా వారు ముగ్గురూ శుక్రవారం ఢిల్లీలోనే ఉండి మరీ సభకు వెళ్లకపోవడం విశేషం! తీర్మానాన్ని బలపరిచిన సి.ఎం.రమేశ్ సభలో ఎలాగూ ఉండాలి కనుక మిగతా నలుగురిలో తన మాట వినే ముగ్గురిని బాబు ఎంచుకున్నారని, ఆయన చెప్పిన మేరకే వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గుండు సుధారాణి, సుజనా చౌదరి, దేవేందర్‌గౌడ్ సంగతి పరిశీలిస్తే.. చౌదరి గురువారం ఢిల్లీలో లేకున్నా శుక్రవారం మాత్రం నగరంలోనే ఉన్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. సుధారాణి గురువారం సి.ఎం.రమేశ్ రాజ్యసభలో ప్రసంగిస్తున్నంత సేపూ పక్కనే ఉన్నారు. ఆమె రాత్రికి రాత్రే నగరం విడిచివెళ్లటంలో ఆంతర్యం పార్టీ ఎంపీల్లో మిగిలిన వారెవరికీ తెలియదు. నిజానికి శుక్రవారం కూడా ఆమె ఢిల్లీలోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఇక దేవేందర్‌గౌడ్ ఢిల్లీలోనే ఉండి కూడా అనారోగ్యంగా ఉందంటూ ఓటింగ్‌కు వెళ్లలేదు. పైగా మామూలు సమయంలో మీడియాకు అందుబాటులో ఉండే ఈ ముగ్గురు నేతలూ శుక్రవారం మాత్రం రాజ్యసభకు గైర్హాజరు నేపథ్యంలో అసలు మీడియా ముందుకే రాకపోవడం గమనార్హం.


సమీకరణల అంచనాలు ఇలా...

రాజ్యసభలో పార్టీల సమీకరణలు చంద్రబాబు, కాంగ్రెస్ వ్యూహకర్తల రహస్య ఒప్పందాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. 244 మంది సభ్యులున్న సభలో మురళీదేవరా శస్త్రచికిత్స చేయించుకుంటున్నందున ఆయనను పార్లమెంట్‌కు తీసుకొచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలాగే, కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సభకు రాలేని స్థితిలో ఉన్నారు. ఈ ఇద్దరినీ కాంగ్రెస్ పెద్దలు తమ లెక్కల్లో నుంచి తీసేసి మిగతా బలాన్ని సరిచూసుకున్నారు. అది తేడాగా కనిపించడంతోనే టీడీపీ ఎంపీలు రాకుండా చూశారని తెలుస్తోంది.
సభ బలం 244లో మురళీదేవరా, సచిన్‌ని మినహాయిస్తే 242

రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేని సంగతి అందరికీ తెలిసిందే. మద్దతిస్తానన్న బీఎస్‌పీ సభ్యులు 15 మందిని, నామినేటెడ్ సభ్యులు 10 మందిని కలుపుకుంటే ప్రభుత్వ బలం 122. కానీ దేవరా, సచిన్‌ను మినహాయిస్తే సర్కార్ సత్తా 120. సభలో విపక్ష బలం సరిగ్గా 108 (టీడీపీకున్న ఐదుగురితో కలుపుకుని).
ఓటింగ్‌ను బహిష్కరించిన ఎస్‌పీ సభ్యులు 9 మందిని 242 లోంచి తీసేస్తే 233. అనివార్య కారణాలతో చివర్లో మరో సభ్యుడు ఎవరైనా రాలేకపోతే సభలో ఉండేది 232.

అలా 232 మంది కచ్చితంగా హాజరైన సమయంలో తీర్మానం వీగిపోవడానికి ప్రభుత్వ పక్షాన 117 మంది నిలవాలి. కానీ బీఎస్‌పీ సభ్యులు 15 మంది కూడా చివరి క్షణంలో బహిష్కరిస్తే.. సభలో ఉండేది 217. అప్పుడు ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సింది 109. ఇది విపక్షానికున్న బలం 108కి సరిగ్గా ఒకటి ఎక్కువ. ఈ ఒక్క ఓటు ఎటైనా గల్లంతైతే ప్రభుత్వ ప్రతిష్ట అంతే సంగతులు.

ఈ లెక్కల చిట్టాను ముందే తరచి చూసుకున్న కాంగ్రెస్ వ్యూహకర్తలు.. తెలివిగా టీడీపీతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని ఆ పార్టీకి వ్యూహాన్ని నిర్దేశించారు. ముగ్గురు ఎంపీలను రాకుండా చూస్తే చాలని చంద్రబాబుకు వారు చెప్పటం.. ఆ మేరకు బాబు ఆదేశాలివ్వటం, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి తెరపై కీలక క్షణాల్లో కనిపించకుండా ఉండటం జరిగిందని తెలుస్తోంది.

టీడీపీ ఎంపీలు ముగ్గురూ కూడా రాకపోవడంతో సభకు గైర్హాజరైన మొత్తం ఎంపీలు (సచిన్, దేవరాతో కలిపి) ఐదుగురయ్యారు. బహిష్కరించిన ఎస్‌పీ సభ్యులతో కలిపితే సభకు దూరంగా ఉన్నవారి సంఖ్య 14. మొత్తం సభ్యులు 244లో ఈ సంఖ్యను తీసేస్తే 230. ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సిన ఓట్లు 116. బీఎస్‌పీ మద్దతుతో సర్కారుకు దక్కిన మొత్తం ఓట్లు 123.

ఆ ముగ్గురూ ఓటేస్తే...

బీఎస్‌పీ కూడా వాకౌట్ చేసి, ఓటింగ్‌కు దూరంగా ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటుగా మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులూ సభకు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది: 244 - సచిన్ (1) - మురళీదేవరా (1) - ఎస్‌పీ (9) - బీఎస్‌పీ (15) = 218. ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సింది 110. ఈ పరిస్థితుల్లో సర్కారు గెలుపుపై కాంగ్రెస్‌కు అనుమానాలున్నాయి. చివరి నిమిషంలో ఒకరిద్దరు రాకుంటే ప్రభుత్వ ప్రతిష్ట గంగపాలయ్యేది. ఆ పరిస్థితి రాకుండా టీడీపీ సర్కారును భుజాలకెత్తుకున్న వైనం ఆవిష్కతమైంది.
Share this article :

0 comments: