రాష్ట్రంతో కాంగ్రెస్ చెలగాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంతో కాంగ్రెస్ చెలగాటం

రాష్ట్రంతో కాంగ్రెస్ చెలగాటం

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

 పదే పదే అఖిలపక్షమంటూ తెలంగాణ సమస్యపై నిర్లక్ష్యం 
- నిర్ణయం వారి చేతిలో పెట్టుకొని ఇతర పార్టీలపై నెపమెందుకు? 
- కాంగ్రెస్‌కు కోవర్టులా మాట్లాడుతున్న కేసీఆర్
- ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అడగరెందుకు? 

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణుల కారణంగా రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా, పారిశ్రామికంగా కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నదని దుయ్యబట్టారు. సున్నితమైన తెలంగాణ అంశంపై రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా కాంగ్రెస్ నిర్ణయం మాత్రం వెల్లడించలేదని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. పదే పదే అఖిలపక్షమంటూ సమస్యను కాంగ్రెస్ చులకన చేస్తోందని ధ్వజమెత్తారు.

నిర్ణయం వారి చేతిలో పెట్టుకొని ఇతర పార్టీలపై ఎందుకు నెడుతున్నారు? రాష్ట్ర భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలచుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంపై ప్రభావం చూపే చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), అణుఒప్పందంలాంటి కీలక బిల్లులపై నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సున్నితమైన తెలంగాణ అంశంపై ఎందుకు సాగదీస్తోందని నిలదీశారు. తెలంగాణ పట్ల తమ వైఖరిని పార్టీ తొలి ప్లీనరీలోనే అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.

కేసీఆర్ ద్వంద్వ వైఖరి: బాజిరెడ్డి
‘‘తెలంగాణను సంక్రాంతిలోపు తెస్తా, వచ్చే దీపావళి, దసరా నాటికి వచ్చేస్తది, నెల రోజుల్లో తెలంగాణ ఖాయం. మూడు నెలల్లో తెలంగాణ పక్కా అంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేత పూటకొకమాట మాట్లాడించిన అధిష్టానం ఎవరో ఆయన బయటపెట్టాలి’’ అని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.

‘‘అఖిలపక్షం పెద్ద ఫార్స్ అని చెప్తున్న కేసీఆరే... అదే అఖిలపక్షంలో అన్ని పార్టీలు తెలంగాణకు అవునా, కాదా అనేది స్పష్టం చేయాలని చెప్పడంలో ఉన్న మతలబేంటి?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తూనే అదే పార్టీకి కోవర్టుగా.. అనుకూలంగా మాట్లాడటం చూస్తే తమకు అనుమానం కలుగుతోందని చెప్పారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న మోసపూరిత వైనంపై నిలదీసేందుకు తాము సిద్ధమని, అందుకు కేసీఆర్ కూడా కలిసిరావాలని కోరారు.
Share this article :

0 comments: